మానవత్వానికి మారుపేరు, ముస్తఫా సారు ఇక లేరు (నివాళి)

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
ఇది చాలా కిందటి మాట. ఆ రోజున మా పాఠశాలలో సభ ఏర్పాటు చేసారు. బహుశ, క్రిష్ణారెడ్డి మాష్టారో లేదా ఇతర ఉపాధ్యాయుల ఆసక్తో కానీ ఆ సభలో దాదాపు యాభై ఏళ్ళ ఎర్రటి దొండపండులాంటి మనిషి మతసామరస్యం , శాంతియుత జీవనం పై ఒక గంటపాటు ఉపన్యసించారు.

ఉపన్యాసం ప్రారంభంలో ఆయన పేరు ముస్తాఫా అని, మతసామరస్యం మీద అనేక చోట్ల ఉపన్యాసాలు చేస్తుంటారని‌ మా ఉపాధ్యాయులు పరిచయంలో చెప్పినట్టు గుర్తు.

అపుడు నేను ఏడవ తరగతి 1991-92లలో కదిరి తాలుక లోని గాండ్లపెంట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న. కొంచెం అటు ఇటుగా ఆ సంవత్సరమే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా యం.వి కృష్ణారెడ్డి  వచ్చారు. స్వాతంత్య్రపోరాట నేపథ్య కుటుంబం వీరిది. ఉన్నతమైన భావాలు, ఆధ్యాత్మిక స్పర్శ కలిగి ఉండేవారు.
ఆపుడు ప్రారంభం నుండి చివరదాకా దాదాపు ఐదువందల మంది విద్యార్థులు ఉండే మా పాఠశాల ఆవరణం నిశ్శబ్దంగా మారిపోయింది. అద్బుతంగా సంస్కృత శ్లోకాలు, ధార్మిక విషయాలు, ఖురాన్ ,బైబిల్ లోని అంశాలు ఇలా తులనాత్మకంగా విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అన్నిమతాలసారం ఒకటే అని ఉపపత్తులతో నిరూపించాడు. ఉపన్యాసం చెప్పడంలో ముస్తాఫా సారే గొప్పవారని చాలా రోజులుగా అనిపిస్తూనే ఉంది. బహుశ చిన్ననాటి ముద్రలు, సమకాలీనంలో గొప్పదనం ఉన్నా స్వీకరించనీయవేమో.
చిన్న వయసులో ఎవరిమతం పట్ల వారికి విశేష గౌరవం, పట్టింపులు , నమ్మకాలుంటాయి. పరమతాల పట్ల తక్కువచూపుకూడా కొంత ఉంటాది. తమదే గొప్ప అనే భావం ఉంటాది. అలాంటి చిన్న వయసులో మతాల ఉద్దేశం మానవత్వమని, శాంతితో సామరస్య జీవనమని, పరమతసహనం పాటించాలని వంటి విశ్వజనీన భావనలు కలిగించేలా ముస్తఫా గారి ఉపన్యాసం సాగింది. జీవితంలో ఆ ఒక ఉపన్యాసం చాలా నేర్పింది. అసలు సభలో ఎలా మాట్లాడాలో నేర్పింది. మనిషి ఎంత జ్ఞానవంతుడుగా విశాలభావాలతో, సామాజిక బాధ్యతతో ఉండాలనే అనేక అంశాలను నేర్పింది. వివేచన శక్తిని కలిగించింది.
ముస్తఫా సారు ఎక్కడో దూరప్రాంతం నుండి వచ్చి ఇలా మతసామరస్యం పై ఉపన్యాసాలు చెప్పి ఉంటారు. ఆయన ఎవరికీ దొరకరు. ఇలానే తిరుగుతూ ఉంటాడని నా మనసు నిర్ణయించుకొంది. అయన ఎవరు, ఎక్కడ అని విచారించే అవకాశం కూడా వేమన గారి వలె ఆయన నాకు ఇవ్వలేదు. చెప్పిన అంశాలు మాత్రమే మనసుకెక్కాయి. ఈ మధ్య చాలా చోట్ల ఉపన్యాసాలు వింటుంటే ఉపన్యాసకుల విషయాలు గుర్తుంటున్నాయి తప్ప విషయం గుర్తుండడంలేదు. గంభీర స్థానంలో ఆడంబరం వచ్చి చేరుతోంది.
