(జువ్వాల బాబ్జీ)
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ, టీచర్ పోస్టుల భర్తీలో,అమలులో ఉన్న జీ. ఓ నం.3 రద్దు చేస్తూ 100 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి సుప్రీం కోర్టు రద్దు పర్చటంతో, షెడ్యూల్ ఏరియా లో నివసిస్తున్న ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు.
ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే రివిజన్ పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ మన్యంలో బంద్ పాటించారు. ఈ సమస్య పై గిరిజన సలహా మండలి లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని స్థానిక గిరిజన ప్రజాప్రతినిధుల పైనా రాజకీయ వత్తిడి తెస్తున్నారు.
రెండు ప్రభుత్వాలు తాము గిరిజనుల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నట్లు ,ఈ అంశంపై సుప్రీం కోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేస్తామని చెపుతున్నాయి. అయితే, నెలరోజులు గడువులో వేయాల్సిన పిటీషన్ ను ఇంకా వేయకపోవడం ఆదివాసీల ను కలవర పరుస్తున్నది.
మరొక వైపు కేరళ ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. రివిజన్ పిటీషన్ దాఖలు చేసింది.
ఆదివాసీ సమాజం వ్యక్తులుగా కాకుండా, సంఘాన్ని ఇష్టపడతారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఐదు జిల్లాల్లో ఆదివాసీ ప్రాంతం విస్తరించింది. ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక స్వయం పాలన అధికారాలు అమలులో ఉన్నాయి. ఆదివాసీల లో రగులుతున్న ఆందోళనను తగ్గించేందుకే అయినా అటవీ పోడు భూముల హక్కు పత్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సానుకూల అంశంగా చెప్పవచ్చు.
పోడు భూములకు సంబంధించి హక్కులు కోరుతూ అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. అప్పటి యుపిఏ ప్రభుత్వం “గిరిజనులు ఇతర అటవీ నివాసులు హక్కుల గుర్తింపు చట్టం 2006″ను ఆమోదించింది. వెంటనే 2007 సం. లో రూల్స్ తెచ్చింది. దాని అమలులో భాగంగా, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఆదివాసులకు సుమారు రెండు లక్షల ఎకరాల అటవీ భూమిని హక్కుపత్రాలు ఇచ్చి పంపిణీ చేశారు.ఇదీ,2009 సం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గిరిజనుల ఓట్లు గంప గుత్త గా పడటానికి దోహద పడింది.
Like this story? Share it with a friend!
అయితే, ఇపుడు వివిధ కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులు సుమారు 1,64,616 ఎకరాలకు పైగా ఇంకా పెండింగులో ఉన్నాయి. వీటిలో 50 వేల ఎకరాలు వచ్చే ఆగస్టు నెల 9 వ తేదీన “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం”సందర్భంగా ప్రభుత్వం ఆదివాసీల కు పంపిణీ చేయనున్నట్లు 15-6-2020 సాక్షి పత్రిక కథనం. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో పోడు భూములకు సంబంధించి 27,422 దరఖాస్తులున్నాయి. పట్టాలు ఇచ్చే భూమి 49,670 ఎకరాలని 18.6.2020 న సాక్షి పత్రిక రాసింది.
మొన్న రాష్ట్రం మొత్తం మీద 50 వేల ఎకరాలు అని రాసి ఇప్పుడు ఒక్క జిల్లాలో అన్ని వేల ఎకరాలు ఇస్తారని చెప్పటం అనుమానం కలుగుతోంది. అయితే, ఈ చర్య ను 2019 లో కి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టి ఉండ వచ్చు .కాని అలా చేయలేదు.
ఎందుకంటే, వాస్తవానికి ఇది ప్రభుత్వ చర్య అనే ముందు, గతంలో సుప్రీం కోర్టు కేసు వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కన్సర్వేషన్ సొసైటీ మరియు టైగర్ రీసెర్చ్ అండ్ కన్సర్వేషన్ ట్రస్ట్ వర్సెస్ ఇండియా డబ్ల్యూ. పి. నం.109/2008 కేసులో ఇచ్చిన తీర్పు లో భాగంగా ప్రభుత్వం చర్యలు కుపక్రమించిందని భావించ వచ్చు.
ఇందులో పిటీషన్ దారులు ప్రభుత్వతీసుకువచ్చిన చట్టానికి రాజ్యాంగ బద్ద త లేదనీ, దరఖాస్తు లలో చాలావరకు బోగస్ లనీ, కాబట్టీ వెంటనే ఆక్రమణ దారులను తొలగించ టానికి చర్యలు కోరుతూ వాదించారు.
ముగ్గురు న్యాయ మూర్తుల ధర్మాసనం, పదిహేడు రాష్ట్రాల ప్రభుత్వాల కు ఆరు అంశాల మీద చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరపున కౌంటర్లు ఫైల్ చేయాలని తదుపరి వాయిదా 24-7-2019 వేసి చర్యలకు ఆదేశించారు.
