ఎవరికీ పెద్దగా తెలియని ఉల్లి సత్యాలివి, చదవండి

(జింకా నాగరాజు)
దేశాలు  చాలా పే…ద్దవి అయినంత మాత్రాన ఆర్థికంగా పురోగమించాలనేం లేదు.
అలాగే పే…ద్ద ప్రజాస్వామ్యాలయినంత మాత్రాన  ఆదేశాల ప్రజలంతా ఆనందంగా కేరింతలు కొట్టాలనేమీ లేదు.
ఎందుకంటే జిడిపి గ్రోత్ రేటు వేరు, హ్యపీనెస్ ఇండెక్స్ వేరు.
ప్రపంచంలో అమెరికా, చైనా, ఇండియా వంటి సైన్యాల, తుపాకుల, రాకెట్ల  దేశాలలో కంటే ప్రజలు హ్యాపీగా ఉంటున్నది చిన్న చిన్న దేశలయిన నార్వే,స్వీడెన్, ఫిన్లండ్, న్యూజిల్యాండ్ వంటిదేశాలలోనే.
అక్కడే కరప్షన్ తక్కువ,రూల్ అఫ్ ది లా(Rule of the Law)  ఎక్కువ. ఆవేశాలవసరం లేని చోటంతా ఈ దేశాలు నెంబర్ వన్, తెగ ఆవేశాలకు పోయి గుండీలు చించకునే విషయాల్లో మాత్రమే మనమ్ నెంబర్ వన్.
మనం రోజు కొరుక్కుని కసకస నమిలి తినే ఉల్లిగడ్డ కూడా ఇదే సత్యాన్ని వెల్లడిస్తున్నది.
ఉల్లిగడ్డ లేకుండా భారతీయులకు తిండి రుచించదు  కూరల్లో ఉల్లిగడ్డ, పచ్చడిలో ఉల్లిగడ్డ, శాలడ్ లో ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ లేని వంటకం భారతదేశంలో లేదు, మరీ ఉల్లి తిననని భీష్మించుకుంటే తప్ప. ఉల్లి  ఎంత గొప్పదో భారతీయులకు తెలిసినంత మరెవ్వరికి తెలియదు.
ఒక తరం వెనక్కి వెళితే జొన్నరొట్టె, ఉలిగడ్డ కొరికి టిపిన్ చేసిన రోజులు నాకు తెలుసు.
అంబలి లో ఉల్లిగడ్డ వేసుకుని జుర్రుకంటే… వోట్స్ తినే వాళ్లు  సిగ్గుపడాలి.
నాకు తెలిసిన అవ్వొకరు ఎండాకాలంలో ప్రయాణంచేస్తున్నపుడల్లా ఉల్లిగడ్డ చేతిలో పెట్టి పచ్చిదే  అపుడపుడు తింటూ ఉండు, వడ దెబ్బ తగలదనేది.
కెవి రమణారెడ్డి అనే మహామేధావి ఒకరు పూర్వం కావలి జవహర్ భారతిలో లెక్చరర్ గా ఉండేవారు. ఉపన్యాసం కోసం ఆయన్నొకసారి మా కాలేజీకి పిల్చాం. ఆయన్నో లాడ్జిలో దిగబెట్టింది నేనే.  ఆయన బ్రీఫ్ కేసులో ఒక ఆరకిలో ఉల్లిగడ్డలుండటం నేను చూడ్డం, ఆయన దాన్ని గమనించడం ఒకే సారి జరిగాయి. ఇక నేనాశ్చర్యపోతానని తెలిసి ఎండా కాలంలో ఉల్లిగడ్డలు తింటే వడదెబ్బ తగలదని ఇలా తీసుకెళ్తుంటానని  ఆయన కన్ఫమ్ చేశారు.
అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదన్నారు. అంటే ఉల్లి గొప్పదనం గురించి నొక్కి వక్కాణించడమే కాని మరొకటి కాదు.
ఉల్లి లేకుండా చాలా మందికి ముద్ద దిగదు. నార్త్ కి వెళితే ఎంత చిన్న హోటల్ లో కాలుమోపినా, ఏ ఫ్రెండింటికి వెళ్లినా టేబుల్ దగ్గిర కూర్చోగానే,  మన ముందు మొదట తెచ్చిపెట్టేది  శాలడ్ ప్లేట్ నే.
అందులో ఉల్లిగడ్డలు, ముల్లంగి తప్పని సరిగా ఉంటాయి. మీరలా ప్యాజ్ ను, కరకర నమిలేస్తూ తందూర్ రోటి, దాల్ మఖాని కలిపి లాగిస్తూ పోవచ్చు. థ్రిల్ అయిపోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్  నార్త్ నుంచి నేను తెచ్చుకున్న మంచి అలవాటు.
