అమర వీరుని తాకితే అదృష్ణం …బెల్జియంలో కూడా ఇదే నమ్మకం (యూరోప్ యాత్ర 4)

(డా. కే.వి.ఆర్.రావు)

మా యూరప్ యాత్ర, నాలుగో భాగం: బ్రస్సెల్స్, అమ్ స్టెర్ డామ్, కోల్న్, ఫ్రాంక్ ఫర్ట్;

 

ఫ్రాన్స్ తరువాత మూడురోజుల్లో వరసగా బెల్జియం, నెదర్లాండ్స్, జర్మని దేశాల్లోని నాలుగు నగరాలు చూశాము. ప్యారిస్ హోటల్లో అల్పాహారం తీసుకుని (ఇక అప్పటినుంచి అన్నిరోజులూ కాంటినెంటల్ అల్పాహారమే) యాత్ర ఐదోరోజు పొద్దున్నే బయలుదేరి మొదట బ్రస్సెల్స్ (బెల్జియం) కి వెళ్లాము. బస్సులోనుండే బ్రస్సెల్స్ నగర సందర్శన చేశాము. అన్నీ చక్కటిరోడ్ల కిరువైపులా భవనాలు. బెల్జియం పెద్ద పెద్ద గాజు ఫలకలకి ప్రసిద్ధి. అక్కడి భవనాల వెలుపలి భాగం చాలావరకు అలాంటి గాజు ఫలకలతో నిండివుంది.
మధ్యాన్న భోజనం ఒక పాకిస్తాని రెస్టారెంట్ లో చేసి, రెండు ఎత్తైన టవర్లతో గోథిక్ పద్దతిలో 16 వ శతాబ్దంలో కట్టిన సెయింట్ మికాయెల్, సెయింట్ గుడులా కెథెడ్రల్ చూసి, చివరగా గ్రాండ్ ప్లేస్ లో ఆగాము. అదొక పెద్ద చారిత్రక స్క్యేర్. క్రితం శతాబ్దాల్లోని శ్రామికుల గిల్డులు (సంఘాలు) కట్టుకున్న భవనాలు చుట్టూ ఉన్నాయి. ఇప్పుడుకూడా అక్కడ రైతుబజార్ లాంటివి పెడుతూవుంటారు. టౌన్ మ్యూజియం కూడా అక్కడే ఉంది
ఆ సెంటర్ నుంచి వెళ్లే ఒక వీధి వెంబడి చాలారకాల షాపులు చూసుకుంటూ దారిలోనే ఉన్న ‘ఎవరార్డ్ సెర్ క్లేస్’ విగ్రహం దగ్గరికి వెళ్లాము. అతను బ్రస్సెల్స్ కోసం అనేక పోరాటాలు చేసిన 14వ శతాబ్ధి వీరుడు. శత్రువులచేత అన్యాయంగా చంపబడి అమరవీరుడయ్యాడు.ఆ విగ్రహాన్ని తాకితే అదృష్టం కలుగుతుందని అక్కడివాళ్ల నమ్మకం. మేముండగానే అనేకులు దాన్ని ప్రత్యేకంగా తాకడం చూశాము. అభివృద్ధి చెందిన దేశాల్లోకూడా మూఢనమ్మకాలు ఇంతగా ఉన్నాయా అనుకున్నాము.
ఆవీధిలోనే ఇంకా ముందుకెళ్తే ఒంటేలు పోస్తున్నట్టు నిలబడివున్నచిన్నపిల్లాడి కంచువిగ్రహం వస్తుంది. దాన్ని ‘మాన్నెకెన్ పిస్’ విగ్రహంఅంటారు. అది బెల్జియన్లకెంతో ప్రీతిపాత్రమైనదట. దాన్ని ఒక ఫౌంటెన్ పైన ఉంచారు. దానివెనక రకరకాల కథలున్నాయి. ఎవరూలేని సమయంలో నిప్పు చెలరేగినప్పుడు ఆ పిల్లాడు ఒంటేలు పోసి నిప్పును ఆర్పి బ్రస్సెల్స్ ని కాపాడినందుకు చిహ్నంగా ఏర్పరిచారన్నది ఆ కథల్లో ఒకటి.
అక్కడ రకరకాల బెల్జియం చాక్లెట్లు అమ్మే షాపులున్నాయి. మా సహచరులంతా గ్రూప్ డిస్కౌంట్లలో బాగానే చాక్లెట్లు కొన్నారు.
