రాజధానిని వైజాగ్ కు తరలించాలి: జి ఎన్ రావ్ కమిటీ

ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత జి ఎన్ రావు కమిటీ సభ్యులు మీడియాతో  మాట్లా డారు.
అమరావతి:రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని.. విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు, వేసవిలో విశాఖలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని సూచించినట్లు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై ఏర్పాటైన నిపుణులతో కూడిన జీఎన్‌ రావు కమిటీ ప్రకటించింది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, భౌగోళిక పరిస్థితులతో పాటు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది.
అదే విధంగా కర్ణాటక తరహాలో ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన జీఎన్‌ రావు తెలిపారు. 13 జిల్లాల విభజించి నాలుగు ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని, తద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరిగి, అన్ని ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు.
మూడు నెలలకు పైగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన నిపుణుల కమిటీ జీఎన్‌ రావు నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి సంబంధించి కమిటీ పలు సూచనలు చేసింది. ఆ తర్వాత కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
విస్తృతంగా పర్యటన
రాష్ట్ర అభివృద్ధితో పాటు, రాజధాని నిర్మాణం గురించి కూడా నివేదిక రూపొందించామని కమిటీకి నేతృత్వం వహించిన జీఎన్‌ రావు వెల్లడించారు. 13 జిల్లాల్లో 10,600 కి.మీ తిరిగామని, అన్ని చోట్ల అధికారులు, పాత్రికేయులతో పాటు, వివిధ వర్గాల వారికి కలిశామని మూడు నెలలకు పైగా విస్తృతంగా పర్యటించి నివేదిక రూపొందించామని, పలు సిఫార్సులు చేశామని ఆయన చెప్పారు.
నాలుగు ప్రాంతాలుగా విభజన
అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సూచించాా, తద్వారా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న జీఎన్‌ రావు, వాటి గురించి వివరించారు.
ఉత్తర కోస్తా ప్రాంతం:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో ఏర్పాటు
సెంట్రల్‌ కోస్తా రీజియన్‌:
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు
దక్షిణ కోస్తా రీజియన్‌:
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు
రాయలసీమ రీజియన్‌:
చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు
కర్ణాటక తరహాలో రాష్ట్రంలోని 13 జిల్లాలను విభజించి కర్ణాటకలో మాదిరిగా రీజినల్‌ కమిషనరేట్‌లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరిపాలన చేస్తే బాగుంటుంది.
వరద ముప్పు ప్రాంతం తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది కాబట్టి వాటిని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి.
ఆదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి కాబట్టి, రాజధాని నిర్మాణాలు వద్దని సూచించామని, ఆ సమస్య లేని చోట రాజధాని ఉండాలి.
రాష్ట్రంలో వెనకబడిన ఉత్తర కోస్తాతో పాటు, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా పలు సూచనలు చేశాము, ఆ దిశలో రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ ఉండాలని సూచించాము.
రాజధాని వికేంద్రీకరణ
‘అందులో భాగంగా అమరావతి, మంగళగిరి కాంప్లెక్స్‌లో హైకోర్టు బెంచ్, ఇప్పుడున్నట్లు గానే లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, మంత్రుల నివాసాలు, గవర్నర్‌ క్వార్టర్‌ కూడా ఉండాలి.ఈ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ఎన్నో భూములు ఉన్నాయి. కాబట్టి వేరుగా భూసేకరణ కాకుండా నాగార్జున వర్సిటీ, ఎపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన భూములు ఉన్నాయి. వాటిలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టవ చు.
‘విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో హైకోర్టు బెంచ్, వేసవిలో సమావేశాలు నిర్వహించేలా అసెంబ్లీ బిల్డింగ్, సచివాలయంతో పాటు, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఉండాలి.
‘శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టుతో పాటు, అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాా లి.
ఇంకా..
రాష్ట్రంలో విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం–చిత్తూరు వరకు దాదాపు 900 కి.మీ. ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలోని నదులు గోదావరి, వంశధార, నాగావళి, మహేంద్రతనయ ఇంకా కృష్ణ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అక్కడ అన్ని వసతులు కల్పించి, నివాసాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి.ఈ ప్రక్రియలో కాలువలను అభివృద్ధి చేయాలని, కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి.
పర్యటనలో దాదాపు 38 వేల వినతులు స్వీకరించామన్న జీఎన్‌ రావు, తాను వ్యక్తిగతంగా దాదాపు 2 వేల రైతులను కలిశానని వెల్లడించారు. ఇక్కడి రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారని, అదే వి«షయాన్ని ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. తాము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవమని జీఎన్‌ రావు స్పష్టం చేశారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలను సత్వరం పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆయన అన్నారు.
ఉ దా.కు శ్రీకాకుళం రైైతు ఒకసమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రాకుండా, అక్కడ ఒక కమిషనరేట్‌ ఉంటే ఎంతో సహాయంగా ఉంటుందని, ఆ విధంగా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని సూచించామని వెల్లడించారు.
సచివాలయానికి కావాల్సిన అనేక అంశాలు విశాఖలో ఉన్నాయి కాబట్టి, అక్కడ సచివాలయంతో పాటు, సీఎం క్యాంప్‌ ఆఫీస్, వేసవిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఏర్పాటు చేయాలని సూచించామని జీఎన్‌ రావు తెలిపారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాయలసీమ వాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అదే విధంగా ఇతర ప్రాంతాల వారికి కూడా తగిన సౌకర్యం కలిగేలా అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు సూచించామని చెప్పారు.
ఆర్థిక వనరుల గురించి కూడా తెలుసుకున్నామని, రాయలసీమలో చాలా ప్రాజెక్టులకు కొంచెం ఖర్చు చేస్తే అవి పూర్తవుతాయని అన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, ఏ సమస్యా లేదని, ఇక్కడ ఇప్పటికే దాదాపు 165 సంస్థలకు భూములు ఇచ్చారని జీఎన్‌ రావు గుర్తు చేశారు.