మొన్నామధ్య నాకో కొత్త  విషయం అర్థమయింది, అదేందంటే, ఉల్లి లేకపోతే, ముద్దే కాదు, గుటికెడు మందు కూడా గొంతులోకి జారదని.
ఒక ఆదివారం నాడు   బెంగుళూరు వెళ్లాను,అక్కడి ట్రినిటి సర్కిల్ లో సీనియర్ పాాత్రికేయులు మూర్తిగారు, నాగిరెడ్డి గారితో   తిరుగుతూ ఉన్నానా, ఉన్నట్లుండి జడివాన దాడిచేయడంతో  అనుకోకుండా  ఆపక్కనే ఉన్న  ఒక రెస్టరాంట్ లోకి దూరాల్సి వచ్చింది.
పోయామా,  కూర్చున్నామా, అన్ని వైపుల నుంచి ఒకటే అరుపు, ’అరే బై ప్యాజ్ లావ్’ అని.
ఉల్లి గురించి మాట్లాడమంటే, ఆయుర్వేదం వాళ్లయితేనేం న్యాచురోపతి వాళ్లయితేనేం, హోమియో, ఆల్లోపతి… ఈ మధ్య  కొత్తగా వచ్చిన ఫూడీలు, యూట్యూబ్ ఫుడ్ ఎక్స్ పర్ట్లు , అకెేడీమియా వాళ్లు, సోషల్ మీడియా స్టార్లయి పోయిన ఇల్లాళ్లు.. అకేషనల్ గా  ‘నా కిచెనూ నాఇష్ట’మంటూ ఇన్ స్టాగ్రామ్లోచొరబడుతున్న సెలెబ్రిటీలుు… ఎవరైతే నేం గంటల గంటలు లెక్చర్లిస్తున్నారు.
వాళ్ల ఉల్లి ఆవేశం పాడుగాను, వాళ్ల మాటలు వింటే అసలు భారతీయులే మొదట ఉల్లికనిపెట్టారేమో, మొదట ఉల్లిగడ్డను అనుమానంగా కొరికి రుచి చూసి, గమ్మత్తయిన దాని ఘాటువాసన, కారపు రుచితో థ్రిల్లయిపోయి ప్రపంచానికి చాటి చాప్పింది తెలుగోళ్లనేమో లేదా ఇండియన్లేమో అని అనుమానం వస్తుంది.
 అసలు ఉల్లిపంటను ఇండియన్లు తప్ప మరొకరు పండించరేమో, ఉల్లి వ్యాపారంలో మనమే సూపర్ పవరేమో అన్నట్లు మాట్లాడుతుంటారు వీళ్లంతా.
మొన్నామధ్య యూట్యూబ్ లో ఒక కోనసీమ ఇల్లాలొకరు ఉల్లితో వేయిన్నొక్క వంటాకాలని  అద్భతమయిన షో ఇచ్చి లక్ష పేజ్ వ్యూస్, ఫేస్ బుక్ లో 10 వేల లైకులు, 1500 షేర్లు, 2500 కామెంట్సు సంపాదించింది.
హెడింగ్ చూసి ఆవేశపడి లైక్కొట్టే వాళ్లు, ఫీచర్ ఫోటో లేదా డిపి యో  చూసి  షేర్ చేసే వాళ్లు, రీపోస్టు చేసే వాళ్లు, రీట్వీట్ చేసే వాళ్లు.. వీళ్ల ఉపన్యాసాలు వింటే నిజమే సుమ్మీ అని నమ్మి ’ఉల్లేమాతరం’ అనేంతగా హంగామా చేస్తుంటారు.
అయితే, ఉల్లి సత్యాలనేవి కొన్ని ఉన్నాయి. అవి శిలాక్షరాళ్లాంటివి.  వాటిని ఉల్లి ప్రియులే కాదు,యాంటి ఆనియన్ బ్రిగేడ్స్ కూడా తెలుసుకోవాలి.
వాటి గురించి చిదానంద రాజఘట్టా అనే సీనియర్ జర్నలిస్టొకాయన టైమ్సాసాఫ్ ఇండియాలో చక్కటి వ్యాసం రాశారు.
తినకపోయినా తెల్సుకుంటే తప్పులేదుగా. ఇక్కడ నేను చెప్పేవి అన్నీ అఫిషియల్ సత్యాలు. వాట్సాప్ లో వండినవి కాదు.
అన్నట్లు ఉల్లిగడ్డని బోటనీ స్టూడెంట్స్ ( ఈ మధ్య బాగా తగ్గిపోయారు) ఎలియమ్ సెపా( Allium Cepa) అని గుర్తు పెట్టుకుంటారు.
ఇవే కొన్ని ఉల్లి వాస్తవాలు.
ఒకటి: మీరంతా అనుకుంటున్నట్లు ఉల్లిగడ్డల్లో సూపర్ పవర్ , భారత్ కాదు ,చైనా కాదు… యూరోప్ లో ఉండే నెదర్లాండ్స్.
రెండు: ఉల్లిగడ్డల పంట పండించడంలో నెంబర్ వన్ ఇండియా కాదు చైనా. 2018 లో చైనా 20  మిలియన్ మెట్రిక్ టన్నులు పండిస్తే, భారత్ లో పండింది కేవలం 13 మిలియన్ మెట్రిక్ టన్నులే సుమా.
మూడు: చైనా ఉల్లిగడ్డలను ఆసియా దేశాల వాళ్లు పెద్దగా లైక్ చేయారు. ఎందుకంటే, మనం ఇష్టపడే ఘాటు రుచి, వాసన ఉండవు దీనికి.
నాలుగు : చైనా, ఇండియాలు ఎంత పండించినా వాళ్ల అవసరాలకే ఎక్కువ ఖర్చవుతాయి. ఎగుమతులకు మిగలవు. పంటపండినపుడు కొద్ది ఎక్స్ పోర్ట్ చేసినా,పంటలేకపోతే,ఇండియాలో నయితే ఎక్స్ పోర్ట్ బ్యాన్ చేస్తారు. ఈ మధ్య బ్యాన్ చేశారుగా, అలా. 2018లో భారత్ కు ఉల్లిగడ్డలో ఎగమతుల వల్ల వచ్చింది కేవలం  500 మిలియన్ డాలర్లే.
అయిదు: ప్రపంచంలో ఉల్లిగడ్డల ఎక్స్ పోర్ట్  సూపర్ పవర్ నెదర్లాండ్స్. కేరళ రాష్ట్రమంతా సైజు కూడా ఉండని ఈ దేశం బ్రిలియంట్ గా ఉల్లిపంట సేద్యం డెవెలప్ చేసి హై క్వాలిటీ ఉల్లిగడ్డలు పండించి ఎక్స్ పోర్ట్ మార్కెట్ ను కొట్టేసింది.
ఆరు: 2018 లో ఈ బుల్లి దేశం ఉల్లిగడ్డల ఎగుమతిలో 676మిలియన్ డాలర్లు సంపాదించింది.
ఏడు: ప్రపంచ ఉల్లి ఎగుమతుల్లో నెదర్లాండ్స్ వాటా 20.శాతం. ఇది చైనా కంటే చాలా చాలా చాలా ఎక్కువ.
ఎనిమిది: ఉల్లిగడ్డల్లోనే కాదు, పూల ఎగుమతుల్లో కూడా నెదర్లాండ్స్ నెంబర్ వన్.ప్రపంచంలో పూల ఎగుమతుల్లో నెదర్లాండ్స్ వాటా… 50 శాతం.
తొమ్మిది: అంతేకాదు, టొమాటోల ఎగుమతిలో కూడా నెదర్లాండ్స్ నెంబర్ వన్. టొమాటో ఎగుమతుల విలువ ఎంతో తెలుసా? 1.9 బిలియన్ డాలర్లు.
పది : ప్రపంచంలో సుగంధ ద్రవ్యాలకు ఇండియా పెట్టింది పేరు.  అయితే ఇదిచరిత్రలో మాత్రమే. ఎందుకంటే ఇండియన్  స్పైస్ కోసమే  ప్రపంచ వాణిజ్యముండేది. ఆరోజుల్లో ఇండియన్ స్పైస్ ను యూరోప లో లంచంగా కూడా ఇచ్చి పనులుచేయించుకునేవారని చదివాం. ఇపుడయితే పెప్పర్, చిల్లీస్ ఎగుమతుల్లో నెదర్లాండ్సే రారాజు. పాలఉత్పత్తులు, బీర్ ఎగుమతుల్లో కూడా నెదార్లాండ్సే నెంబర్ వన్.
పదకొండు: ఉల్లిగడ్డల్లో ఎగుమతుల్లో ఆగ్రశ్రేణి దేశాలు, ఎగుమతుల్లో వాటి వాటా (2018):1. నెదర్లాండ్స్ (676 .1 మిలియన్ల డాలర్లు, 19.1 శాతం), 2. ఛైనా (509.5 మిలియన్ డాలర్లు, 14.4 శాతం), 3. మెక్సికో (428.3మిలియన్ డాలర్లు, 12.1 శాతం), ఇండియా (421.2 మిలియన్ డాలర్లు (12.1 శాతం), 5. అమెరికా (231.7 మిలియన్ డాలర్లు. 6.5శాతం)
పన్నెండు: ఉన్నట్లుండి ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోవడంతో భారతదేశం ఎగుమతులను నిషేధించింది.దీనితో పాకిస్తాన్, బంగ్లా దేశ్, శ్రీలంక,నేపాల్ దేశాల వంటలన్నీ రుచి తప్పుతున్నాయని వార్తలొస్తున్నాయ్. ఈ దేశాలే భారత్ నుంచి ప్రధానంగా ఉల్లిగడ్డులు దిగుమతి చేసుకునేవి