అప్పటికే మన రాష్ట్రకొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం గమనార్హం.07-03-2018 సం. లో జస్టిస్. మధన్ లోకూర్ గారి బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల లో (1) ఆర్వో ఎఫ్ ఆర్ క్రింద ఎన్ని క్లైమ్ లకు హక్కు పత్రాలు మంజూరు చేశారు(2) వారిలో గిరిజనులు ఎంతమంది? ఇతర సంప్రదాయ అటవీ నివాసులు ఎంతమంది? (3), ఒక్కో కేటగిరిలో తిరస్కరించిన దరఖాస్తులు ఎన్ని? ఎంత విస్తీర్ణం ఎంత? (4) తిరస్కరించిన వాటిపై తీసుకున్న చర్య లు ఏమిటి? (5) ఎంత విస్తీరణంలో తొలగించారు, (6)ఇంకా ఎంత విస్తీరణంలో తొలగించాలి? అనే ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి. అందులో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ద్వారా అర్హులైన వారికీ హక్కులు ఇవ్వ వచ్చు.
కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి పాటిస్తే బాగుండేది. అలా చేయలేదు. చట్ట విరుద్ధం గా గ్రామ సభలకు ఏ విధమైన నోటీసు లు ఇవ్వకుండా, గతంలో తిరస్కరించిన దరఖాస్తుల వివరాలు లేదా అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభల తీర్మానాలు లేదా సబ్ డివిజన్ లెవల్ కమిటీపరిధిలో మినిట్స్ లేదా జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తీర్మానాలు తిరస్కరించిన లేదా ఆమోదించిన వాటిని ప్రజలముందు చర్చకు తెచ్చి భూములు సర్వే జరపాలి.
అలా చేయలేదు. కేవలం అటవీ శాఖ అధికారులు, క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది వచ్చి అటవీ హక్కుల కమిటీ సభ్యులు లేకుండానే సర్వే జరిపారు.
ఇది పూర్తిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ను ఉల్లంఘించి నట్లవుతుంది. ఎందుకంటే, ఇదే అంశంపై రెండు ధర్మాసనం లు ఇచ్చిన తీర్పు లో జస్టిస్ చలమేశ్వర్ గారు ఇందులో ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు చట్ట పరిధిలో జరగాలని, ఆ విధంగా ఆక్రమణ దారులను తొలగించ వచ్చని స్పష్టం చేశారు.
అంటే, గ్రామసభల ద్వారా ప్రజలను భాగస్వాములను చేసి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో భూముల సర్వేజరగాలి. అభ్యంతరాలు ఉంటే అది కూడా రికార్డుల్లో నమోదు చేసి విచారణ జరిపాకే సబ్ డివిజన్ లెవల్ కమిటీకి పంపాలి. ఆతర్వాత జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సభ్యులు కూడా పరిశీించవలసిన విషయాలు ఉంటే తిరిగి గ్రామ సభలకు పంపించి హక్కులు గుర్తించాలి.
ఇవేమీ పాటించలేదు. ప్రధానంగా, అడవిపై ఆధార పడి జీవించే హక్కు అంటే పోడుసాగు,నీటివనరులు, గడ్డి , ఆవాస హక్కు, యాజమాన్య పద్ధతులు, పర్యవేక్షణ మొదలైన వాటిని పొంద వచ్చు. ఇవీ, వ్యక్తి గతంగా, ఉమ్మడిగా ఉంటా యి. కేవలం అటవీ శాఖ అధికారులు జీపీఎస్ ద్వార సమాచారం సేకరించారు. దీనిపైన ఆదివాసులకు అవగాహన లేదు. దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఆదివాసీ జనాభా విస్తరించి ఉన్న జిల్లాల్లోనే భూమి, అడవి కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి అని (లాండ్ కాన్ ఫ్లిక్ట్ వాచ్ రిపోర్టు ప్రకారం)అక్కడ విస్తారమైన సహజ వనరులు విస్తరించటం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
ఈ సంస్థ దేశంలో 42 మంది పరిశోధకుల బృందంతో 3 సంవత్సరాల పాటు 10 రాష్ట్రాలలో,100 జిల్లాల్లో 5 వ షెడ్యూల్ ఏరియా లో సర్వే జరిపారు. అందులో మన ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది.41 శాతం భూభాగం సమస్యాత్మక మైన ప్రాంతంగా ఉన్నట్లు తేల్చారు. చట్టాలు రూపకల్పన చేశారు.
