కూలితల్లి శవం (కవిత)

(చల్లపల్లి స్వరూపరాణి)
ఆత్మనిబ్బరం అంటే ఏంది సార్!
ఒక కంట్లో కాటిక
మరొక కంట్లో సున్నం పెట్టినా
అదేమని మిమ్మల్ని అడక్కపోడమేనా?
బతకడమే ఒక పెద్ద యుద్ధమైన చోట
రోడ్డుపాలైన బతుకుతో
ఆత్మనిబ్బరంగా
చానాదూరం పోరాడింది సార్! మా అమ్మ
పాపం పిచ్చిది!
పిడికెడు అన్నం మెతుకులముందు
కుప్పకూలిపోయింది
పని దొరికినప్పుడు
మాకింత అన్నం పెట్టి
మంచినీళ్ళు తాగి
నిబ్బరంగా నిద్రపోయేది
నా పిచ్చి తల్లి!
ఉన్న పదిరూపాయలతో
మాకు చెప్పులు కొనిచ్చి
సర్రున కాలే బతుకు రస్తామీద
వొట్టి కాళ్ళతో
నిబ్బరంగానే నడిచింది మా అమ్మ
కావాలంటే
ఈదేశంలో ఏరహదారినన్నా
తడిమి చూడండి
మా అమ్మ నెత్తుటి పాదాల
తడిఆరని గుర్తులు కనిపిస్తాయి.
ఏరైలు పట్టాల మీదన్నా
చెవి ఆనించి వినండి
నిబ్బరంతో బతకడానికి
మా అమ్మ చేసిన అలికిడి వినిపిస్తుంది.
వడగాలుపు బతుకులో
నిబ్బరంగానే బతకాలని
కాసింత చలువపందిరి నీడకోసం
తన్నుకులాడింది మా అమ్మ.
గతుకుల బతుకు దారిలో
ఎంత గసపెట్టి పరుగెత్తినా
తనరొద వినేనాధుడు కరువై
ఆమె
ఆత్మనిబ్బరం కోల్పోయింది సార్!
అవును,
ఈ సుసంపన్నమైన దేశంలో
గుక్కెడు గంజి నీళ్ళకోసమే తండ్లాడింది
మా పిచ్చి అమ్మ…
ఇప్పుడామె అలిసిపోయి, డస్సిపోయి
ఓడిపోయింది సార్!
మా అమ్మ ప్లాట్ ఫారం మీద
దిక్కులేని శవమైంది…
మీరు, మీవాళ్ళు భద్రం సార్!
మా అమ్మ చావు కనిపించకుండా
గట్టిగా తలుపులు మూసుకుని
యోగాసనాలు వేసుకోండి!
జాగ్రత్త సుమీ!
మా అమ్మ శవం గుర్తురాకుండా
కళ్ళు మూసుకుని
నిష్టగా ధ్యానం చెయ్యండి!
(సోర్స్: సోషల్  మీడియా)