యూట్యూబ్ లో… మీరు తప్పక కలవాల్సిన అమెరికా తెలుగువాడీయన

(డా. కే.వి. రమణరావు)
‘ఎవడు బతికేడు మూడు యాబైలు’ అన్నాడు శ్రీశ్రీ. ఎప్పుడైనా ఏమనిషైనా రెండుమూడు తరాల కాలంలో మాత్రమే జీవించగలడు. మనుషులు సృష్టించిన నాగరికత మాత్రం ఒకతరంనుంచి మరొక తరానికి నిరంతరంగా ముందుకు వెళ్తూంటుంది.
కొందరు అనేక కష్టనష్టాలకోర్చి నాగరికత ముందడుగేయడానికి అవసరమయ్యే గొప్ప పనులు తమజీవితకాలంలో చేస్తూంటారు. అలాంటివారి ఆలోచనలను, శ్రమను గురించి తెలుసుకోవడం, గుర్తించడం ప్రతి కొత్తతరానికీ అవసరం, బాధ్యతకూడా.
ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మౌఖికంగా, చరిత్ర పుస్తకాలు, స్వీయచరిత్రల్లాంటి వాటి ద్వారా తెలుసుకుంటాము. ఈతరంలో కొత్తగా అంతర్జాలపు వ్యాసాలు, పత్రికలు, విడియోలు, ఆడియోలు మొదలైన ఆధునిక రూపాల్లోకూడా ఈ సమాచారం వెలువడుతోంది.
ఎప్పటినుంచోవున్న సాహిత్యం, మొన్నటి తరంనుంచి వచ్చిన సినిమా రెండూ ఎప్పటికప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అందులో కొన్ని మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇప్పటికి ఒకటి రెండు తరాలకింద వచ్చిన సాహితీరూపాలు, సినిమాలు వాటి వెనకవున్న మనుషులు, వారి ఆశయాలు, మానసిక శారీరక శ్రమ గురించి తెలుసుకోవడం ఆసక్తిదాయకమేకాక ఉపయోగకరం, స్పూర్తిదాయకంకూడా.
అలా తెలుసుకోవాలన్న ఆసక్తిగలవారికి ‘యూ ట్యూబ్’ లో  ‘కిరణ్ ప్రభ’  ఆడియో టాక్స్ ఒక గొప్ప రిపాజిటరి. స్మార్ట్ ఫోన్లున్న ఈకాలంలో ఒక పెద్ద ఓపెన్ సోర్స్. ఇవి వినసొంపుగా తయారుచెయ్యడంలో ఆయన అనన్యసామాన్యమైన తపనను, ప్రతిభను అంతకుమించిన కృషిని కనబర్చారు.
నిన్నమొన్నటి తరాల ముఖ్యమైన సినిమాలను, వాటివెనుక గల వ్యక్తులను, సమాజాన్ని ప్రభావితం చేసిన సాహితీవేత్తలను, ఇతరులను కొన్ని వందల సంఖ్యలో ఎంచుకుని వాటిని/వారిని గురించి విస్తృతమైన సమాచారాన్ని సేకరించి, ఆడియో టాక్స్ గా రూపొందించి అందరికీ అందుబాటులో పెట్టారు. ఆయన ప్రసంగాలను వేలాదిమంది విన్నారు, వింటున్నారు.
ఈ ప్రసంగాలను ఆయన ‘బే ఏరియా రేడియో’, అంతర్జాల ‘టోరి’ రేడియో, ‘కౌముది ఆడియో టాక్స్’ (యూ ట్యూబ్) ల ద్వారా 2011 నుంచి వెలువరిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అందరికీ అందుబాటులో యూ ట్యూబ్ లో లభిస్తున్నాయి.
 కిరణ్ ప్రభ  ఇవన్నీ లాభాపేక్షలేని ఒక సేవాభావంతోనే చేశారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆయన ప్రసంగాల వివరాల్లోకెళ్లేముందు ఆయనగురించి పరిచయమాత్రంగా నాలుగు మాటలు.
ప్రస్తుతం అమెరికాలో, కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర్లో ఉన్న డబ్లిన్ లో నివాసముంటూ, ఒక సాఫ్ట్ వేర్ కంపెనిలో మేనేజర్ గా పనిచేస్తున్న  కిరణ్ ప్రభ కృష్ణాజిల్లాలో అతి సామాన్య రైతుకుటుంబంలో పుట్టారు. ఆజిల్లాలోని శ్రీకాకుళం గ్రామందగ్గరి పాపవినాశం వారి స్వంతవూరు.
