స్కూటర్ మీద ఆంధ్రా మంత్రులు, మరి హెల్మెట్ ఎక్కడ? (వీడియో)

కృష్ణాజిల్లా మచిలీపట్నం లో పర్యటిస్తున్నఇద్దరు ఆంధ్రప్రదేశ్ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకట రామయ్య ( నాని ) లు సరదా పడి స్కూటరెక్కి ప్రయాణించారు.
ఐ ఈ టి ఐ కాలేజీ లో స్కాలర్ షిప్ లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటున్నారు.
అక్కడికి స్కూటర్ లో చేరుకుని తామెంత సాదాసీదామనుషులమో చెప్పాలనుకున్నారు. ఆదర్శం బాగుంది. అది  సీరియస్ గా,చట్టాన్ని గౌరవించేలా ఉండాలిగా.
దేశమంతా హెల్మెట్ ధరించాలనే ఉద్యమం సాగుతున్నపుడు ఇద్దరు మంత్రులు ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద  వెళ్లవచ్చా.

హెల్మెట్ లేకుండా ప్రయాణించినందునే చాలా మంది ప్రమాదాలలో చనిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల హెల్మెట్ తప్పనిసరి చేశారు.
2018లో దేశంలో 43,600 మంది టూవీలర్ రైడర్స్ హెల్మెట్ ధరించనందున చనిపోయారని  లెక్కలు  చెబుతున్నాయి. ఇది గత ఏడాది జరిగిన మరణాలు (35,975) కంటే 21 శాతం ఎక్కువ.
హెల్మెట్ లేని టూవీలర్ రైడింగ్ ను నివారించేందుకు పెద్ద మొత్తాల్లో ఫైన్ వేస్తున్నారు. అలాంపుడు ఇద్దరు బాధ్యతాయుతమయిన మంత్రులు హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి ఏం సందేశమీయాలనుకుంటున్నారు?
నాని  ఇంటినుంచి వారు స్కూటర్లో కాలేజీకి వచ్చారు. స్కూటర్ నడిపింది వెల్లంపల్లి,వెనక కూర్చున్నది నాని.
కనీసంపోలీసులయిన సలహా ఇవ్వాలిగా… ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలా?