(జువ్వెల బాబ్జి)
నేడు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలవుతుందని చెప్పుకుంటున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఖచ్చితమైన అమలు కోసం అందులో ఇంకా చేయాల్సిన చేర్పులు , మార్పులు కోసం, వేతనాల పెంపు కోసం, ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టారు .
ఇప్పటి వరకు అమలులో ఉన్న కుటుంబాల యూనిట్ గా 100 రోజుల పని దినాలను వ్యక్తుల యూనిట్ గా మార్చి పని కల్పించాలని ,కనీస వేతనాల లో మార్పులు చేసి జీవన వ్యయం ఆధారంగా స్థిరమైన జీవన భత్యం చెల్లించాలని మరికొన్ని ముఖ్యమైన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉపాధి కూలీల హక్కుల కోసం పని చేస్తున్న సంస్థలు ,సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఒక వేదికగా ఏర్పడి “ఉపాధి హక్కుల దినోత్సవం “అందరు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా గత ఏప్రిల్ నెల 22వ తేదీ నుండి COVID-19 నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే .
దీనివల్ల మూడు నెలలపాటు గ్రామీణ పేదలు స్థిరమైన ఆదాయం లేక కుటుంబాలు గడవని పరిస్థితి లోకి నెట్టి వేయబడ్డారు.దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుంటు పడిపోయే పరిస్థితి కి నెట్టివేయబడింది. ముఖ్యంగా, గ్రామీణ పేదల పైన ,వలస కార్మికుల పైన , లాక్ డౌన్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది.కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రకటించిన లాక్ డౌన్ నిర్ణయం వలన దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవలసి వచ్చింది.
ఎంతోమంది వలస కార్మికులు, చిరు వ్యాపారులు ,రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ పరిశ్రమలు మూతపడటంతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి స్వగ్రామాలకు తిరుగు బాట పట్టారు .దీనివలన దేశవ్యాప్తంగా నిరుద్యోగం, జీవనోపాధి సమస్య గ్రామాలకు చేరుకుంది. ఈ సంఖ్య కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 16 కోట్ల మంది. ఇది చిన్న సంఖ్య ఏమీ కాదు. యూరప్ లోని కొన్ని చిన్న చిన్న ధనిక దేశాల జనాభా తో సమానం. అంతమంది వలస కార్మికులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారే స్వయంగా ఇటీవల ఒక తెలుగు దినపత్రిక లో రాశారు. దాన్నిబట్టి ఇన్ని కోట్ల మంది కార్మికులు ఉపాధిని వెతుక్కుంటూ గ్రామాలలో బిక్కుబిక్కుమంటూ జీవన మనుగడ పోరాటం సాగిస్తున్నారని అర్థమవుతుంది.
ఇప్పుడు నిరుద్యోగ యువతకు, జీవనోపాధి సమస్య గ్రామాలలో ఒక్కసారిగా పెరిగిపోయింది. వీరిలో చాలామంది అలవాటులేని ఉపాధి పనులకు ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వెళ్లడం, గత రెండు నెలలుగా గ్రామాలలో కనిపిస్తున్న దృశ్యాలు. వీరి సమస్యలు పరిష్కరించడంలో లేదా వలస కార్మికులను వారి ,వారి స్వగ్రామాలకు చేర్చడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ,అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ,సోషల్ మీడియా వలస కార్మికుల బాధలను దేశ ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వాట్స్అప్, ఫేస్ బుక్ లో చూపించారు.
సరైన వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో, చాలామంది వలస కార్మికులు మండువేసవిలో కాలినడకన వందల కిలోమీటర్లు అన్నపానీయాలు లేకుండా గ్రామాలలో ఆదరించేవారు లేకుండా బిక్కుబిక్కుమంటూప్రయాణం చేయడం సొంత కుటుంబాల వారికి గుండెకోత తగిలిస్తే మానవత్వం ఉన్న వారిని కంటతడి పెట్టించింది , సరైన తిండి లేక కాళ్ళ క్రింద బొబ్బర్లతో నడిచి నడిచి నీరసించి, జ్వరాల బారిన పడి, డీహైడ్రేషన్ వలన శక్తిని కోల్పోయి, అనారోగ్యాల పాలు అయినప్పుడు ,కరోనా భయం వలన గ్రామాలలో వీరికి ఆశ్రయం కల్పించడానికి ప్రజలు ముందుకు రాలేదు.సమయానికి సరైన వైద్యం అందక ఎంతోమంది మార్గాల మధ్య లోనే ప్రాణాలు వదిలి వేయాల్సి వచ్చింది.
