ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ, తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎపి హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
1920-1921 విద్యా సంవత్సరం వృదా కాకుండా, విద్యార్థుల క్షేమం కోరి వివిధ రకాల వర్చువల్ (ఆన్లైన్) పాఠాలు బోధించడానికి ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అవసరమైతే నిబంధనలు విధించి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప పూర్తిగా ఆన్లైన్ పాఠశాలే చెప్పకూడదు అనడం సరికాదన్నారు. కోవిడ్-19 వల్ల ప్రభుత్వం తరచు లాక్ డౌన్ పొడిగిస్తున్నందున పిల్లలు అన్ని రకాలుగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. పిల్లలకు చదువు, ఇతర వ్యాపకాలు లేకపోవడం వల్ల మానసిక, శారీరక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు, అడ్మిషన్లు ఇప్పటికీ మొదలు కాలేదని తెలిపారు. డిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సిబిఎస్ఇ) వారు తమ ఆధ్వర్యంలోని పాఠశాలలకు ఆన్లైన్ పాఠాలు చెప్పమని సర్కులర్ ఇవ్వగా, ఎపి ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ పాఠాలు చెప్పరాదంటూ ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
మెజారిటీ తల్లి తండ్రులు ఆశయాలు, పిల్లల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో నిబంధనలతో కూడిన ఆన్లైన్ పాఠాల బోధనకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి పిటీషన్ లో హైకోర్టును కోరారు