సాగునీటి రంగం స్పృహ జగన్ ప్రభుత్వానికి వుందా?

(వి.శంకరయ్య)
“జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం” అనే ట్యాగ్ లైన్ తో ఆంధ్ర ప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన ముగిసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం వార్షికోత్సవాలు నిర్వహించుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి లేకుండా వుంటే ఊరూవాడా మారుమూల బాణాసంచాలతో కూడిన ఉత్సవాలు జరిగేటివేమో! అయితే వ్యవసాయక రాష్ట్రం గానూ అన్న పూర్ణగానూ పేరు పొందిన ఈ రాష్ట్రానికి జీవనాడి అయిన సాగు నీటి రంగం ఈ సంవత్సరం కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తట్టెడు మట్టి కాంక్రీట్ పడిన సందర్భం లేదు. బడ్జెట్ లో కేటాయింపులు వున్నా ఖర్చు మాత్రం లేదు. అంతేకాదు. వార్షికోత్సవాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనల్లోని గణాంకాల్లో నూ ముఖ్యమంత్రి మంత్రుల ప్రసంగాల్లోనూ సాగునీటి రంగానికి చెందిన కేటాయింపులు వ్యయం గురించిన వివరాలు ఎక్కడా దాఖలా కన్పించదు. అసలు సాగునీటి రంగం ఒకటుందనే స్ప్రుహ ఈ ప్రభుత్వానికి వున్నట్లు కూడా కన్పించదు. ఇన్ని సంక్షేమ పథకాలు వివరాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు లేదా చేపట్టిన పథకాలు కనీసం ఎంత మేరకు అధికంగా సాగు నీరు అందించుతుంటే వార్షికోత్సవాల సందర్భంగా ఎందుకు ప్రకటించ లేదు.

ఈ సందర్భంగా మూడు అంశాలు దృగ్గోచరమౌతాయి.
రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయ బడింది. రాష్ట్రంలో 3.57 కోట్ల మంది దరిద్రంతో అంగ లార్చుతున్నారని గుర్తించ బడి వారిని దరిద్రం నుండి బయట పడేసేందుకు “నేను విన్నాను. నేను వున్నాను” అంటూ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పందేరం జరిగింది. గమనార్హమైన అంశమేమంటే పది మందికి పందేరం జరిగితే అదే కేటగిరిలో ఇరవై మంది అసంతృప్తితో వుండే పరిస్థితి లేక పోలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో పందేరం చేసి వుండదు. . అదే సమయంలో సాగు నీటి రంగాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వమూ వుండదు.

ఈ స్టోరీ మీకు నచ్చిందా, అయితే, మీ మిత్రులకు షేర్ చేయండి

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సాగు నీటి రంగంలో టెండర్లు అన్నీ వరస బెట్టి రద్దు చేశారు. తర్వాత అయినా వాటికి మోక్షం కలుగ లేదు. ఇదిలా వుండగా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ప్రతిష్టాత్మకంగా అత్యవసరంగా భావించే తిరుపతి తిరుమలకు తాగు నీరు అందించే పథకం టెండరు సంవత్సర క్రితం రద్దు అయింది. అప్పట్లో టిటిడి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజులు హడావుడి చేసి ప్రస్తుతం సద్దుమణిగి పోయారు.
రాష్ట్రప్రభుత్వం రాబడితో పాటు దాదాపు 90 వేల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్ర ప్రజలకు పప్పుకూడు పెట్టారు. వైకాపా అధికారంలోనికొచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2.58 లక్షల కోట్లు వుంటే ఇప్పటికి ఈ అప్పు 3.45 లక్షల కోట్ల రూపాయల మించి పోయిందని చెబుతున్నారు. రైతులకు చెంది ఇందులో అభ్యంతరం లేదు. కాని పొలంలో విత్తనం వేసి ఆకాశం వేపు చూచే దుర్భర పరిస్థితి నెలకొనివుంటే సాగు నీటి రంగాన్ని ఈ సంవత్సరం కాలంగా నిర్లక్ష్యం చేశారని దుర్భిక్ష ప్రాంతాలకు చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతు బరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎందుకూ పనికి రాకుండా పోతుందనే వాస్తవం ఏలిన వారికి తెలియదని ఏలా భావించ గలం.? ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయి గాని వ్యవసాయానికి ఉపయోగ పడటం లేదని రైతులే అంగలార్చుతున్నారు.