“తిండిలేక ,శ్రామిక రైల్లో ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్లో రైల్వే ప్లాట్ ఫాం పై మరణించిన ఒక తల్లిని తన ఇద్దరు చిన్నారులు లేపటానికి చేసిన ప్రయత్నం “వీడియో దేశ ప్రజలను కంటతడి పెట్టించింది ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వలస కార్మికుల చట్టం నిబంధన లకు పూర్తిగా విరుద్ధం అనే చెప్పాలి. చివరికి కి ఇటువంటి హృదయవిదారక సంఘటనలకు స్పందించిన సుప్రీంకోర్టు వలస కార్మికుల ప్రయాణాలకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించ వలసి ఇప్పుడు వలస కార్మికులు గ్రామాలకు చేరుకున్న తర్వాత వారికి ఉపాధి సమస్య తలెత్తడంతో, కుటుంబాలు గడుపుకోవడం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వీరిలో చాలామంది ఇప్పటివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏ విధమైనటువంటి జాబ్ కార్డులు లేనివారు. కొందరైతే, ఇప్పటివరకూ బయట ప్రాంతాలలో ఉండటం వలన వారు పనికి వెళ్లడానికి అర్హత కలిగిన జాబ్ కార్డులు లేని కారణంగా ఉపాధి పనులకు ఒక్కరోజు కూడా వెళ్ళలేని పరిస్థితులు అనేక మంది ఎదుర్కొంటున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని పొందాలంటే జాబ్ కార్డు తప్పనిసరి. అది ఒక లీగల్ డాక్యుమెంట్. అంతేకాకుండా,జాబ్ కార్డు ఉంటే సరిపోదు.కొత్తగా చేరిన వారినందరిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసిన తర్వాతనే ఉపాధి పనులు లభించే పరిస్థితి. వీరంతా తమ తమ గ్రామాలలో సరైన ఉపాధి లేక పూట గడవడం కోసం ఉపాధి పనులకు వెళ్లాలని నానా అగచాట్లు ,పడుతుంటే ప్రభుత్వాలు సకాలంలో వారికి జాబ్ కార్డులు ఇచ్చి పనులు చూపించలేని పరిస్థితిలో ఉపాధి పనులు పర్యవేక్షించే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లే వారిని పనులు కు వస్తామని కొత్తగా వచ్చిన వలస కార్మికులు సంప్రదిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల వద్దకు జాబ్ కార్డు దరఖాస్తులు పట్టుకు వెళ్లే వారిని చూస్తే మనకు వలస కార్మికుల దుస్థితి గోచరిస్తుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటివరకు ఇంకాపూర్తిగా వర్షాలు పడలేదు, వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు.ఈ పరిస్థితుల్లో బ్రతుకు తెరువు కోసం గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులంతా ఉపాధి పనులకు, ఎగబడటంతో ఒక్కసారిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు.
అయితే ,ఈ పథకం ద్వారా లభించే పని దినాలు కుటుంబానికి 100 రోజులు మాత్రమే పొందే అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, డిమాండ్ కు తగ్గట్టుగా పేదలకు పనులు చూపించడం సాధ్యమేనా? గ్రామీణ పేదలకు, వలస కార్మికుల కుటుంబాలకు పని కల్పించి వారిని ఆదుకోవడం, అలాగే వారికి ఆర్థిక భద్రత తో పాటు ఆహార భద్రత మరియు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత .
ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల హక్కుల కోసం, దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ సంఘాలు,సంస్థలు,మేధావులు ఒకే వేదిక పైకి వచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పోరాట వేదిక (సంఘర్ష్ మోర్చా) గా ఏర్పడి జూన్ 29 నాడు “ఉపాధి హక్కుల దినోత్సవం “నిర్వహించాలని ముందుకు రావడం స్వాగతించాల్సిన అంశం.
దీని పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ప్రభుత్వాల ముందు కొన్నిప్రధానమైన డిమాండ్లను ఈ వేదిక పెట్ట నున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో ఉపాధి కూలీలను సమీకరించి ,వారు పనిచేసే చోట ,బహిరంగ ప్రదేశాలలో ను, వివిధ రకాలైన బ్యానర్లు, పోస్టర్ల ద్వారా వారి హక్కుల గురించి తెలియజేసి , ఉపాధి కూలీల ను చైతన్య పరచాలని చూస్తున్నారు.
