తొందర్లో జగన్ మరొక భారీ ప్రకటన…. 25 జిల్లాల ఏర్పాటు

( జింకా నాగరాజు)
ఆంధ్రప్రదేశ్ కు  మూడు రాజధానులు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక  సంచలన ప్రకటన చేయబోతున్నారు.
అదే రాష్ట్రంలో 25 జిల్లాలకు ప్రకటించడం. ఇపుడున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించేందుకు రంగం సిద్ధమవుతూ ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
పరిపాలన వికేంద్రీకరణను కేవలం రాజధానిని మూడు ప్రాంతాలకు పంచడంతో ఆపకుండా ఈ ప్రక్రియను మరింత కిందకు తీసుకుపోయేందుకు, విస్తృతపరిచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వంలో దీనికి సన్నాహాలుమొదలయ్యాయి.
ఇందులో భాగమే 25 జిల్లాలు గా రాష్ట్రాన్ని విస్తృతపరచడం. అనేక ప్రాంతాలనుంచి దశాబ్దాలుగా జిల్లాల  డిమాండ్లు ఉన్నాయి. వీటిని అంగీకరిస్తూ  25 జిల్లాలను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు తెలిపాయి.
25 జిల్లాలు ప్రకటన కొత్త సంవత్సం ప్రారంభంలోనే ఉండవచ్చని,  ఉగాది నుంచి అమలులోకి తీసుకు వచ్చే అవకాశం లేకపోలేదని  ఈ వర్గాలు తెలిపాయి.
మూడురాజధానులప్రకటనను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న మాట నిజమే. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అమరావతికి భూములు అప్పగించిన  రైతులు బాగా వ్యతిరేకిస్తున్నారు.
అదే విధంగాతెలుగుదేశం పార్టీతో పాటు వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. జనసేనకూడా వీరతో కలసి అమరావతి రాజధని కొనసాగాలని ఆందోళన చేయవచ్చు. ఇదంతా కేవలం అమరావతికే పరిమితమని, ఇతర జిల్లాల్లో ఎక్కడా మూడు రాజధానుల  ప్రకటనకు వ్యతిరేకత ఉండదని ప్రభుత్వం భావిస్తూ ఉంది.  ముఖ్యమంత్రి ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం వచ్చే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాల్లో ధీమా ఉంది.
అయితే, పరిపాలనలో  అనుభవజ్ఞులయిన  వాళ్లు మాత్రం  స్వాగతిస్తున్నారు. ఉదాహర ణకు  భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ఇఎ ఎస్  శర్మ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇలాగే లోక్ సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ కూడా సమర్థించారు. వారంతా అమరావతి గ్లోబల్ సిటీరాజధానిని వ్యతిరేకించారు. మరొక హైదరాబాద్ వంటి రాజధాని  వద్దు అనే వారు చెబుతూ వస్తున్నారు.
ఇది జగన్ కు ఆత్మస్థయిర్యాన్నిస్తున్నది . అందువల్ల ఆయన వికేంద్రీకరణను మరింత ముందుకుతీసుకుపోవాలనుకుంటున్నారు.
ఇందులో భాగంగానే తొందర్లోనే 25 జిల్లాలనుప్రకటించబోతున్నారని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘వచ్చే అయిదారు నెల్లలో లేదా ఏడాది లో రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. ఇక మళ్లీ వెనక్కు తీసుకువచ్చేందుకు వీలులేకుండా ఈ చర్యలు  ఉంటాయని,’ ఆయన చెప్పారు.
జగన్ 3468 కిమీ పాదయాత్ర ఈ ఏడాది జనవరి ఇచ్ఛాపురం లోముగించినపుడు  ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ ప్రధానంగా మాట్లాడింది అధికార వికేంద్రీకరణ  గురించే. ఈ విషయాన్ని ఆ అధికారి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ శ్రద్ధ చూపిస్తున్న అంశాలు రెండే రెండు. అందులో ఒకటి అధికార వికేంద్రీకరణ. రెండోది అవినీతి నిర్మూలన. ఈ విషయంలో ఆయన రాజీపడక పోవచ్చని  ఆయన అన్నారు.
” వైసిపి అధికారంలోకి వస్తూనే అధికార, పరిపాలనకే పెద్ద పీఠ వేయడం జరుగుతుంది,’ అనిఇచ్ఛాపురంలో ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రకటనలు వెలువడుతున్నాయి. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు వచ్చాయి. ఇపుడు మూడు రాజధానులు వచ్చాయి. ఇక  మిగిలింది, 25 జిల్లాల ప్రకటనే. అది తొందరల్లోనే వస్తుంది, అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
కొత్త జిల్లాలకు ఏర్పాటుచాలా ట్రాన్స్ పరెంట్ గా ఉంటుందని, ప్రజల అభీష్టంప్రకారమే పాలనాసౌలభ్యం, ప్రజాసౌలభ్యం దృష్టిలో పెట్టుకుని  ఈ జిల్లాల ఏర్పాటుజరుగుతుందని ఇచ్ఛాపురం సభలో  జగన్ చెప్పారు.