కరీంనగర్ లో తన మీద పోలీసుల దాడి చేసిన విషయాన్ని కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.
ఈ రోజు పార్లమెంటులో స్పీకర్ ను కలుసుకుని ఈ దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్పీకర్ కు అందచేశారు.
సమ్మెకాలంలో గండె పోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమ యాత్ర సాగుతున్నపుడు తెలంగాణ పోలీసులు ఎలా దౌర్జన్యంగా దాడులు జరిపారో విరించారు. ఈ ఘటన వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ దాడి మీద ప్రివిలేజ్ మోషన్ సంజయ్ ప్రతిపాదించారు.
ఫిర్యాదుపై వెంటనే సస్పందిస్తూ ఈ సంఘటన మీద విచారణ చేపట్టాలని,విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ కు ఆదేశించారు.
దాడి చేసిన పోలీస్ అధికారులపై నివేదిక వచ్చాక కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు.
బండి సంజయ్ తో పాటు స్పీకర్ ను కసిసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా ఆయన స్పీకర్ కు వివరించారు.
అసలేం జరిగింది
అక్టోబర్ 30 న హైదరాబాద్‌లో జరిగిన సకల జన సమరభేరి సభకు హాజరైన డ్రైవర్ నంగునూర్ బాబు గుండెపోటుతో మృతి చెందాడు బాబు అంతిమయాత్ర శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించారు ఈ సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని ప్రజాశక్తి రాసింది. బాబు పనిచేసిన కరీంనగర్ డిపో వద్ద మృతదేహాన్ని కొద్దిసేపు ఉంచాలన్న కుటుంబ సభ్యులు కోరారు.
అయితే, పోలీసులు దీనిని తిరస్కరించి, అంతియయాత్రలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. మరోవైపు నేతలను, సహచర కార్మికులను అక్కడకు రానీవకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల కన్నుసన్నల్లో బాబు భౌతిక కాయానికి కుటుంబసభ్యులు అంతిమసంస్కారాలు నిర్వహించారు.
బాబు మరణించిన వెంటనే ఆర్‌టిసి జెఎసి నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభిస్తేనే అంతిమ సంస్కారాలు జరుపుతామని ఆయన కుటుంబీ కులు ప్రకటించారు. రెండు రోజుల నుండి మృత దేహాన్ని అలాగే ఉంచేశారు. అయితే, సర్కారు వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో పాటు కుటుంబసభ్యులపై పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు.
దీంతో బాబు పనిచేసిన ఆర్‌టిసి డిపో వద్దకు మృత దేహాన్ని తీసుకుపోవాలని, ఆ తరువాత అక్కడి నుండి శ్మశనానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేస్తామని కుటుంబసభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాబు మృతికి సంతాపంగా కరీంనగర్ బంద్‌కు అఖిలపక్షం పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు బండి సంజయ్ మీద దాడి చేశారని విమర్శ. దీనికి వ్యతిరేకంగా రాత్రి బిజెపి నేతలు కమిషనరేట్ ఆఫీస్ దగ్గిర ధర్నా కూడ చేశారు. తాము దాడి చేయలేదని, గుంపులో చిక్కుకున్న ఎంపిని బయటకు లాగామని, దీనినే దాడిగా చిత్రీకరిస్తున్నారనిపోలీసులు తర్వాత వివరణ ఇచ్చారు.