ఆసాయంత్రం సిటీ వదలి వెళ్తూ శివార్లలోవున్న అటోమియం అనే ల్యాండ్ మార్క్ చూడడానికెళ్లాము. బ్రస్సెల్స్ లో 1958లో జరిగిన ప్రపంచ ఎక్స్పో సందర్భంగా ‘ఇనుప అణువు’ను అనుకరిస్తూ కట్టిన 335 అడుగుల ఎత్తైన స్టీలు, కాంక్రీటు నిర్మాణం అటోమియం. గాలిలో తేలుతున్నట్టు వివిధ కోణాలలో, ఎత్తులలో నిలబెట్టిన తొమ్మిది 60 అడుగుల వ్యాసంకలిగిన స్టీలు గోళాలున్నాయి. కొన్ని గోళాల్లోకి వెళ్లడానికి లిఫ్టులున్నాయి. మొత్తంగా చూస్తే అదొక బృహద్ ఇనుము అణువు అనుకోవచ్చు. మానవుడు అణుబాంబులు తయారుచెయ్యకూడదన్న సందేశంకూడా అందులో ఉందన్నారు.
అది చూశాక బయలుదేరి రాత్రికి ఆమ్ స్టెర్ డాం దగ్గర్లోని ఐండొవన్ లో హోటెల్ చేరుకున్నాము. రాత్రి అక్కడే భోజనం, బస. ఈ హోటెల్ పూర్వమొక పెద్ద హాస్టల్ తో కూడిన నన్నరీ క్యాంపస్. పొడవైన కారిడార్లతో, వివిధ బ్లాక్స్ తో, చుట్టూ తోటలతో కొంచెం తికమకగా ఉంటుంది.
మేమారోజు బ్రేక్ ఫాస్ట్ ఫ్రాన్స్ లో (ప్యారిస్), లంచ్ బెల్జియంలో (బ్రస్సెల్స్), డిన్నర్ నెదర్లాండ్స్ లో (ఆంస్టెర్ డాం దగ్గరి ఐండొవన్) చేశాము, మనం ప్రపంచంలోని బిలియనీర్లకేమీ తక్కువకాదు’ అని మా సహయాత్రీకులం హాస్యంగా అనుకున్నాము.
ఆరోరోజు ఉదయాన్నే హేగ్ నగరంమీదుగా అమ్ స్టర్ డాం వెళ్లాము. వెళ్లేదారిలో ఆగి మదురోడాం మినియేచర్ పార్క్ (ఫీచర్ ఫోటో) చూశాము. రెండో ప్రపంచయుద్ధంలో నెదర్లాండ్స్ కి చెందిన మదురో అనే ‘లా’ విద్యార్థినాయకుడు అత్యంత సాహసం ప్రదర్శించి జర్మన్ సైన్యంతో పోరాడి యుద్ధఖైదీగా పట్టుబడినా ఆ తరువాత కాన్సన్ట్రేషన్ క్యాంపులో మరణించాడు. అతని పేరుతో ఈ పార్కు ఏర్పరిచారు.
పార్కులో దాదాపు రెండెకరాల స్థలంలో నెదర్లాండ్స్ కి చెందిన అన్ని ముఖ్యమైన భవనాలను, కాలవలు, ఓడరేవు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాలను 25 రెట్లు తక్కువ సైజులో చెట్లతోసహా బొమ్మల్లాగా చూడవచ్చు. అంతేకాదు, ఓడలు, విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. పెద్దలుకూడా మెచ్చేవిధంగా పార్కుని ఎంతో నైపుణ్యంతో సహజంగా నిర్మించి, నడపడాన్ని తప్పక అభినందించాలనిపిస్తుంది. ఇక్కడ మన తెలుగు సినిమాపాటలు ఒకటో రెండో చిత్రీకరించారని చెప్పారు.
మదురోడాం చూశాక తిరిగి బస్సులో బయలుదేరి ఆంస్టర్ డాం చేరాము. చక్కటి చారిత్రక ఆకృతులతోవున్న భవనాలతో, కాలువలతో శుభ్రంగా, అందంగా ఉన్న నగరాన్ని బస్సులోనుంచే సందర్శించాము. ఈనగరం కాలువలకు ప్రసిద్ధి ఐనా అన్ని ప్రదేశాలోనూ కాలువలనానుకుని రోడ్లు కూడా ఉన్నాయి. పడవలకంటే మోటారువాహనాలే ఎక్కువ. దారిపొడవునా ట్రాముల్లాంటి ఎలెక్ట్రిక్ ట్రైన్లు తిరుగుతున్నాయి. ఇవి అన్ని యూరప్ నగరాల్లోనూ ఉన్నాయి.
