విశాఖపట్నం గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురం ఈ తెల్ల వారు జామున ఉపిరాడక ఉక్కిరిబిక్కిరయింది. కొంతమంది ప్రజలు సృహ కోల్పోయారు. కొందరికి చర్మం మీద దద్దులు వచ్చారు. నిద్రమత్తు విదిలించుకుని చాలా మంది ప్రాణభయంతో పరిగెత్తారు. అంబులెన్సలొచ్చి చాలా మంది ఆసుప్రతులకు తరలించాయి. కారణం: అక్కడి ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఇది సుమారు 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలలో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
లీకయిన ట్యాంకులో రెండువేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉండింది. మరొక ట్యాంక్ లో మూడు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. అయితే, లీకయిపుడు గ్యాస్ నిప్పంటుకోలేదు.ఎందుకంటే, లీకయిన స్టైరీన్ గ్యాస్ దహశీల వాయువు. నిప్పంటుకుని ఉంటే పేలుడు భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని కొంత మంది అధికారులు చెప్పారు.
అస్వస్థతకు లోనయిన వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ప్రత్యేక విమానంలో కొద్ది సేపట్లో విశాఖ వెళ్లున్నట్లు సమాచారం అందింది.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దీనితో ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.
https://trendingtelugunews.com/telugu/breaking/minister-mekapati-gowtham-reddy-on-vizag-gas-leak/
అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్.ఆర్. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
https://trendingtelugunews.com/telugu/breaking/pollution-control-board-apathy-responsible-for-accidents-in-vizag-pawan-kalyan-janasena/