వారి హక్కుల సాధన కోసం ప్రజలను సమీకరించి హక్కుల సాధనలో వారిని కూడా భాగస్వాములను చేయాలని వేదిక భావిస్తుంది. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు, దరఖాస్తులను ,మండల ,జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, అలాగే గే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దేశ ప్రధాని గారికి సమర్పించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. సమాజంలో దుస్థితి నెలకొన్న సమయాలలో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఇది బ్రిటిష్ కాలంలో ఉన్న “ఫ్యామిన్ కోడ్”క్రింద చేపట్టిన అనేక సహాయ పనులు మనం పరిశీలించవచ్చు .
ఇటువంటి సంక్లిష్ట సమయాలలో, ప్రపంచవ్యాప్తంగా మధ్య , ప్రాచీన కాలం నుండి కూడా అనేక దేశాలు అమలుపరిచిన “కినిషన్” పెట్టుబడులు ఇటువంటి చర్యలకు ఉన్న ప్రాముఖ్యత లకు ఉదాహరణ లు. ఇటువంటి ప్రజానుకూల చర్యలు చేపట్టడం వల్ల కరువు సమయాలలో సంభవించే మరణాలు తగ్గిన వని భారతదేశంలో కరువుపై అధ్యయనం చేసిన నోబెల్” బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ “లాంటి మేధావులు నిరూపించారు.
అంతేకాకుండా, యునైటెడ్” డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్” ఆర్టికల్ 23 మరియు 6 ప్రకారం ప్రతీ కార్మికుడు లేదా కార్మికురాలు తనకు నచ్చిన పనిని ఎంపిక చేసుకునే హక్కును గుర్తించింది. ప్రభుత్వాలు ప్రజల యొక్క ,ఆర్థిక ,సామాజిక మరియు సాంస్కృతిక హక్కులను పరిరక్షించడం బాధ్యతగా పేర్కొంది.వీటి అమలు కోసం కృషి చేస్తానని భారత ప్రభుత్వం కూడా ఒప్పందం పైన సంతకం చేసింది.
ఇటువంటి పథకాలు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి పేద ప్రజలను ఆకలి దప్పులు నుండి కాపాడడానికి ఉపాధి కార్యక్రమాలు చేపట్టిన ట్లు ఆధారాలు ఉన్నాయి.కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ,కరవు సమయాల్లో ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా పనులు కల్పించాల్సిన అవసరం సూచించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో కరువు కాలంలో ,కూలీలు కోల్పోతున్న ఉపాధిని పూరించటానికి, చేపట్టిన తాత్కాలిక కార్యక్రమంగా ప్రభుత్వాలు భావించడం విచారకరం. ఇది పార్లమెంటు లో చేసిన చట్టం . కేంద్ర క్యాబినెట్ లో చర్చించి ఆమోదించి, పొందుపరచిన శాశ్వత పథకం. చట్టం యొక్క స్ఫూర్తిని ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకోవడం లేదు. అటు దీనిని కాపాడుకుని లబ్ధి పొందాల్సిన ఉపాధి కూలీలు కూడా ఉపాధి హామీ పథకం కం ప్రజలకున్న” రైట్ టు వర్క్”గా కాకుండా, వేసవికాలంలో కల్పించే కరువు పని గా భావించడం దురదృష్టకరం.
రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే, వర్షాధార ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు కృషి చేయడం ప్రభుత్వాల బాధ్యత .ప్రజల యొక్క హక్కుల దృక్పధాన్ని అవలంబించడం మరింత ఆవశ్యకం. కాబట్టి ,ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వారి జీవించే హక్కు లో భాగంగా అర్థం చేసుకో నంతా కాలం ,ఇది సక్రమంగా అమలు కాదు.
ఇంకా మూడవ అంశం,ప్రభుత్వ అధికారుల జవాబుదారీతనం,చాలా ముఖ్యమైనది. అడిగిన వెంటనే జాబ్ కార్డులు ఇవ్వడం, జాబ్ కార్డు కలిగిన వ్యక్తి అని అడిగితే 15 రోజుల గడువు లోపల పని కల్పించడం, పని చూపించలేని ఎడల నిరుద్యోగ భృతి చెల్లించడం చాలా ముఖ్యమైన అంశాలు. నాలుగవది, “పంచాయితీరాజ్ వ్యవస్థ”ను బలోపేతం చేయడానికి ఉపాధి పథకం ఆయుధం గా పనిచేస్తుంది. గ్రామ సభల నిర్వహణ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో వారి గ్రామాభివృద్ధికి కావలసిన పనులను గుర్తించడం, ప్రణాళికలు ,బడ్జెట్ లు తయారు చేయడం, పనులు పూర్తి చేసిన తరువాత, నాణ్యత ,ఖర్చుల గురించి తెలుసుకునే హక్కు ఉపాధి కూలీలు కలిగి ఉన్నారు. ప్రజలకు గుర్తించిన చేపట్టిన పనులు ,చేసిన ఖర్చు, చెల్లించిన వేతనాలు, పథకం అమలులో జరిగిన మంచి చెడులను తెలుసుకునే హక్కు ఉంది. కానీ గ్రామ సభలు అంటే సామాజిక తనిఖీల్లో భాగంగా ఏర్పాటు చేసే వే గ్రామ సభలు మాత్రమేనని అధికారులు ఉపాధి కూలీలు భావించడం బాధాకరం. రెండు రకాల గ్రామసభలు నిర్వహించాలి ఒకటి,పనులు గుర్తింపు కోసం. రెండవది,చేసిన పనులు సామాజిక తనిఖీ కోసం.ఇది అధికారులు కూడా గుర్తెరగాలి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ,12 ,914 పంచాయతీలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతుంది .అయితే చాలామంది కూలీలకు అడిగిన వెంటనే పనులు కల్పించడంలో అధికారుల వైఫల్యం చెందుతున్నారు . చేసిన పనులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వలన కూలీలు పనులకు రావడానికి విముఖత చూపుతున్నారు.దీనితో సిబ్బంది నకిలీ మస్టర్ లతో పనులు చేపట్టినట్లు టార్గెట్లు పూర్తిచేసి టార్గెట్లు పూర్తిచేసి అవినీతికి పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలు దారి మళ్లుతున్నాయి.
చట్టంలో పేర్కొన్న విధంగా, పని కల్పించని కాలంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. చెల్లింపులు ఆలస్యమైన సందర్భంలో ఇవ్వాల్సిన సొమ్ముకు అదనంగా వడ్డీతో కలిపి వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉంది. కనీస వేతనాలు నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వేతనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వేతనాలు కు చాలా వ్యత్యాసం ఉంది. అసలు ముందు వేతనాలను గుర్తించడంలో నే జిల్లా జిల్లాకు తేడాలున్నాయి. కోస్తాకు ఒక రేట్లు, రాయలసీమకు ఒక రేట్లు,ఉత్తరాంధ్రకు ఒక రేట్లు ఉంటున్నాయి.ఆయా జిల్లాల స్థాయిలో అవకాశాలను బట్టి ,జోన్ల వారీగా విభజించి ,జిల్లా కలెక్టర్లు కూలి రేట్లు నిర్ణయిస్తారు.జిల్లాలో ఉన్న ఒకే విధమైన మండలం, ఒకే విధమైన పని , వ్యవసాయ విధానం ఉన్నప్పటికిని,జోన్లు మారడం వలన కూలి రేట్లు లోతేడా ఉంటుంది.
2014 సంవత్సరంలో అప్పటి “సెవెంత్ పే కమిషన్ “నివేదిక ప్రకారం ప్రతి కుటుంబానికి జీవన వ్యయం ఆధారంగా నెలకు 18000./.రూపాయలు వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు .సరి కదా, చేస్తున్న వ్యవసాయ పనులకు ఒక్కో రాష్ట్రానికి ఒకలా,ఒక్కో జిల్లాకు ఒక్కో మండలానికి ఒకలా వేర్వేరుగా వేతనాలు చెల్లించడం రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 14 , 15 న కు విరుద్ధం. అంతే కాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ,జీవించే హక్కు గురించి మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఓల్గా తేల్లీ సు మరి కొంతమంది, వర్సెస్ బొంబాయి మున్సిపాలిటీ కార్పొరేషన్ మరికొంతమంది ఎయిర్ 19 86 ఎస్.సి .18 కేసులో పని హక్కు గురించి చాలా అద్భుతమైన తీర్పునిచ్చారు.
ప్రాథమిక హక్కులు అనేవి జీవించే హక్కు లో భాగంగా వారసత్వంగా లభించాయి అని స్పష్టం చేశారు. ఇదే రాజ్యాంగంలో పార్ట్ 4 లోని ఆర్టికల్ 41 ప్రకారం, ప్రజలకు పని హక్కు కల్పించడం రాష్ట్రాల యొక్క బాధ్యతగా ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి .కానీ వేతనాలు చెల్లించడంలో అధికారులు కూలీల హక్కులను గుర్తించకపోవడం విచారకరం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై రైతాంగం లో అనేక అపోహలున్నాయి .ఈ పథకం నిరుపయోగమైన దని, దీనివలన వ్యవసాయ పనులకు కూలీలు రావడంలేదని ,కూలి రేట్లు పెరిగిపోయాయని ,రైతులు నష్టాల పాలవుతున్నారని విమర్శిస్తున్నారు.
ఒకానొక సందర్భంలో ఈ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనగా, తూర్పుగోదావరి జిల్లాలో” క్రాప్ హాలిడే” కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పై రాజకీయ వత్తిడి తీసుకువచ్చారు .అప్పుడు ప్రభుత్వం పథకంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. రైతుల వాదనలో వాస్తవం లేదు.ప్రభుత్వాలు కూడా కూలీలకు పనులు దొరకని వేసవికాలంలోనే ఉపాధి పనులు చూపిస్తున్నారని అందరికీ తెలిసిన యధార్థం. మిగతా వ్యవసాయ పనులు అందుబాటులో ఉన్న కాలంలో, అధికారులు కూలీలకు పనులు చూపించడం లేదు. ఒక విధంగా గా ఇది కూడా చట్ట ఉల్లంఘన. ఎందుకంటే ,ఉపాధి కూలీ పని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే పని చూపించాలి. దరఖాస్తు చేసిన 15 రోజుల గడువు లోపల ఇవ్వాలి. సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా కోరిన వెంటనే పని కల్పించాలి. కానీ అలా ఇప్పటివరకు జరిగిన దాఖలాలు లేవు.
వాతావరణం చల్లబడి నేల అనుకూలంగా ఉన్న కాలంలో ,కూలీలకు పనులు చూపించడం లేదనేది వాస్తవం కాదా?… చాలా వరకు అసలు చేసే పనులు అన్ని వ్యవసాయ సంబంధమైన అభివృద్ధి పనులను రైతులు గుర్తించకపోవడం విచారకరం. వాస్తవానికి లేబర్ కాంపోనెంట నుండి మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఎక్కువ నిధులు మళ్లించారు. పథకం అమలులో లోపాలు ఉండవచ్చు. అది కూలీల తప్పెట్ల అవుతది? గానీ దీనివలన వ్యవసాయం నష్టపోతుంది అని చెప్పడం అన్యాయం .రైతులు పెరిగిన ఎరువులు ,విత్తనాల ధరలు కు వ్యతిరేకంగా, పండించిన పంటకు గిట్టుబాటు కానీ ధర లకు ప్రభుత్వం పైన పోరాడాలి. అంతేకాని ఉపాధి పథకం ఎత్తివేతకు కుట్ర చేయడం ,పేదలకు అన్యాయం చేసినట్లే అవుతుంది . 2006 సంవత్సరం నుండి ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చినప్పటికీ రెండు సంవత్సరాల పాటు దీనిలో కదలిక లేదు.
