ఆంధ్రా ‘ఏకగ్రీవ’పంచాయతీల మీద ఒక కన్నేయండి: టి లక్ష్మినారాయణ

(టి.లక్ష్మీనారాయణ)
ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు క్షేత్ర స్థాయిలో పట్టుకొమ్మలు. స్థానిక ప్రభుత్వాలైన పంచాయితీలు, మండల మరియు జిల్లా ప్రజా పరిషత్తులకు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమీషన్ బాధ్యత.
యం.పి.టి.సి.లు మరియు జెడ్.పి.టి.సి.ల నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రత్యర్థుల చేతుల్లో నుండి నామినేషన్ పత్రాలను లాగేసుకొని చించేయడం, భౌతిక దాడులు, దౌర్జన్యాలు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన పలు ఘటనలు రాష్ట్ర వ్యాపితంగా జరిగినట్లు వీడియోలు, ఫోటోలు, వార్తలు ప్రసారమాధ్యమాల్లో వీక్షిస్తున్నాం. వీటిపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ తక్షణం స్పందించి, ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛగా, అందరికీ సమాన అవకాశాలను కల్పించడం ద్వారా శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఏ స్థానానికైనా ఒకే నామినేషన్ దాఖలై ఉంటే దానిపై దృష్టి సారించి, నిజంగా ఏకగ్రీవంగా తమ ప్రతినిథిని ప్రజలు ఎన్నుకొనే వాతావరణం అక్కడ నెలకొని ఉన్నదో! లేదో! నిష్పక్షపాతంగా నిర్ధారణ చేసుకోవాలి. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులు, ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఆ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, తిరిగి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన మీదట నిర్వహించాలి, లేనిపక్షంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ అపఖ్యాతిని మూటకట్టుకొంటుంది. స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించామని ప్రకటించుకొనే నైతికతను కోల్పోతుంది.
మాచర్లలో జరిగిన దాడి ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా! అన్న తీవ్ర ఆందోళన కలుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషన్, పోలీసులు, అధికార యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా, చట్ట పరిథిలో నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ చాటుకోగలదు.

(టి.లక్ష్మీనారాయణ తెలుగు నాట పేరున్న రాజకీయ, సామాజిక విశ్లేషకుడు)