వారి చదువు ఆవూరిచుట్టుపక్కల, బందరులో, ఆతరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ జరిగింది. ఎలెక్ట్రానిక్స్ లో ఎమ్మెస్సీ చేశాక ఆయన కొన్నేళ్లు హైదరాబాదులో ఈసిఐల్ లో పనిచేసి ఆతరువాత అమెరికా వెళ్లి తదుపరి అక్కడే స్థిరపడ్డారు.
చిన్నప్పటినుంచే సాహిత్యం మీద ఆసక్తివున్న కిరణ్ ప్రభ  విద్యార్థి దశనుంచే కవిత్వం రాశారు. ఆయన వివిధ ఫోటోలమీద రాసిన కవితలు కొన్నేళ్లపాటు ‘పల్లకి’ వారపత్రికలో ప్రచురింపబడి ఆయనకు మంచిగుర్తింపు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం ఆయన ఆడియో ప్రసంగాలు ఇవ్వడమేకాక 2007 నుంచి నిరంతరాయంగా, స్వంతంగా ‘కౌముది’ అనే ప్రాచుర్యంగల వెబ్ పత్రికను విశేషరీతిలో నడుపుతున్నారు.
ఆయన ఆడియో టాక్స్ రెండుమూడు తరాలను కవర్ చేస్తూ విస్తృతమైన రేంజ్ లో ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే ‘స్వర్గసీమ’ నుంచి ‘బాషా’ వరకు కొన్ని పదులసంఖ్యలో సినిమాలు, బి.యెన్.రెడ్డి నుంచి దాసరి నారాయణరావు వరకు, బళ్లారి రాఘవ నుంచి చిరంజీవి వరకు, కన్నాంబనుంచి సిల్క్ స్మిత వరకు, సముద్రాల నుంచి సిరివెన్నెల వరకు ఇలా చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, నటులు, నటీమణులు, రచయితలు, సంగీతదర్శకుల మీద ప్రసంగాలు ఉన్నాయి.
‘మహానటి’ సినిమా తీయడానికి కలిగిన ప్రేరణల్లో సావిత్రిగారి మీద వీరి ఆడియో టాక్ కూడా ఒకటని అంటారు.
తెలుగు సినిమా ఒకటే కాదు హిందీ, ఇంగ్లిష్ సినిమాలపైన, ఆరంగాలకు సంబంధించిన అమితాబ్ బచ్చన్, చార్లీ చాప్లిన్, సూపర్ మ్యాన్ క్రిస్టఫర్ రీవ్, సత్యజిత్ రే లాంటి అనేక ప్రముఖవ్యక్తులపైన కూడా టాక్స్ ఉన్నాయి.
సాహిత్యరంగానికొస్తే గురజాడ, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, చలం లాంటి అనేకమంది ప్రసిద్ధ రచయితలమీద, వారి రచనలమీద ప్రసంగాలు ఉన్నాయి. ఇవే కాక మనకు తెలిసిన, అంతగా తెలియని చాలామంది స్వాతంత్ర్యసమరయోధుల మీద ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీలాంటి ప్రస్తుత రాజకీయ నాయకులగురించి కూడా ఆయన చెప్పారు.
అంతేకాక దుర్గాభాయ్ దేశ్ ముఖ్, కోడి రామ్మూర్తి, సి.పి. బ్రౌన్, పింగళి వెంకయ్య, యెల్లాప్రగడ సుబ్బారావు, కైలాస్ ఖేర్, హాల్డేన్, మేరీ క్యూరి, మొయినుద్దిన్, సి.కె.నాయుడు, నోబెల్, ఆనందిబాయి, నాజర్, ఆస్కార్ వైల్డ్ లాంటి విభిన్న రంగాలకు చెందిన ప్రసిద్ధులగురించి కూడా ప్రసంగాలున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే ఈనాటి యువతీయువకులు తెలుసుకోవాల్సిన దాదాపు అన్ని రంగాలకు చెందిన గొప్పవాళ్ల గురించి ఈ ప్రసంగాలు తెలియబరుస్తాయి. కొందరిగురించి పరిచయమాత్రంగా ఉంటే మరికొందరి విషయంలో సుధీర్ఘంగా ఉంటాయి.
సంఖ్యాపరంగా చూస్తే మొత్తంగా దాదాపు ఎనిమిదివందల రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో జీవితచరిత్రలే 350 వరకు ఉంటాయి. కొందరిమీద అరగంటనుంచి గంటవరకు ఒకప్రసంగమే ఉంటే మరికొందరిమీద కొన్ని గంటలపాటు సీరియల్ భాగాలుగా విభజించి అనేక ప్రసంగాలు చేశారు.
ఉదాహరణకు రచయిత చలం జీవితం 22 ప్రసంగాల నిడివివుంది. ఇది అన్నిటికంటే ఎక్కువ. మిగతావాళ్లకొస్తే అమితాబ్ బచ్చన్ మీద 16 భాగాలు, బి నాగిరెడ్ది (9 భాగాలు), కార్ల్ మార్క్స్ (8), చాప్లిన్ (8), భానుమతి (7), హీరో క్రిష్ణ (5), సుభాష్ చంద్ర బోస్ (5), సత్యజిత్ రే (5), వేయిపడగలు (10), షోలే మీద ఆరు, ఇలావుంటాయి.
ఒకే ప్రసంగమున్నా, చాలా భాగాలుగా ఉన్నా చెపుతున్నదాంట్లో చక్కటి కంటిన్యుటి ఉంటుంది. మనం అన్నిభాగాలూ ఒకేసారి వినకపోయినా ప్రతిభాగంలోనూ మొదట్లో కొద్దిసేపు రీక్యాప్ ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు.
ఈ ప్రసంగాలలో ఆయా సినిమాలకు, వ్యక్తులకు, రచనలకు సంబంధించి దాదాపుగా శ్రోతలకు అవసరమయ్యే అన్ని విషయాలూ కిరణ్ ప్రభగారు ఒక క్రమపద్దతిలో చెప్తారు. ఒక్కో ప్రసంగం నిడివి అరగంట నుంచి గంట పైవరకు ఉంటుంది. ఆయన సేకరించిన సమాచారాన్ని చూసి మనకు ఆశ్చర్యమౌతుంది.
ఈసమాచారమంతా ఈనాటిది కాదు, ఎప్పటిదో. ఒకే చోట దొరకదు. చాలా చోట్లనుంచి ముక్కలుగా సేకరించాల్సివుంటుంది. సేకరించిన సమాచారంలో అంతా పనికిరాకపోవచ్చు. ఎడిట్ చేసుకుని ఒక క్రమపద్దతిలో అమర్చుకోవాలి. మధ్యలోని గ్యాప్స్ ని మళ్లీ సేకరించి పూరించుకోవాలి.
ఇంత బృహద్ ప్రయత్నాన్ని చాలావరకు శ్రీ కిరణ్ ప్రభగారు, వారి శ్రీమతి కాంతి కిరణ్ గారు ఇద్దరే చేస్తారంటే అది నమ్మశక్యంకాని నిజం. గంట ప్రసంగానికి 6 నుంచి 8 గంటల శ్రమ ఉంటుందని ఆయన అంటారు.
ప్రతి ప్రసంగానికి ఒక పూర్వరంగం, మొదలు, క్రమంగా ఏం జరిగింది, చివరన ఏమైంది ఇవన్నీ కారణాలతో సహా ఉంటాయి. ఐతే వీలైనంతవరకు ఆయన తన స్వంత లేదా ఇతరుల దృష్టితో కాకుండా ఆబ్జెక్టివ్ గా విషయాన్ని చెప్పడంవల్ల శ్రోతలకు ఒక మంచి ఫీల్ గుడ్ అనుభూతి కలుగుతుంది. మనకు ముందే వారిగురించి తెలిసి, మన అభిప్రాయం మనకున్నా కూడా ఒక సహానుభూతి కలుగుతుంది.
ఒకప్రదేశంలో వందేళ్లనాటి పరిస్థితులు, అలవాట్లు, సంప్రదాయాలు, అప్పటి ఆదాయాలు, వస్తువుల రేట్లు, అప్పుడు జరిగిన సంఘటనలు, వ్యక్తిత్వాలు, వాటిమధ్య ఘర్షణలు అన్నీ అలవోకగా సందర్భాన్నిబట్టి ప్రసంగంలో వస్తూవుంటాయి. మనం ఆరోజుల్లోకి వెళ్లిపోతాం. రూమర్లు, వక్రీకరణలు, వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు ఇలాంటివేవీ ఆ ప్రసంగాలలో ఉండవు.