అప్పు చేయనిదే ఆస్తులు పెరగవు. పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి పెరగనిదే ఆదాయం రాదని అందరూ చెప్పే ఆర్థిక సూత్రమే ఈ ప్రభుత్వం చెప్ప వచ్చు. ఈ ఏడాది వచ్చిన ఆదాయంతో పాటు చేసిన అప్పులు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి రంగంలోనూ ఉత్పత్తేత్తర విభాగంలో ఎంతెంత వ్యయం చేసింది వార్షికోత్సవం సందర్భంగా వెల్లడి చేస్తే బాగుంటుంది. ఈ రోజు ఎంత దాచి పెట్టినా మున్ముందు అయినా దాగే అంశం కాదు. రేపైన” కాగ్” నిగ్గు తేల్చుతుంది.
“భూసారం నుండి వాతావరణం వరకు – విత్తనం నుండి అమ్మకం వరకు – పాడి నుండి పంట వరకు అన్ని వేళలా అన్ని విధాలా – రైతన్నకు అండగా రైతు గడప వద్దనే సేవలందించే వైఎస్సార్ రైతు బరోసా కేంద్రాలు ”
రైతులను కంటికి రెప్పలుగా కాపలా కాస్తున్నా ఈ ఏడాది ప్రభుత్వమే జారీచేసిన ప్రకటనల్లోనూ నేతల ప్రసంగాల్లోనూ సాగునీటి రంగంలో వ్యయం చేసిన నిధుల జాడ కాగడా పెట్టి వెతికినా మచ్చుకు కన్పించ లేదు. ఎందుకిలా జరిగింది? వైకాపా పాలన మొదలైన సమయంలో బడ్జెట్ లో సాగునీటి రంగానికి 16 వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. కాని ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నాలుగు వేల కోట్ల రూపాయలకు మించి వ్యయం చేయ లేదు. ఎందుకీ వివక్ష?సాగు నీటి రంగాన్ని ఎందుకు ప్రక్కన పెట్టారు.? వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో తొలి ఏడాది సాగు నీటి రంగం యెడల ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించితే వచ్చే నాలుగేళ్లలో ఏం సాధించ గలరు.? వర్షాకాలం వచ్చేస్తోంది.
ఇక ఇప్పుడు టెండర్లు పిలిచినా డిసెంబర్ వరకు పనులు జరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పాలనలో నాగార్జున సాగర్ శ్రీ శైలం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మాణం జరుగకుండా వుంటే ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సోమాలియా కన్నా కనాకష్టంగా వుండేది కదా? అంతెందుకు? ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా పట్టిసీమ ఒకటి వుంది కాబట్టి రేపు కృష్ణ నదికి జూలై ఆఖరు వరకు వరద రాకున్నాకృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుంది. డెల్టాలో సాగు ఆలస్యంగా మొదలైతే నవంబర్ డిశంబరు మాసాల్లో వచ్చే తుఫానులను తట్టుకొని రైతులు నిలబడి కలుగుతున్నారు. పట్టిసీమ వుంది కాబట్టి ఆ నీటి వాటా రాయలసీమకు ఇవ్వ గలుగుతున్నాము. అసలు పథకాలే లేకుంటే భవిష్యత్తు తలుచుకొంటే భయమేస్తోంది. వలస కార్మికులు వెళ్లి పోవడం వరదలు వచ్చే సమయం ఆసన్నం కావడం నిధులు కొరతతో పోలవరం ఒక సంవత్సరం వృథా అయింది. వివాదాల్లో సీమ ప్రాజెక్టులు చిక్కుకున్నందున మున్ముందు ఏమౌతుందో చెప్ప లేము.
ఈ సంవత్సరంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి పక్కన బెడతాము. టెండర్లు పిలిచి పనులు సాగుతున్న ప్రాజెక్టులు ఏవో వార్షికోత్సవ సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో ఒక్కటి కూడా ఎందుకు పొందు పర్చ లేదు? ఇది రాజకీయ విమర్శ కాదు. సంక్షేమం కింద వ్యయం చేసిన కోట్లాది రూపాయలు గురించి ఘనం చెప్పుకొన్నారు. గాని కోట్లాది మంది రైతులకు చెందిన సాగునీటి రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్ప వలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద వుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో సాగు నీటి రంగం గురించి వ్యవసాయం తీరు గురించి ఈ పాటికే పలు నిపుణులు కమిటీలు నివేదికలు ఇచ్చి వున్నారు. ప్రభుత్వం వద్ద వున్న రికార్డుల ప్రకారమే రాష్ట్రంలో సగానికి పైగా సాగు విస్తీర్ణం వర్షాధారమే. ప్రధానంగా 51 శాసన సభ స్థానాలు వుండే రాయలసీమలో మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు 49 స్థానాలు కట్ట బెట్టారు.ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొలం లో విత్తనం వేసి కనీసం మొలకెత్తుతుందా? లేదా అని ఆకాశం వేపు చూచే దుర్భర స్థితి తొలగి పోతుందని ఆశించారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ సంవత్సరం కాలంలో సాగునీటి రంగంలో జరిగిన కృషి శూన్యం.
