శ్రీకాకుళం జిల్లా…నిమ్మాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం నిమ్మాడ వచ్చి మాజీ మంత్రి, టెక్కలి తెలుగు దేశం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అచ్చన్న కుటుంబం పై ముఖ్యమంత్రి జగన్ కక్ష కట్టారని, ఆయన నోరు మూయించేందుకే ఆయన కు ఏ మాత్రం సంబంధంలేని కేసులో ఆరెస్టు చేశారని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష కోట్ల అవినీతిని బయటపెట్టిన కేసు వేసింది స్వర్గీయ ఎర్రంనాయుడు,దాని మీద జగన్ జైలుకెళ్లాడని, జగన్ అచ్చన్న ని ఒక రోజు అయినా జైల్లో పెట్టాలని టార్గెట్ గా పెట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేయించాడని నారాలోకేష్ నిమ్మాడలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
‘ జగన్ మీద నాటి కేసు వేసిన మరోనేత అశోక్ గజపతి రాజు గారు. దీనికి ప్రతీకారంగా మాన్సాస్ ట్రస్ట్ ని బ్రష్టు పట్టించడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. అచ్చన్న చేసిన తప్పేంటి?బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని ప్రశ్నించడమా? బీసీలకు దక్కాల్సిన 3500 కోట్ల నిధులు పక్కదారి పట్టించారు అని అని జగన్ గారిని నిలదీయడం తప్పా?.’అని ప్రశ్నించారు.
‘151 మంది కాలకేయ సైన్యాన్ని అసెంబ్లీ లో వణికిస్తున్న బాహుబలి అచ్చన్న ని ఎదుర్కోలేక ఈ అరెస్ట్. అసెంబ్లీ లో మనిషి ఎదిగావ్ కానీ బుర్ర ఎడగలేదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ గారు అచ్చన్నని విమర్శించారు అంటే బీసీల పై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది,’ అని లోకేశ్ అన్నారు.
ఇఎస్ ఐ స్కామ్ లో అచ్చన్న ఎలా బాధ్యుడు?
‘అసలు ఏంటి ఈ ఈఎస్ఐ స్కామ్?ఈఎస్ఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ. రాష్ట ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ మాత్రమే.అందులో జరిగే వ్యవహారాలకు ఈఎస్ఐ డైరెక్టర్ మాత్రమే బాద్యుడు. విజిలెన్స్ ఎంక్వైరి లో ఎం తేల్చారు.9 అంశాల పై రిపోర్ట్ ఇచ్చారు.ఎక్కడైనా అచ్చన్న పేరు ఉందా?రిపోర్ట్ లో ఆయన ప్రస్తావన లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?