పసుపు సాగు, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తమ్మీద అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 224.26 లక్షల హెక్టార్లలో పసుపు సాగవుతుండగా.. 2018-19లో తెలంగాణలో 53.56 వేల హెక్టార్లలో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అయింది. హెక్టారుకు సగటున 2 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉన్నట్టు ఉద్యానశాఖ వెల్లడించింది. పసుపుసాగులో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్లలో సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నప్పటికీ పసుపు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడి ఉన్నాయి. తెలంగాణలో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుండగా 20,250 మెట్రిక్ టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలు 56.25 మెట్రిక్ టన్నుల పసుపును వినియోగిస్తుండగా ఏడాదికి 20,250 మెట్రిక్ టన్నులుగా ఉంటున్నదని ఉద్యానశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలు పసుపు సాగుకు అనుకూలంగా ఉన్నాయి.