కరోనా పరీక్షల్ని కూడా మానిప్యులేట్ చేయవచ్చా?

(టి.లక్ష్మీనారాయణ)
పరీక్షలకే పరీక్ష! అంటూ ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు చదివి, స్పందించి, దీన్ని వ్రాస్తున్నాను.
అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారికి చేసిన కరోనా పరీక్షల్లో తేడా రావడంపై రభస జరుగుతున్నది. విజయవాడ పరీక్షా కేంద్రంలో పాజిటివ్ గా ఫలితం వస్తే, హైదరాబాదులో నెగెటివ్ గా ఫలితం వచ్చిందని చెప్పబడుతున్నది. ఈ తేడా రావడానికి విజయవాడ వైద్య సిబ్బందిని నిందించగలమా? దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా వివరణఇస్తూ ప్రకటన విడుదల చేసినట్లు పత్రికల్లో చూశాను.
1. కరోనా పరీక్షల నిర్వహణలో అనారోగ్యకరమైన పోటీ నెలకొని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత మందికి పరీక్షలు చేశామన్న లెక్కల కంటే నాణ్యమైన పరీక్షలు చేయడంపై దృష్టిసారించాలి.
2. ఒక్కొక్క వైరాలజీ పరీక్షా కేంద్రంలో ఎన్ని ఆర్టీ పీసీఆర్ లు ఉన్నాయి, ఎంత మంది తర్ఫీదు పొందిన వైద్య సిబ్బంది పని చేస్తున్నారు, ఏ మేరకు మౌలిక సదుపాయాలు(గదులు, ఇతర వసతులు) ఉన్నాయి, రోజులో ఉన్న 24 గం.ల్లో ఐ.సి.యం.ఆర్. నిర్ధేశిత ప్రమాణాలను పాటిస్తూ ఎన్ని పరీక్షలు చేయడానికి అవకాశం ఉన్నది, ప్రస్తుతం ఎన్ని పరీక్షలు చేస్తున్నారు? విజ్ఞతతో ఆలోచించే యంత్రాంగమే కొరవడిందా? అన్న అనుమానం వస్తున్నది.
3. ఒక్కొక్క ఆర్టీ పీసీఆర్ కు తర్ఫీదు పొందిన వైద్య సిబ్బంది సగటున ఎంత మంది ఉన్నారు? వారు ఎన్ని సిప్టుల్లో పని చేస్తున్నారు? చేస్తున్న పని అత్యంత ప్రమాదకరమైనదని తెలిసే చేస్తున్నా పని వత్తిడిని భరించలేక ఎంత మంది కాంట్రాక్టు వైద్య సిబ్బంది ఉద్యోగాలు మానేశారో ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు.
4. క్లినికల్ విభాగంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వారం పని చేస్తే వారం సెలవు, వైరాలజీ పరీక్షా కేంద్రాలలో పని చేస్తున్న వైద్య సిబ్బంది చేత 24×7 డ్యూటీ చేయిస్తే పనిలో నాణ్యతా ప్రమాణాలను ఎలా ఆశిస్తారు? వారికి కరోనా మహమ్మారి సోకినా, జబ్బున పడ్డా, డ్యూటీకి రాలేని పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయంగా డ్యూటీ చేయడానికి, నిర్విఘ్నంగా పరీక్షా కేంద్రాలను నిర్వహించడానికి తర్ఫీదు పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నదా! అంటే లేదనే భావిస్తున్నా!
5. పరీక్షా కేంద్రాల సామర్థ్యానికిమించి మూడు నాలుగు రెట్లు అధికంగా పరీక్షలు నిర్వహించాలని వత్తిడి చేస్తే ఎలా నిర్వహించగలరు? వైద్య సిబ్బందిపై భరించలేని వత్తిడి పెంచితే కలిగే దుష్పలితాలపై దృష్టిసారించరా? కరోనా పరీక్షా కేంద్రాల వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం లేదా? ప్రమాదం ముంచుకొస్తున్నదన్న భావన నాకైతే కలుగుతున్నది.