మతచర్చలు, ప్రచారాలు, గొడవలు ఇలా ఎదురైనపుడల్లా నాకు ముస్తఫా గారి ఉపన్యాసం అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. చాలా సార్లు ముస్తఫా గారి ఆచూకి పట్టుకోవాలనిపించేది. నాకే అరకొర గుర్తుంది. ఎవరినడిగి ఏమి ప్రయోజనమని అనిపించేది.
సామాజిక మాధ్యమాలలో రిటైర్డ్ లెక్చరర్, సాహిత్యకారుడు ముస్తఫా సారు 13 వతేది రాత్రిన పరమపదించారని కనిపించింది. నా చిన్ననాటి ముస్తాఫా సారు ఇతనే అని అంచనాకు రాలేదు. ఏదో తెలుగు లెక్చరర్ ఉంటారులే అనుకొన్నాను. అసలు నా చిన్ననాటి ముస్తఫా గారిని నేను ఊహించుకొన్న తీరు వేరు. ఆ మహానుభావుడు తారసపడడనే నిర్ణయించుకొన్నట్టున్నాను.
ముస్తఫా సారు కడప జిల్లాలోని, ప్రొద్దుటూరు సమీపాన హనుమనగుత్తి గ్రామంలో 1జూలై1939 లో జన్మించారు. ప్రొద్దుటూరు లోని అనిబిసెంట్ పాఠశాల పాఠశాల విద్య, ఆ ఊరిలోనే సెకండరీ విద్య, ఆంధ్ర నలంద గుడివాడలో సంస్కృతాధ్యయనం, హిందీమహావిద్యాలయం తెనాలిలో రాష్ట్ర భాష ప్రవీణ చదివారు. యం.ఎ తెలుగు, పి హెచ్.డి కూడా పూర్తి చేసారు.హిందీ ఉపాద్యాయులుగా ఉద్యోగం ప్రారంభమై తర్వాత తెలుగు అధ్యాపకులుగా చేరారు. 1986 నుండి 1990 దాకా అనంతపురము జిల్లాలోని, కళ్యాణదుర్గం కళాశాలలో పనిచేసారు. “కళా వాహిని” సంస్థను ఏర్పాటు చేశారు. 1991 నుండి 1995 దాకా కదిరి డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా ఉన్నారు. 1991-92 లలో
“ఖాద్రి కళా భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ” కు అధ్యక్షుడిగా పనిచేసారు. చివరగా తన సొంత ప్రాంతమైన ప్రొద్దుటూరు కళాశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. “నవ్యసాహిత్య సమితి” పక్షాన కార్యక్రమాలు కొనసాగించారు. “వెలుగు రవ్వలు”, “మానవ హృదయం రుబాయి కవితా సంపుటి”లు ప్రచురించారు. ఉమర్ ఖయ్యూం పారశీక రుబాయిలు- అనుశీలన, శూకసప్తశతి కావ్యం పై పరిశోధన చేసారు.
సాహిత్య విషయంగా ఆయన కృషి చూశాక బహుష చిన్ననాడు నేను విన్న ఉపన్యాసం ఈ ముస్తఫా గారిదే అయిండచ్చు కదా అని, ఆ ఫోటోను కొంత తీక్షణంగా చూశాను. ఆనాటి పోలికలు కొంతవరకు కనిపించాయి. వెంటనే కదిరి వైపున ఆనాటి ఆయన డిగ్రీ విద్యార్థులను విచారించాను. మతసామరస్యం ఉపన్యాలు చెప్పే ముస్తఫా గారు ఇతనేనా అని అడగ్గానే, ఇతనే అని ఆయన గురించి ఎన్నో అంశాలు వివరించారు. ఆయన ఉపన్యాసం చెప్పినతీరు కొద్దిగా చెప్పగానే , ఆయన పాఠాలు చెప్పినతీరు వారు నాతో చెప్పి పారవశ్యమయ్యారు.
