కంచె చెనుమేసినట్లుగా కాపాడే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని,భద్రతను గాలికి వదిలేసి,ధనవంతుల దర్జా జీవితాలను కాపాడేందుకు తాపత్రయ పడుతూ ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.
ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తే నివారణ చర్యలు చేపట్టకుండా,గాలి మాటలతో ప్రజల చెవిలో ధూళి వేదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యానికి స్మశానదారికి శాంతియాత్రలా గాంధీ ఆస్పత్రిని వేదికలా చేసి పేద ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిత్తశుద్ధిలేని విశృంఖల రూపాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారని ఆయన తెలిపారు.
జర్నలిస్ట్ మనోజ్ ఆరోగ్య భద్రతకు హామీ ఇవ్వని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఇచ్చిందంటేనే ప్రజల ఆరోగ్యం కంటే తమ పదవులు ముఖ్యమనే “కల్వకుంట్ల కుటుంబం”అసలు గుట్టు ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
మనోజ్ మృతి ప్రభుత్వం చేసిన హత్యగా ఆయన అభివర్ణించారు, పేదోడికి అన్యాయం…! పెద్దోడికి న్యాయమనే దుర్మార్గపు ఆలోచన చేస్తూ పాలిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా మనోజ్ మృతికి నిరసనగా ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను జర్నలిస్టులందరూ బహిష్కరించినప్పుడే మనోజ్ ఆత్మకు అసలైన నివాళని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి మాటలకు విశ్వసనీయత ఉండాలంటే వెంటనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డితో సహా కరోనా సోకిన ప్రతి టిఆర్ఎస్ నాయకులకు తమ ఇంట్లో పరీక్షలు నిర్వహించకుండా గాంధీకి తరలించి వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు,లేదంటే ప్రభుత్వ వైఫల్యాలతో కేసీఆర్ పాలన పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు.