భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అలాంటి ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చెన్నై సత్యం థియేటర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమాని మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికెటర్ శ్రీకాంత్, యూనివర్సల్ హీరో కమల్‌హాసన్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, డైరెక్టర్ కబీర్ సింగ్, హీరో జీవా, వై నాట్ స్టూడియోస్ శశికాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరో రణ్వీర్ సింగ్ సత్యం థియేటర్ ఆవరణలో 40 అడుగుల బ్యానర్‌పై సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రణ్వీర్ కాసేపు హోస్ట్‌గా వ్యవహరించి తనతో పాటు ఇండియన్ టీమ్ సభ్యులుగా నటించిన ఇతర నటులను వేదికపైకి ఆహ్వానించడమే కాదు.. స్టేజ్‌పై కూడా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ – “నేను చెన్నై రావడం ఇదే తొలిసారి. కమల్‌హాసన్‌గారిని కలిసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి టీమ్‌తో కలిసి పనిచేయడం మరచిపోలేను. మా జీవితంలోని ఈ సినిమాకు పనిచేయడం మరచిపోలేని అనుభవం. 83 వరల్డ్ కప్ అంటే మన భారతీయులకు క్రికెట్ కంటే ఎక్కువ ఎమోషనల్ జర్నీ. అప్పటి విజయం చాలా మందిలో కాన్ఫిడెన్స్‌ను నింపింది. కపిల్దేవ్గారి గురించి చెప్పాలంటే..ఆయనొక ఐకాన్.. ఎంటైర్ కెరీర్లో ఒక నోబాల్ కూడా వేయలేదంటూ ఆయన గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన పాత్రను పోషించడం నాకు పెద్ద ఛాలెంజ్. ఆయన బౌలింగ్ యాక్షన్‌ను నేర్చుకోవడానికి చాలా ప్రాక్టీస్ చేశాను. అంత సులభంగా ఆయనలా చేయలేకపోయాను. చాలా కష్టపడ్డాను. డైరెక్టర్ కబీర్ సింగ్ సలహాలతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఈ సినిమాలో ఇతర నటీనటులతో కలిసి నటించడం వల్ల మా అందరిలో ఓ సోదరభావం నెలకొంది“ అన్నారు.
కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన హీరో జీవా మాట్లాడుతూ – “విష్ణు ఇందూరిగారి వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. శ్రీకాంత్ సార్లా నటించాలని చెప్పగానే షాకయ్యాను. ధర్మశాలలో మేం వర్క్‌షాప్‌లో ఉన్నప్పుడు కపిల్దేవ్గారిని కలిశాం. ఆయన శ్రీకాంత్‌గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయనలా చెప్పడంతో నాలో ఇంకా ఒత్తిడిపెరిగింది. దాంతో స్కాట్లాండ్లో తొలిరోజు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందిగా కూడా ఫీలయ్యాను. శ్రీకాంత్‌గారిలా నటించడానికి బాగా ప్రాక్టీస్ చేశాను. రణ్వీర్ అద్భుతంగా ఎఫ్టర్తో నటించాడు. ఈ సినిమాలో నటించడం వల్ల మన ఇండియాలో ఇతర భాషలకు చెందిన నటులతో మంచి స్నేహం ఏర్పడింది“ అన్నారు.
డైరెక్టర్ కబీర్ సింగ్ మాట్లాడుతూ – “నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు 83 క్రికెట్ వరల్డ్‌కప్ జర్నీ యావత్ దేశాన్ని ఎలా ఇన్స్పైర్ చేసిందో చూసి ఆశ్చర్యపోయాను. నేను ఈ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు కపిల్గారు, శ్రీకాంత్‌గారు ఇలా దాదాపు టీమ్‌లో అందరూ దాదాపు 20 ఏళ్ల ప్రాయంవారేనని తెలిసి చాలా స్ఫూర్తి పొందాను. మా సినిమాకు సహకారం అందిస్తోన్న కమల్‌హాసన్‌గారికి థ్యాంక్స్“ అన్నారు.
కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ “1983లో ఇండియా క్రికెట్ విశ్వవిజేతగా నిలుస్తుందని మొదటగా నమ్మిన ఏకైక వ్యక్తి కపిల్ దేవ్ మాత్రమే. ఈ సినిమాను అనౌన్స్ చేయగానే అసలు కపిల్ దేవ్లా ఎవరు చేస్తారా? అనే ఆసక్తి నాలో ఏర్పడింది. తర్వాత రణ్వర్ సింగ్ కపిల్‌లా చేస్తాడని తెలిసింది. తను అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. నేను కాలేజ్ చదివే రోజుల నుండి కమల్‌హాసన్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్. డైరెక్టర్ కబీర్ చూడటానికి సింపుల్‌గానే కనపడతున్నా.. 83 చిత్రాన్ని అందరికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించాడు“ అన్నారు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ – “1983లో క్రికెట్ వరల్డ్‌కప్ విజేతలుగా నిలిచిన మా పాత్రలను పోషించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. వారు మాకు పునర్జనిచ్చారు. నేను చెన్నైకు పలుసార్లు వచ్చాను. కానీ నేను తమిళంను అర్థం చేసుకోలేకపోతున్నానని తొలిసారిగా బాధపడుతున్నాను. ఐ లవ్ చెన్నై. అప్పట్లో శ్రీకాంత్ మా అందరికీ స్ట్రెస్‌బస్టర్‌గా ఉండేవాడు“ అన్నారు. ఆ సమయంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీని కలుసుకున్నప్పుడు జరిగిన శ్రీకాంత్‌తో జరిగిన ఓ ఘటనను కపిల్ గుర్తుకు తెచ్చుకున్నారు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ – “83 సినిమా గురించి డైరెక్టర్ కబీర్ సింగ్ చెప్పిన కొన్ని సన్నివేశాలను వినగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పట్లో ఇండియా టీమ్‌కు లాండ్రీ బడ్జెట్ తక్కువగా ఉండేది. పరిమితమైన బడ్జెట్లోనే సభ్యులు ఇంగ్లాండ్‌లో పర్యటించారు. కపిల్ దేవ్ తన బట్టలను తనే ఊతుక్కునేవాడు. ఇలాంటి చాలా సమస్యలను టీమ్ సభ్యులు అధిగమించారు. అప్పట్లో కపిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ.. అప్పుడు బీబీసీ మీడియా ఆ ఘనతను రికార్డ్ చేయలేదు. కానీ ఆ ఘనతను ఇప్పటి 83 సినిమా టీమ్ రికార్డ్ చేశారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కబీర్ ఖాన్‌కి క్రికెట్ అంటే నాకంటే చాలా పిచ్చి. శ్రీకాంత్‌గారిలా నటించడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి పాత్రలో నటించినందుకు జీవాను అభినందిస్తున్నాను“ అన్నారు.