దీనిని గ్రహించిన వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ (ఏపీ.వి.వి. యు), యంగ్ ఇండియా ప్రాజెక్టు,దళిత బహుజన ఫ్రంట్, భూమి ఉపాధి హక్కుల వేదిక, ఇతర భాగస్వామ్య సంస్థలు , వామపక్ష పార్టీలు కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు పెట్టి ,ప్రభుత్వంతో చర్చలు జరిపి “అప్నా” అనే భాగస్వామ్య సంస్థ రావడానికి కృషి చేశారు. అందులో భాగంగా గా ఉపాధి నిధులతో పేదలకు పంచిన బీడు భూములను అభివృద్ధి చేయించడం, వాటిలో నాబార్డ్ నిధులతో బోర్లు వేయించడం, లాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టారు. దీనికి ప్రభుత్వం వైపు నుండి అప్పటి ఐఏఎస్ అధికారులు కొప్పుల రాజు గారు ,రెడ్డి సుబ్రమణ్యం గారు, మురళి గారు ,కరుణా గారు లాంటి అధికారులు ఎంతో సహకరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో ఈ పథకం అమలుకు సంఘాలు సంస్థలు సమిష్టిగా పాటు పడ్డాయి. ఒక విధంగా, ఉత్తర భారతదేశం తో పోల్చుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ పథకం కొంత మెరుగైన పద్ధతిలో అమలవుతుందని చెప్పవచ్చు.అయితే రాష్ట్ర విభజన అనంతరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లేదా ప్రస్తుతం వై.ఎస్.ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ పథకం అమలుకు కలిసివచ్చే సంస్థలతో లేదా సంఘాలతో కలిసి పని చేయడానికి సుముఖంగా లేనట్లు అర్థమవుతుంది. కారణాలు ఏమైనా ఉండవచ్చు, కానీ ఉపాధి పథకం ఖచ్చితమైన అమలుకోసం ,కలిసి వచ్చే వారిని కలుపుకొని, పేదల అభివృద్ధి కోసం పాటు పడటం ప్రభుత్వాల బాధ్యతగా భావించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న కుటుంబానికి వందరోజులు పని దినాలు మార్చి దాని స్థానంలో “వ్యక్తుల యూనిట్” గా పని దినాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే చాలా మంచి పరిణామం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమస్యను అర్థం చేసుకుని గ్రామీణ ప్రాంతంలో కూలీల డిమాండ్ ఆధారంగా ,ఇప్పటికే ఉన్న ఉపాధి కూలీల తో పాటు స్వగ్రామాలకు చేరుకొని ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నా వలస కార్మికులు కు జాబ్ కార్డులు ఇచ్చి వారికి కూడా ఉపాధి కల్పించాలని మేధావులు,ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం వారినందరిని లేబర్ సంక్షేమ బోర్డు కార్యాలయంలో పేర్లు నమోదు చేయించు కుంటే,కొంత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందడానికి అందరి వివరాలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లో నమోదు చేయించుకోవాలని 9 -6-20 20 నాడు కార్మికశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. దీనికి ముందు భారత కేంద్ర ప్రభుత్వం. 24- 3-2020 నాడు ,వలస కార్మికులను ఆదుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉన్న 20, 50,891 మందికి గాను,వీరిలో కేవలం 2,80,850 మందికి మాత్రమే బ్యాంకు ఎకౌంటు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. వీరంతా జూన్ 30 నాటికి లేబర్ ఆఫీసు లో వారి వివరాలను నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .
వేర్వేరు రాష్ట్రాల్లో చాలా కాలంగా జీవిస్తున్నందున, వలస భవన నిర్మాణ కార్మికులకు ,స్థానికంగా ఆధార్ కార్డు ఇవ్వాలంటే, బయట రాష్ట్రాలలో పనిచేసిన కాంట్రాక్టర్ల దగ్గర ధ్రువీకరణ పత్రాలుండాలి. ఇవి లభించడం సాధ్యమేనా? దానికి ఈ కాల వ్యవధి సరిపోతుందా? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపాలి. ఉపాధి కూలీల లో కూడా చాలామంది, కొంతకాలం ఉపాధి పనులకు ఈ పనులు లేని సమయంలో భవన నిర్మాణ పనులకు వెళుతుంటారు. కాబట్టి వీరిని కూడా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి, కార్డులు ఇప్పించి సంక్షేమ బోర్డు లో సభ్యులుగా చేర్చుకునేందుకు చర్యలు చేపట్టాలి .
ప్రజల విశ్వాసం ,ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉంటుందని పాలకులు, ప్రభుత్వ అధికారులు గుర్తించి, ఆలోచన చేసినప్పుడు మంచి పథకాలు, రూపకల్పన చేయవచ్చు. ప్రజా సంక్షేమ పాలన అందించడానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగానే సుదీర్ఘకాలంపాటు ప్రజా ప్రభుత్వాలు మనుగడ కొనసాగిస్తాయి.
(బాబ్జి, కన్వీనర్, వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ (ఏపీ.వి.వి. యు), ఆంధ్రప్రదేశ్ )