న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో మేజర్ పోర్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలి. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం లాభదాయకం కాదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వి.విజయసాయి రెడ్డి చెప్పారు.
రామాయపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాకు అనువైనదిగా గుర్తింపు పొందినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతం తీరం హద్దుగా ఉన్న దేశాలలో నౌకాశ్రాయల నిర్మాణంపై ఇటీవల జరిగిన బిమ్స్టెక్ అంతర్జాతీయ సదస్సు సైతం రామాయపట్నం పోర్టు ఆవశ్యకతను ప్రసావించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. బిమ్స్టెక్ దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలపై రామాయపట్నం పోర్టు ప్రభావం గురించి ఈ సదస్సులో చర్చ జరిగినట్లు చెప్పారు. ఈ పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్-మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు.
కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రామాయపట్నంలో నాన్-మేజర్ పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభఉత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితిగతిన పూర్తి చేస్తుందని అన్నారు.
తద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. మేజర్ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రామాయపట్నంలో 3 వేల ఎకరాల భూమిని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే అయిదేళ్ళు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చమంటూ ఇప్పటికీ మేము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమని అన్నారు.
పోర్టు ప్రాజెక్ట్ ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేయవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.