తుదకు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఈ ప్రాంత ప్రజల్లో భ్రమలు వీడాలనే ఆలోచనలు మొదలైనవో లేదో ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోంటే మంచిది. . అంతే కాదు. వివాదాస్పద మైన ఎత్తిపోతల పథకం పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచే పథకాలు కూడా సంవత్సరం ఆఖరులో ప్రతిపాదించి తమలో జనించే అసంతృప్తి పక్కదారి పట్టించారనే భావన కూడా సీమ వాసుల్లో క్రమేణా పుంజుకొంటూ వుందో లేదో కూడా ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా తెప్పించుకొంటే మున్ముందు వైకాపా ప్రభుత్వానికే మంచి జరుగుతుంది.
గొంతెండి పోతున్న రాయలసీమకు గత నీటి సంవత్సరం కన్నా అధికంగా ఈ ఏడు ఒక్క నీటి బొట్టు అధికంగా ఇవ్వ గలరా?సంవత్సరం కాలం సాగు నీటి రంగం ఎక్కడేసిన గొంగళి అక్కడే వున్నట్లుంన్నందున అదనంగా ఒక్క నీటి బొట్టు ఇవ్వలేరు. హంద్రీనీవా గాలేరు నగరి తొలి దశ పనులు ఒక ఇంచి జరగ లేదు. గాలేరు నగరి రెండవ దశ పనులు అందుకు చెందిన టెండర్లు అన్నీ రద్దు అయ్యాయి. సోమశిల స్వర్ణ ముఖి లింకు కెనాల్ కు బడ్జెట్ లో 42 కోట్ల రూపాయల కేటాయింపులు వుండగా 42 రూపాయలు కూడా ఖర్చు చేయ లేదు.
ఇదిలా వుండగా ఉత్తరాంధ్ర లో నిండుగా నదులు వున్నాయి. నదులలో వరదలు వచ్చి ముంచెత్తుతాయి. తుదకు సముద్రంలో కలుస్తుంటాయి. ఎక్కడ అల్ప పీడనం ఏర్పడినా ఉత్తరాంధ్ర ప్రజలు వరదలతో సహజీవనం సాగించాలి. వర్షం వెలసిన మరు రోజు జీవనం కోసం వలస బోవలసినదే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాల ప్రజల బతుకు వలసలతో కరవు కాటకాలతో సాగునీటి వసతి లేకుండా కునారిల్లు తున్నాయి .
గత ప్రభుత్వం అధిక అంచనాలతో టెండర్లు పిలిచి దోచుకొన్నారని ఆరోపించి ప్రజలను నమ్మించి అధికారంలోనికి వచ్చారు. తర్వాత జరిగింది ఏమిటి? వరస బెట్టి టెండర్లు అన్నీ రద్దు చేశారు. . సాగునీటి రంగంలో నిలువు దోపిడీ జరిగిందనే వైకాపా కు అధికారం అప్పగించారు. తుదకు ఏమైంది? అర కొర పనులు కూడా లేకుండా పోయాయి. మొత్తం సాగు నీటి రంగం ఈ సంవత్సరం కాలంలో పడకేసింది? . రైతులకు కావలసినది సాగు నీరు. పథకాల నిర్మాణం. పథకాల పురోగతి. తత్ఫలితంగా పొలాలకు సాగునీరు. కాని ఈ సంవత్సరం కాలం అంతా భ్రాంతిగా మిగిలి పోయింది.
కాకుంటే ఇంకో గణాంకం వార్షికోత్సవ ప్రకటనల్లో ప్రసంగాల్లో కనిపిస్తోంది. రివర్స్ టెండర్లు వలన రెండు మూడు వేల కోట్లు ఆదా చేశామని చెబుతున్నారు. కావచ్చు. ఆ నిధులు కూడా మరో సంక్షేమ పథకాలకు మళ్లించారేమో.
(విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యంతో)
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013 )