కానీ, వాటిని ప్రజలముందు చర్చకు తెచ్చి అమలు చేయడం లో నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు, అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఈ చట్టం కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కాదు బయట ప్రాంతాల్లో వర్తిస్తుంది. కానీ, తీర ప్రాంతంలో మడ అడవుల నుంచి జీవనోపాధి పొందే యానా దులకు, నల్ల మలలో సంచార జాతులు చెంచులకు, రాయలసీమ లో చింత చెట్లు కు చెట్టు పట్టాలు కలిగిన వారికి సరిగా అమలు చేయడం లేదు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో వేలాది ఎకరాలను గిరిజనులు తర తరాలుగా పోడుసాగు చేస్తున్నారు. తెలంగాణ నుండి విలీనమైన కుకునూరు, వేలేరుపాడు, కూనవరం,వి. ఆర్ .పురం, చింతూరు మండ లాలలో ముంపుకు గురవుతాయి. వీరిలో కొందరు పీ. వి. టి జి (particularly vulnerable tribal groups) తెగకు చెందిన కొండరెడ్డి గిరిజనులు ఉన్నారు. వీరికి ఇంకా ఈ చట్ట పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు వారిని నిర్వాసిత కాలనీలకు తరలించాలని చూస్తున్నారు. అదే జరిగితే తీరని నష్టం జరుగుతుందని ఆందోళన చెందు తున్నారు.
2014 సం. లో అప్పటి ప్రభుత్వం పోలవరం మండలం, దేవరగొంది గ్రామాన్ని తరలించడంతో 460 ఎకరాలు ఆర్.ఓ. ఎఫ్.ఆర్ ఉమ్మడి హక్కు పత్రాలు ఉండికూడా నష్ట పరిహారం పొందలేక పోయి చివరికి కోర్టుల్లో కేసులు వేశారు. ప్రాజెక్ట్ పరిధిలో ఈ సమస్య చాలా తీవ్రమైనది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు సరిగా అమలు చేయడం లేదు.దానికి ఉదా: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 1/70 లాండ్ ట్రాన్స్ఫర్ నిబంధనలు, ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ 2006, భూసేకరణ చట్టం 2013, ప్రస్తుత కాలంలో వివాదాస్పద మైన జీ. ఓ. నం.3. వగైరా వున్నాయి.
నిజానికి ప్రభుత్వాలు ,అధికారులు, చివరికి మీడియా దృష్టిలోకూడా ఈ చట్టం భూ పంపిణీ కి ఉద్దేశించినది . కానీ అది చాలా పెద్ద తప్పు. చట్టం ముఖ్యోద్దేశ్యం, అప్పటికే ఆదివాసీల సాగులో ఉన్న భూములను గుర్తించి హక్కులు ఇచ్చింది. అంతే కానీ కొత్తగా భూ పంపిణీ చేయాలని కాదు. అలాగే, హక్కులు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులా కాదా అని నిర్ణయించడంలో గ్రామసభదే తుది నిర్ణయం.
స్థానిక గిరిజన అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభ అధికారుల పాత్ర పోషిస్తుంది. దీనికి విరుద్ధంగా భావించి దాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు అటవీ అధికారులు నాయకులు చేస్తున్నారు. ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రముల లో అటవీ శాఖ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరించాలని చూస్తే, ఆదివాసీ లకు అడవిపై హక్కులు ఉన్నప్పటికీ రాకుండా చేసే అవకాశం ఉందని, ప్రజలు వ్యతిరేకించారు. వెంటనే ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. దీనికి కేవలం గిరిజన మంత్రిత్వ శాఖ లేదా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రమే నోడల్ ఏజెన్సీ గా వ్యవహరించి ఆదివాసీ లకు సంబంధించిన హక్కు పత్రాలు మంజూరు చేయాలి.
ప్రస్తుత మన రాష్ట్ర ప్రభుత్వం త్వరిత గతిన హక్కులు కల్పించాలని యోచిస్తోంది. ఆ విధంగా గతంలో వై యస్ రాజశఖరరెడ్డి, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన కుమార్డు ప్రస్తుత ముఖ్యమత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కు హక్కులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గత 5 ఏండ్లుగా పాలన చేసి ఒక్క ఎకరం భూమిని గిరిజనులకు తెలుగుదేశం పార్టీ పంచలేక పోయిందని చెప్ప వచ్చు. రాజకీయంగా లబ్ధి పొందవచ్చు.
ఉన్న సమస్య అంతా చట్టాన్ని అమలు చేయడం పైనే ఆధారపడి ఉంది. సరైన సమయంలో చట్టాన్ని అమలు చేయడం వల్ల గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలి. చట్ట పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ప్రభుత్వాలను విశ్వసిస్తారు.
(జువ్వాల బాబ్జీ,న్యాయవాది,ఆంధ్ర ప్రదేశ్ వ్వవసాయ వృత్తి దారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, ఫోన్. 9963323968)