ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, దీని సామాజిక కోణం చూడాలి

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు, ఇంగ్లీష్ మీడియాల మధ్య మొదలైన చర్చ రెండు శాస్త్రాల మధ్య చర్చగా అర్థం చేసుకోవాలి.
విద్యా బోధనా శాస్త్రం(pedagogy), సామాజిక శాస్త్రం(sociology) మధ్య ఏర్పడ్డ వైరుధ్యంగా మనం దీన్ని అర్థం చేసుకోవడం అవసరం.
ఈ రెండు శాస్త్రాలూ తమదైన భిన్న కోణాలనుండీ ఈ విషయాన్ని విశ్లేషిస్తాయి.
ఈ వాదంలో సిన్సియర్ గా పాల్గొంటున్న మితృలందరూ (హిప్పోక్రాట్స్ కాదు) ఆరోపణలూ ,ఆవేశాలూ వదిలి ఈ రెండు శాస్త్రీయ దృక్కోణాలు విద్య గురించి ఏమి చెబుతున్నాయి , భారత దేశ విచిత్ర ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఎలా అన్వయించుకోవచ్చు అనే అంశాలను ప్రజాస్వామికంగా చర్చించి సమ్మతిని సాధించవలసి ఉంది. రెటరిక్ వల్ల తేలే విషయం కాదిది.
లక్షలాది చిన్నారుల వ్యక్తిత్వ వికాసమూ , జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సంక్లిష్ట విషయమిది.
బోధనాశాస్త్రం(pedagogy), మాతృభాషలో
విద్యాబోధన జరగడం పిల్లల వ్యక్తిత్వ వికాసానికీ , జ్ఞాన సముపార్జనకూ ఎంత కీలకమో శాస్త్రీయంగా నిరూపించింది.
లెక్కలేనన్ని అధ్యయనాలూ , ప్రయోగాలు, ఉదాహరణలూ ఈ విషయంపై ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి.
(అయితే ఈ పరిశోధనలన్నీ కామన్ స్కూల్ వ్యవస్థ కఠినంగా అమలయ్యే పాశ్చాత్య దేశాల్లో జరిగాయనే మాట మరువ రాదు.)
ఇక సామాజిక శాస్త్ర కోణంలో చూసినట్లైతే ,
మనదేశంలో గత మూడు దశాబ్దాలుగా విద్యా ప్రైవేటీకరణ పెద్ద యెత్తున సాగుతోంది. కామన్ స్కూల్ ,కామన్ సిలబస్ అనేవి లేవు.
స్థూలంగా , వారివారి సామాజిక – ఆర్థిక స్థితి గతుల ప్రకారం విద్యార్థులు వివిధ స్కూల్స్ లో ,వివిధ సిలబస్ లు చదువుతున్నారు.
ప్రభుత్వ రంగంలోనే రాష్ట్ర ప్రభుత్వ /జిల్లాపరిషత్ పాఠశాలలు , గురుకుల , కస్తూర్బా , నవోదయ , సైనిక్ , కేంద్రీయ పాఠశాలలు భిన్న పద్ధతులూ ,సిలబస్ లూ ,భిన్న పరిస్థితుల తో సాగుతున్నాయి. ఇక ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. సందు చివరి కాన్వెంట్ నుండీ AC గదుల ‘ అంతర్జాతీయ ‘ పాఠశాలల వరకూ కొన్ని పదుల రకాల ,స్థాయిల పాఠశాలలు ఉన్నాయి.
రాష్ట్ర బోర్డు,CBSE, CISCE, IB, IGCSE ఇలా.. లెక్కలేనన్ని సిలబస్ లు ఉన్నాయి. దాదాపు అన్ని ప్రైవేట్ పాఠశాలు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన సాగిస్తున్నాయి.
గ్రామీణ ,పట్టణ నిరుపేదల పిల్లలు మాత్రమే తెలుగు మీడియం లో చదువుతున్నారు.
మిగిలిన అన్ని వర్గాల వారూ తమ పిల్లలను ఏదో ఒక ప్రైవేట్ పాఠశాలకే పంపుతున్నారు. ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు.
So…. ఇప్పుడు ఏ చర్చ జరిగినా పై రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవలసిందే.