ఇక చెప్పే విధానానికొస్తే వినడానికి ప్రతి ఆడియోటాక్ ఒక ఆహ్లాదకరమైన కథ విన్నట్టుగా ఉంటుంది. ఆయన గొంతు మెటాలిక్ గా, అవసరమైన చోట్ల కావలసిన విరుపులతో ఉండి, ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. చెప్పే విధానం ఒక ఉపన్యాసంలా కాకుండా ఒక మిత్రుడు పార్కులో ప్రశాంతంగా ఎప్పుడో జరిగిన విషయాన్ని మనతో స్నేహపూర్వకంగా ముఖాముఖిగా చెప్పినట్టుగా ఆసక్తికరంగా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
అంతకష్టపడి విషయసేకరణ చేసి, ఎంతో సమయాన్ని వెచ్చించి తన ప్రసంగ పాఠాలను తయారుచేసుకుని స్టూడియోకెళ్లి టాక్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం, ‘అవన్నీ తనకెంతో స్పూర్తిదాయకంగా ఉండడమే’ అని ఆయన అంటారు.
ఆయా వ్యక్తులు ఎంతో తపించి, ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ గొప్ప పనులు చేసినప్పుడు తను వాళ్లగురించి సమాచారం సేకరించి లోకానికి తెలియజేయడం పెద్ద విషయమేమీకాదని, పైగా అవి విని ఇంకా ఎంతోమంది స్పూర్థి పొందే అవకాశం ఉండడమనేది తనకు ప్రొత్సాహాన్నిస్తూందని అభిప్రాయపడతారు.
ఆయన అనుకున్నట్టుగానే శ్రోతలు ఆయన కొన్ని రేడియో టాక్స్ మధ్యలో ఫోన్లు చేసి అయన్ని అభినందిస్తూ, తాము ఎలా స్పూర్తిపొందామో చెపుతూంటారు. ఒక్కోసారి ఒకవ్యక్తి గురించి ప్రసంగిస్తున్నప్పుడు ఆవ్యక్తి దగ్గరిబంధువులు ఫోన్ చేసి తమ అనందాశ్చర్యాలను వెలిబుచ్చుతూ, ఒకట్రెండు స్వీయ అనుభవాలను శ్రోతలతో పంచుకుంటారు.
ఆయన ప్రసంగాలు విన్నప్పుడు మనక్కుడా మనం అభిమానించే వాళ్లు, సినిమాలు, పుస్తకాల గురించి, ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్లగురించి, ఈయన ప్రసంగాలు తయారుచేసి వినిపిస్తే బావుంటుందని అనిపిస్తుంది. పైగా ఇవన్నీ ఏ శ్రమా లేకుండా ఉదయపు లేదా సాయంకాలపు నడకలోనో, డ్రైవింగ్ లోనో, వెయిట్ చేస్తున్నప్పుడో ఆసక్తిగా వినచ్చుకదా.
ఏది ఏమైనా ఈ మంచి ప్రసంగాలు వినిపిస్తున్న కిరణ్ ప్రభ గారికి, వారి వెనక ఉండి తత్సమానంగా కృషి చేస్తున్న వారి శ్రీమతిగారికి ఈ పత్రికాముఖంగా బహు ధన్యవాదాలు. ఆయన ఇంకా చాలాకాలంపాటు తన ప్రవృత్తికి ఇష్టమైన ఇలాంటి కార్యక్రమాలు చేసి శ్రోతలను అలరిస్తూనే ఉండాలని ఆశిద్దాం.
ఎవరైనా యూ ట్యూబ్ కెళ్లి ‘కిరణ్ ప్రభ ఆడియో టాక్స్’ అని టైప్ చేస్తే చాలు ఆయన ఆడియో ప్రసంగాలు వస్తాయి. తమకు కావలసిన ప్రసంగాన్ని వినాలనుకుంటే ‘కిరణ్ ప్రభ – ‘ అని టైప్ చేసి పక్కన ప్రసంగం పేరు టైప్ చేస్తే అదే వస్తుంది. ఆయన ప్రసంగాల యూట్యూబ్ లింక్ ఇది:
కిరణ్ ప్రభ లేదా కిరణ్ ప్రభ ఆడియో టాక్స్ క్లిక్ చేయండి.
ఆయన ప్రసంగాల పట్టిక, లింకులతో సహా ఇక్కడ చూడచ్చు http://koumudi.net/talkshows/index.htm లేదా Koumudi App for iPhones, Podcasts in Spotify, iTunes and Google Music ద్వారా కూడా వినవచ్చు.

(డా. కే.వి.ఆర్. రావు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలో ప్రిన్సిపల్ గా రిటైరయ్యారు. రచయిత, కవి. విమర్శకుడు. ఏ ప్రక్రియ తీసుకున్నా ఆందులో సునిశిత పరిశీలన ఉంటుంది.ఆయన రచన దూకే జలపాతం కాదు. చల్లగా మెల్లి,స్వచ్ఛంగా పారే ఏటి జాలులా సాగుతుంది)