కేవలం జ్ఞాపకంగా ఆగిపోకుండా చైతన్యంగా నిలిచాడు. చేరవలసిన నా వరకు ముస్తఫా గారి చిరునామా చేరింది. ఎనభైఏళ్ళ ఆ మహానుబావుడు మనల్ని విడిచి పోయారనే కంటే నాకు దర్శనమయ్యాడనే అనిపించింది. కొంత మందే పోయాకే జీవించడం మొదలెడతారు. సుకవి మరణించె నొక తార గగనమెక్కె.
అమళ్ళదిన్నె వెంకటరమణ ప్రసాద్  ‘అనంత పద్యం’ పుస్తకంలో ముస్తఫా గారి కొన్ని పద్యాలను ఉటంకించారు. రాయలసీమ ప్రాంతంలో ఆనాడు కక్షలు ఎక్కువగా నడిచేవి. అవన్నీ చూసి కలచివేసి శాంతియుతంగా జీవించాలని, లోకసేవ చేయాలని తెలుపుతూ..
“కత్తులు బాంబులున్ కలహ కాంక్షల‌ చర్యలు గొప్పవంచు క్రొ
న్నెత్తురు కోరు మానవుడ! నిల్చునే శాంతి సజీవమై ప్రజా
చిత్తములందు నీవలన? చెట్టును చేమయు లోకసేవ గొం
తెత్తక చేయుకాదె? ఇక నెవ్వరు పూజ్యులు! నీవ?మానవ”
తెలుగు భాషాభిమానాన్ని వ్యక్తం చేస్తూ భాషకోసం గుడి కట్టాలని కొరుతాడు.
“తెలుగు భాషాభిమానమ్ము తేజరిల్లి,
మనసు మనసున కమ్మిన మబ్బులన్ని
తొలగి, అమృత ప్రతిభతోడ తెలుగుజాతి
క్రొత్తగుడి భాషకై కట్డు కొనును గాక”
నిజమైన గురువుని నిర్వచిస్తూ ఈ విధంగా నిర్వచిస్తూ..
“స్వార్థ దర్పమ్ము నణచు సద్భావ బలము
పరుల సుఖముకై తపియించు భవ్యగుణము
మలిన మంటక మనసును మలచు శక్తి
కరపు నరుడెపో నిజమైన గురుడు ధరణి”
రాయలసీమలో ఇటువంటి మహానుభావులు ఎందరో కనుమరుగున ఉన్నారు. కనీసం మనకు జీవితంలో తారసపడిన వారిని కూడా పట్టుకోలేకపోతున్నాం. ఇందుకు సిగ్గుపడాలి. రాయలసీమ సాహిత్యమంటే ఎదో పదిపేర్లకు పరిమితమై పోకుండా నిరాడంబరులై, నిబద్ధతతో బతికిన ప్రతి ఒక్కరిని వెలికితీసి స్మరించుకొందాం.
పాఠశాల స్థాయిలో వివిధ రంగాల నిష్ణాతులతో ఉపన్యాసాలు ఇప్పించడం ఒక కార్యక్రమంగా కొనసాగాలి. చిన్ననాడు పసి మనసుల్లో మద్రితమయ్యే భావనలు వారి జీవితాంతం వెంట ఉంటాయి. కేవలం జ్జానులుగానే కాకుండా మనసున్న వారిగా కూడా విద్యార్థులను ఈ దశలో రూపొందించుకోవచ్చు.
సాహిత్యకారుడిగా, పరిశోధకుడిగా ఉపన్యాసకుడిగా, ఆధ్యాత్మిక జీవిగా, సీమలో అనేక సాహిత్య సంస్థలు నెలకొల్పిన సాహిత్య కార్యకర్తగా, చిన్ననాడు నేను చూసింది, విన్నది ఒక గంటే అయినా జీవితకాలనికి కావలసిన ఆలోచన విధానం చూపిన శ్రీ షేక్ మహమ్మద్ ముస్తఫా గారి సాహిత్యకృషి మరోసారి విస్తృతంగా మాట్లాడుకొందాం.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత,అనంతపురము, 99639 17187)