1).కనీసం పదవ తరగతి వరకూ (ప్రైవేట్ ,ఇంటర్నేషనల్, కేంద్రీయ ,నవోదయ తో సహా) అన్నిరకాల పాఠశాలల్లో ‘తెలుగు మాధ్యమంలోనే విద్యా బోధన కంపల్సరీ’ అనే పరిస్థితి లేనప్పుడు , కేవలం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం
తెలుగు మీడియంలో బోధన జరగాలని కోరడం అనైతికమే కాదు అన్యాయం కూడా కాదా? గ్రామీణ/పట్టణ నిరుపేద విద్యార్థులు
మాత్రమే ఎందుకు నష్టపోవాలనే ప్రశ్న న్యాయమైనది కాదా?
2). వ్యక్తిత్వ వికాసంతో కానీ ,కాన్సెప్చువల్ అవగాహనతో కానీ సంబంధం లేని కేవలం ‘ బట్టీ కొట్టడమే చదువు అనే ‘ విద్యా విధానంలో, చదువులు కేవలం ఉపాధి కొరకే అనే ఫిలాసఫీ ఉన్న విద్యావిధానంలో, ఏ మీడియంలో బోధించినా అభ్యసనంలో
పెద్ద తేడా ఏమీ లేనప్పుడు ఇంగ్లీష్ భాషా మాధ్యమం వల్లనే పేద పిల్లల జీవనోపాధి అవకాశాలు మెరుగవుతాయనే వాదన సమంజసమే కాదా?
3). ఇంట్లో విద్యా వాతావరణమే లేని ,కేవలం పాఠశాల మాత్రమే ఆధునిక జ్ఞానార్జనకు ఏకైక దిక్కుగా ఉన్న నిరుపేద పిల్లలకు( వీరంతా దాదాపు ఆదివాసి/దళిత/బహుజన/మైనారిటీ కుటుంబాలకు చెందిన వారే అయివుండడం గమనార్హం) ఒకేసారి ప్రాథమిక స్థాయి నుండీ ఇంగ్లీషు మీడియం లోనే విద్యాబోధన జరిగితే ,వారి వ్యక్తిత్వ వికాసానికి ,భాషా వ్యక్తీకరణ సామర్థ్యాలకూ తీవ్ర ఆటంకాలూ ,పరిమితులూ ఏర్పడవా?
ఈ మూడు ప్రశ్నలకూ అందరమూ ఓపికగగా జవాబు వెతక వలసి ఉంది.
ఈ అన్ని విషయాలనూ పరిశీలించిన తరువాత నా అభిప్రాయం ఇలా ఉంది.
1). ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రి -ప్రైమరీ తరగతులు ఉండాలి.
2). ఒకటవ తరగతి నుండే ఇంగ్లిష్ ను ఒక సబ్జెక్టుగా పరిచయం చేయాలి.
3). అన్ని పాఠశాలల్లో పదవ తరగతి వరకూ తెలుగు మీడియంలో బోధిస్తూనే ,ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేర్పాలి. (ఈ నిబంధన కీలకం. ప్రైవేట్ పాఠశాలలను ఈ విషయంలో కఠినంగా నియంత్రించాలి.)
4). కేవలం పాస్ అవాల్సిన ఒక సబ్జెక్టుగానే కాక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాబ్స్ ప్రతి పాఠశాలలో ఏర్పరచాలి.
5). ప్రస్తుతం ఉన్న నాసిరకం బోధనా పద్ధతులను ప్రక్షాళనం చేయాలి.
6). ఉపాధ్యాయులను బోధనేతర కర్తవ్యాలనుండీ పూర్తిగా విముక్తి చేయాలి.
(నిజానికి కామన్ స్కూల్ ,కామన్ సిలబస్ అనే ఆశయాలు ఎన్నటికీ వదులుకోరాదు. వాటికోసం పోరాడుతూనే ఉండాలి)
 – కె.వేణుగోపాల్, టిపిటిఎఫ్, ఛీప్ ఎడిటర్, ఉపాధ్యాయ దర్శిని , ఫోన్ నెం.9866514577

(ఈ వ్యాసాన్ని గూగుల్ తెలుగు మాట నుంచి తీసుకోవడం జరిగింది)