దేశంలో ఉల్లిగడ్డల కొరత ఇప్పట్లో తీరేలా లేదు. హఠాత్తుగా దేశమంతా వ్యాపించిన ఉల్లికొరతను తీర్చేందుకు అవసరమయినంతగా సరుకు ప్రపంచంలో ఎక్కడా దొరకడం లేదు. చాలా కొద్ది గా దొరుకుతున్నా, అది చేతికందే సరికి తెల్లవారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉల్లి కొరత తీర్చేందుకు భారతప్రభుత్వం విదేశాలనుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవాలనుకుంటున్నది.
నవంబర్ 22న ఈజిప్టు నుంచి 6090 టన్నుల ఉల్లిగడ్డను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సరకు డిసెంబర్ పది నాటికి భారత్ చేరవచ్చు. నవంబర్ 29న మరొక 11 వేల టన్నుల ఉల్లిగడ్డలను టర్కీ నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఆతర్వాత మరొక నాలుగు వేల టన్నుల టర్కీ ఉల్లిగడ్డల దిగుమతి కోసం సంతకాలు చేసుకున్నారు. అంటే మొత్తంగా భారత్ విదేశాల నుంచి వస్తున్న ఉల్లిగడ్డలు మొత్తొ 21,090 టన్నులు మాత్రమే. ఈ సరుకు జనవరి మధ్యలో గాని భారత్ కు రాదు.
దేశంలో ఉల్లిగడ్డల కొరత ఏంతో తెలుసా? 160,000 టన్నుల అని నేషనల్ హార్టికల్చరల్ డెవెలప్ మెంట్ బోర్డు (ఎన్ హెచ్ డిబి) తెలిపింది.
ఈ కొరతతో దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటాయి. దీనితో హోటళ్లలో ఉల్లిగడ్డలు ఇవ్వడం మానేయడమో లేదా ఆహార పదార్థాల ధరలు పెంచడమో చేశారు.
బుధవారం నాడు దేశంలో వివిధప్రాంతాలలో ఉల్లిగడ్డలు కేజీ గరిష్ట ధర ర.200 పలికింది. ఉదాహరణకు విజయవాడలో రు. 200 దాకా చేరితే, ముంబయిలో రు.140 దాకా పలికింది.ఇక కోల్ కతాలో రు.130, చెన్నై లో రు.120, బెంగుళూరులో రు.130 ధర పలికింది. ఇక ఢిల్లీలో కొద్దిగా మెరుగ్గా రు. 90 లకు దొరికాయి.2010లో ఉల్లిగడ్డల కొతర కరువు వల్ల పంట దిగుబడి పోయి ఎదురయితే, ఈసారి అకాల వర్షాలు, దీర్ఘకాల రుతుపవనాల వల్ల పంట నాశనమయి కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో వర్షాల వల్ల 30 శాతం పంటనాశనమయింది. మహారాష్ట్రతో పాటు కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో ఉల్లిగడ్డల పంట ఎక్కుక. అయితే ఈ రాష్ట్రాలన్నీ ఈసారి వరదల బారిన పడి పంటను భారీగా కోల్పోయాయి.