తన హావభావాలు, వేషభాషలతో తెలంగాణ ప్రజలనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను అలరించిన బిత్తిరి సత్తికి టివి9 యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆయనను ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్లు సమాచారం చేరవేసింది. ఆయనతోపాటు ఇస్మార్ట్ సత్తి అనే కార్యక్రమ ప్రొడ్యూసర్ కుమార్ ను కూడా తొలగించింది మేనేజ్ మెంట్.
బిత్తిరి సత్తితోపాటు కుమార్ ను ఏ కారణంగా తొలగించారన్నది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. బిత్తిరి సత్తి అసలు పేరు రవి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. వి6 టివి ఛానెల్ రవిని బిత్తిరి సత్తిగా మలచింది. పాపులర్ చేసింది. వి6లో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు సత్తి. ప్రతిరోజు సాయంత్రం అయిందంటే బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు ఎప్పుడొస్తయా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసేటోళ్లు.
తెలంగాణ వచ్చిన తర్వాత టివి9 సంస్థ రవి ప్రకాష్ చేతుల్లోంచి మైహోం రామేశ్వరరావు అనే వ్యాపారవేత్త లాగేసుకున్నారు. వెనువెంటనే వి6లో అప్పటి వరకు పనిచేసిన బిత్తిరి సత్తిని టివి9 లాగేసుకుంది. బిత్తిరి సత్తి అనే ప్రోగ్రాం వి6 సొంతం అయినందున టివి9లో ఇస్మార్ట్ సత్తి అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆ కార్యక్రమం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో ఉన్నట్లుండి సత్తిని చానెల్ నుంచి తొలగించడం ఇటు మీడియా వర్గాల్లోనే కాకుండా తెలుగు టివి ప్రేక్షక వర్గంలోనూ చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.