ఎల్జి పాలిమర్స్ ప్రాంతం అదుపులో ఉంది: నీలం సహాని

విశాఖపట్నం మే 8: గ్యాస్ లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్ జి పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలోగల ఐదు గ్రామాలలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విష వాయువు ప్రభావం కొద్దిగా మిగిలి ఉన్నదని తెలిపారు.
నిర్వాసితులకు పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు.454 మంది ఆసుపత్రిలో ఉన్నారని వారిలో 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేటు వద్ద వెంకటాపురంలో మాత్రమే పాయింట్ 0.2 ppm గాఢత ఉందని గోపాలపట్నం వేపగుంట ప్రాంతాల్లో విషవాయువు గాఢత “0” గా నమోదైందని వెల్లడించారు.
కర్మాగారం లోని బ్రాయిలర్ ల ఉష్ణోగ్రత అదుపులోనే ఉందన్నారు. ఇతర సాంకేతిక విషయాలపై నిపుణులు, సాంకేతిక కమిటీ లతో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.కోటి అందజేయడం జరుగుతుందని, తర్వాత న్యాయపరమైన అంశాల తో కంపెనీ నుండి నష్టపరిహారం చేస్తామని తెలిపారు.