సెంట్రల్ స్టేషన్ ముందర దిగి అక్కడ బోటు ఎక్కి, ముఖ్యమైన ప్రదేశాలను చూస్తూ, గంటసేపు కాలువ విహారం చేశాము. కాలువ గట్టునున్న ఇళ్ల నిర్మాణ ఆకృతులు కొంత ప్రత్యేకంగా ఉన్నాయి. తరువాత మరో గంటసేపు బజార్లు, షాపులు చూసి బస్సుదగ్గరికి తిరిగొచ్చాము.
ప్యాకేజి టూర్ కావడంవల్ల అక్కడి ప్రసిద్ధ మ్యూజియమ్ లను, ఇతర ముఖ్యప్రదేశాలను చూడలేకపోయాము. మేము చూడలేకపోయిన వాటిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ‘రెంబ్రాంట్’, ‘వాన్ గో’ల మ్యూజియంలు కూడా ఉన్నాయి.
ఆ సాయంత్రం వోలెండమ్ అనే సబర్బన్ ప్రాంతానికి వెళ్లాము. అక్కడ ఒక గ్రామీణ చీజ్ కుటీరపరిశ్రమను, మరో చెక్కబూట్లు తయారుచేసే గృహపరిశ్రమను చూశాము. అక్కడి శీతల పరిస్తితులవల్ల వ్యయసాయదారులు పొలాల్లో పూర్వం చెక్కబూట్లు వాడేవారట. ఆ అలవాటు ఇప్పుడూ ఉన్నా, అదనంగా ఆ వారసత్వాన్ని కళాత్మకంగాకూడా మలిచి బూట్లబొమ్మలు ప్రచారంలోకి తెచ్చారు.
ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలు, విండ్ మిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కాలవల గట్టున విశ్రాంతిగా ఉండడం కోసం ఖరీదైన ఇళ్ల సముదాయాలున్నాయి. ఒక చివర సముద్రతీరాన్ని కొన్నిమైళ్లు వెనక్కిజరిపి ఒక సీవ్యూ కాలని కట్టారు.
ఏడోరోజు అల్పాహారం అక్కడే చేసి మధ్యాహ్నానికి జర్మనిలోని కొలోన్ (జర్మన్ భాషలో కోల్న్) చేరాము. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాల దాడులలో అతి తక్కువగా దెబ్బతిన్న నగరం కోల్న్ అంటారు.
ఊరిని సందర్శించాక అక్కడి 145 మీటర్ల ఎత్తున్న రెండుగోపురాల 15వ శతాబ్దపు కోల్న్ కెథడ్రల్ దగ్గర దిగి ఆ చారిత్రక కెథడ్రల్ ని చూశాము. అది గోతిక్ పద్ధతిలో కట్టబడ్డ విశాలమైన చర్చి. లోపలంతా తిరిగి చూశాము. ఒకవైపున ఎత్తైన గాజు తలుపులమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి.
ఆతరువాత అక్కడి బజార్లలో కొంత షాపింగ్ చేసి, భోజనానంతరం ఫ్రాంక్ ఫర్ట్ కి బయలుదేరాము.
ఐతే నేరుగా వెళ్లకుండా ఫ్రాంక్ ఫర్ట్ కి వెళ్లేదారిలో ఒకచోట రైన్ నదిని చేరుకుని అక్కడ అందరం పెద్ద డీలక్స్ లాంచిని ఎక్కి దాంట్లో నది దిగువకు రెండుగంటలు ప్రయాణించాము. లాంచిలో చిన్న రెస్టారెంట్ కూడావుంది. నదికిరువైపులా పచ్చటి కొండలు వాటి మొదట్లో అక్కడక్కడా చిన్న ఊర్లు, కొన్నిచోట్ల ఎత్తులో క్యాజిళ్లు, నదిలో వచ్చీపోయే లాంచీలు చూస్తూ వెళ్లడం చాలా ఉల్లాసంగా అనిపించింది.
