బెంగుళూరు: కర్ణాటక శాసనసభ్యుల అనర్హత కేసులో సుప్రీం కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు వల్ల 17 మంది మాజీ ఎమ్మెల్యేలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది.
అయితే ఈ అనర్హులను శాసన సభ పదవీకాలం ముగిసే దాకా (2023) ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం చెల్లదని త్రిసభ్య పీఠం పేర్కొన్నది.
వచ్చే నెలలో జరగనున్న ఉపఎన్నికల్లో వీరు పోటీ చేయవచ్చునని స్పష్టం చేసింది. డిసెంబర్ 5న కర్ణాటకలోని 15 శాసనసభా స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ 15 సీట్లలో కనీసం 8 స్థానాలైనా గెల్చుకుంటేనే తప్ప యడియూరప్ప ప్రభుత్వం బతికి బట్టకట్టలేదు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
పార్టీ ఆదేశాలను ధిక్కరించి సంకీర్ణ ప్రభుత్వం పతనానికి కారకులైన సదరు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టం కింద శిక్షార్హులే నంటూ కాంగ్రెస్, జెడిఎస్ లు కూడా పిటిషన్ లు దాఖలు చేశాయి.
ఈ కేసులన్నింటినీ ఒక్కటిగా గుది గుచ్చి విచారించిన సుప్రీంకోర్టు న్యాయపీఠం రెండు మూడు వాయిదాల తర్వాత ఎట్టకేలకు బుధవారం తీర్పు ప్రకటించింది.
శాసనసభలో ఇప్పుడు బిజెపి సంఖ్యాబలం 105 కాగా వారికి ఓ ఇండిపెండెంట్ మద్దతు ఉంది. కర్ణాటక శాసనసభలో మొత్తం 225 స్థానాల్లో అధికారం చేజిక్కించుకోడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113.
నిజానికి మొత్తం 17 సీట్లకు ఉపఎన్నికలు జరగాల్సినప్పటికీ మస్కీ, రాజరాజేశ్వరీనగర్ స్థానాలు మినహాయింపు పొందాయి. ఈ సీట్లలో ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయి.
ఆ 17 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనందున, మొత్తం సభ్యుల సంఖ్య తగ్గిపోవడం వల్ల శాసనసభలో మెజార్టీ నిరూపించుకుని నిలదొక్కుకోగలిగిన యడియూరప్ప తన మంత్రివర్గంలో 16 స్థానాలను ఖాళీ పెట్టారు.
ఉపఎన్నికల్లో బిజెపి టికెట్లిచ్చి గెలిపించుకుంటాననీ, గెలిచి వచ్చాక మంత్రుల్ని కూడా చేస్తానని అనర్హ ఎమ్మెల్యేలకు అప్పట్లో ఆయన గట్టి హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రతిబంధకాలన్నీ తొలగిపోయాయి కాబట్టి కర్ణాటకలో ఉపఎన్నిలకల రాజకీయాలు తక్షణం ఊపందుకున్నాయి.
తీర్పుపై ఉత్కంఠతో ఢిల్లీలోనే మకాం వేసిన సదరు అనర్హ ఎమ్మెల్యేలు సాయంత్రం లోగా బెంగుళూరు చేరుకోగలరని భావిస్తున్నారు. వాళ్లు వచ్చే లోగానే ముఖ్యమంత్రి యడియూరప్ప బిజెపి ముఖ్యులతో మంతనాలు ముగించి వారితో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది.
తాను తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేసిన ఈ మాజీ ఎమ్మెల్యేలందరికీ పార్టీ టికెట్లిచ్చి గెలిపించుకుని పదవి సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప తహతహ లాడుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ విధేయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఉదాహరణకు బెళగావి జిల్లాలో జర్కిహొళి సోదరులకు పెద్దపీట వేస్తున్నందుకు నిరసనగా బిజెపి పాతతరం నాయకుడు రాజు కాగె కాంగ్రెస్ పంచన చేరారు. హవేరి జిల్లాలోని రాణిబెన్నూరు, హిరేకెరూరు వంటి చోట్ల కూడా ఇదివరకటి కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతుండటం బిజెపి కార్యకర్తలకు మింగుడు పడటం లేదు.
ఇలాంటి అవాంతరాలెన్ని ఉన్నా ఉపఎన్నికల్లో గట్టెక్కగలనని యడియూరప్ప ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ లో నాయకుల మధ్య అనైక్యత, జెడిఎస్ తాజాగా ఏర్పడిన నైరాశ్యం తమ పార్టీకి శ్రీరామ రక్ష కాగలదని బిజెపి అంచనా వేస్తున్నది.