6. పూలింగి విధానం పర్యవసానంగా వైరాలజీ పరీక్షా కేంద్రాలలో వైద్య సిబ్బందికి పని భారం పెరిగి, తీవ్రవత్తిడికి, గందరగోళానికి గురౌతున్నట్లుంది.
7. సేకరించిన శాంపుల్స్ వేల సంఖ్యలో రోజుల తరబడి పరీక్షా కేంద్రాలలో పెండింగ్ లో పడి ఉంటున్నాయంటున్నారు. ఆ నమూనాలను భద్రపరడానికి అవసరమైన శీతల సదుపాయాలు ఉన్నాయా! అనుమానమే. కాలయాపన జరిగిన మీదట ఆ నమూనాల పరీక్షా ఫలితాలు 100% కరెక్టుగా రావడానికి అవకాశం ఉండకపోవచ్చు కదా!
8. నిజమైన వ్యాధిగ్రస్తులకు పరీక్షలు – వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు, కొందరైతే పరీక్షా ఫలితాలు వచ్చేలోపు మృత్యువాతన పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
9. పరీక్ష కోసం పరీక్ష అవసరమా? సంఖ్య కోసం పరీక్షలు నిర్వహించాలా? నాణ్యతా ప్రమాణాల పట్ల ద్యాసపెట్టరా?
10. పరీక్షల సంఖ్య కోసం వైద్య సిబ్బందిని తీవ్ర వత్తిళ్ళ మధ్య పని చేయిస్తే పరీక్షల నాణ్యతా ప్రమాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. తక్షణం తీరు మారాలి లేదా పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు మరింత లోపిస్తాయి. విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది.
11. శ్యాంపిల్స్ సేకరణ సమయంలో ప్రాథమికంగా వ్యాధి లక్షణాలున్నాయా/ లేదా/ ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి, వ్యాధి నిర్ధారణ పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా జరిగిందా/లేదా, ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందేమో! వ్యాధి లక్షణాలున్న వారికే పరీక్షలు చేయాలి. సంఖ్య కోసం పరీక్షల నిర్వహణకు తక్షణం స్వస్తి చెప్పాలి.
12. మన ఆరోగ్య వ్యవస్థకు ఉన్న మౌలిక సదుపాయాలు, శక్తిసామర్థ్యాలు, పరిమితులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. వాటిని పెంచుకోవడానికి కార్యాచరణను అమలు చేయాలి. అంతే గానీ నేల విడిచి సాము చేసినట్లు ఉండకూడదు. అలా చేస్తే సత్ఫలితాలు రావు కదా! దుష్పలితాలు వస్తాయి.
13. పరీక్షల నిర్వహణలో వి.ఐ.పి. లకు ప్రాధాన్యత ఎందుకు? పైరవీలెందుకు? పౌరులందరికీ జీవించే హక్కు, ఆరోగ్య హక్కు సమానమే కదా!
14. పరీక్షా కేంద్రాలపై కలెక్టర్లకు రోజు వారి పెత్తనమెందుకు? ఆరోగ్య వ్యవస్థకు ఒక అధికార యంత్రాంగం ఉన్నది కదా! అది సమర్థవంతంగానే పని చేస్తున్నది కదా!
15. వ్యవస్థ లోపభూయిష్టంగా నడుస్తున్నప్పుడు పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలను ఎలా ఆశించగలం? అందువల్లనే నెగెటివ్-పాజిటివ్ గా, పాజిటివ్-నెగెటివ్ గా పరీక్షల ఫలితాలు, ఒక పరీక్షా కేంద్రానికి – మరో పరీక్షా కేంద్రానికి మధ్య పరీక్షల ఫలితాల్లో తేడాలొస్తున్నాయి. వైద్య సిబ్బందిని నిందిస్తే లాభమేంటి? వ్యవస్థాపరంగా, నిర్వహణాపరంగా ఉన్న లోపాలపై ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాలి.
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ వ్యాఖ్యాత)