రెండుగంటల తరువాత ఒడ్డుకు చేరి తిరిగి బస్సెక్కి సాయంత్రానికి ఫ్రాంక్ ఫర్ట్ చేరాము. నగరమంతా తిరిగి చూశాక రోమన్ స్క్యేర్ దగ్గర బస్సుదిగి అక్కడి పురాతన భవనాలను, మైన్ నదిని చూశాము. ఆరాత్రి ఫ్రాంక్ ఫర్ట్ లో బస. ఫ్రాంక్ ఫర్ట్ నగరం రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాల బాంబింగ్ లో దాదాపు 90 శాతం నాశనమైందంటారు. కానీ ఈరోజు అక్కడి పునర్నిర్మాణము, కొత్తగా కట్టిన ఆకాశహర్మ్యాలను చూస్తే గత డెబ్భైసంవత్సరాలలో వాళ్లు ఎంత కష్టపడి అభివృద్ధి చేసుకున్నారో తెలుస్తుంది. ఇప్పుడది జర్మనికి ఆధునిక ఆర్థిక రాజధాని.
ఎనిమిదోరోజు ఫ్రాంక్ ఫర్ట్ లో బయలుదేరి స్విట్జర్ ల్యాండ్ వైపుగా మాబస్సు ఆల్ప్స్ పర్వతాలనెక్కి మధ్యాహ్నానికి బ్లాక్ ఫారెస్ట్ లోని టిట్సీ అనే వేసవి విడిదిలాంటి ఒక చిన్నవూరికి చేరాము. అక్కడకూడా ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో భోజనంచేసి ఊరుచుట్టూ ఉన్న చిక్కటి అడవిని, ఒకవైపున్న అందమైన సరస్సును చూశాము.
ఆ ఊరు మన సాలార్జంగ్ మ్యూజియంలోవున్న గడియారంలాంటి ‘కుకూ’ గడియారాలకు ప్రసిద్ధి. అవి అక్కడే తయారుచేస్తారు. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ ‘కుకూ’ గడియారాలుకూడా చేస్తున్నారు. ఆ షాపులన్నీ చూశాము. ఒకషాపులో అవెలా తయారుచేస్తారో వివరించి, వాటిలోని రకాలని చూపించారు. మా సహచరులు కొంతమంది చిన్నసైజు ‘కుకూ’ గడియారాలు కొన్నారు.
ఆ తరువాత అక్కడ బయలుదేరి స్విట్జర్ ల్యాండ్ లోకి ప్రవేశించి సరిహద్దులో షాఫ్ హౌజెన్ లోవున్న ‘రైన్’ జలపాతం దగ్గరికొచ్చాము. కొండపైనున్న ఆవూరి పక్కనుండే రైన్ నది అక్కడ ఎత్తుమీదినుంచి జలపాతంగా పడుతూంది.
ఎత్తు కొద్దిగానేవున్నా కొండవాలుల్లో ప్రవహిస్తున్న నది కాబట్టి జలపాతపు ఉధృతి ఎక్కువగా ఉంది. తెల్లగా ఉధృతంగా జారుతున్న నీటి ప్రవాహం వెంటనే నదిగా మారి ముందుకు వెళ్తోంది. అందరం మోటారుబోటులో వెళ్లి జలపాతాన్ని దగ్గరగా చూసి, తుంపర్లలో తడిసి ఆనందించి వచ్చాము. చిత్రంగా ఆకొండల్లో కూడా ఉన్న ఇండియన్ కియాస్క్ లో అల్లంటీ తాగి ఆ చల్లని వాతావరణంలో ఉత్తేజం పొందాము. అక్కడినుంచి బయలుదేరి రాత్రికి స్విట్జర్ ల్యాండ్ లోని జూరిక్ నగరం చేరి అక్కడ బస చేశాము.

(తరువాయి ఐదవభాగంలో)

మూడో భాగం ఇక్కడ చదవండి

 

https://trendingtelugunews.com/english/features/monalisa-painting-in-paris-draws-huge-crowds-as-in-tirumala/