ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న విశాఖ ప్రజలను మరో విషవాయువు ఊపిరాడకుండా చేస్తోంది. అర్ధరాత్రి విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుండి లీకైన విష వాయువు ఇప్పటికే పది మందిని పొట్టనబెట్టుకొంది.
200 మందికి పైగా బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సీరియస్ గా ఉన్నవారికి విశాఖ kgh (కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్) కు తరలిస్తున్నట్టు సమాచారం.
కాగా ఈ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ జీఎం స్పందించారు. ఆయన ఏమన్నారంటే… లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీలో పనులు నిలిపివేయడం జరిగింది. పరిశ్రమ మూతపడడంతో రన్నింగ్ లో లేకపోవడం వలనే ఈ ప్రమాదం సంభవించింది.
లాక్ డౌన్ కారణంతో సిస్టమ్స్ రన్నింగ్ లో లేనందున యంత్రాలను తిరిగి ప్రారంభించే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంతమంది ప్రమాదం బారిన పడటం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేసారు ఎల్జీ పాలిమర్స్ జీఎం. సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు ప్రజలెవరూ అటువైపు వెళ్ళొద్దని ఆయన విజ్ఞప్తి చేసారు.