ప్రముఖ రంగస్థల నటుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మృతి

(టి లక్ష్మినారాయణ)
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగునాట రంగస్థల కళాకారులలో ప్రముఖుడు, జానపద కళాకారుల్లో అగ్రగణ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నిర్మాణంలో ముఖ్యభూమిక పోషించిన ఉద్యమ నేత, ఆంధ్ర నాటక కళా సమితి వ్యవస్థాపకులు, ప్రజల హృదయాలలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకొన్న ప్రజా కళాకారుడు, నా శ్రేయోభిలాషి శ్రీ కర్నాటి లక్ష్మీనరసయ్య(95) మరణం దిగ్భ్రాంతి కలిగించింది.
ఆయన ఈ ఉదయం 5 -6 గంటల మధ్య విజయవాడలో చనిపోయారు.
వారం రోజుల క్రితమే విజయవాడలో కర్నాటి లక్ష్మీనరసయ్య గారి ఇంటికెళ్ళి కలిశాను. ఆయన శ్రీమతి అనారోగ్యంతో ఉండడం పట్ల తీవ్ర మనోవేధకు గురైనట్లు ఆయన మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించాను.
 లక్ష్మీనరసయ్య  మరణంతో కమ్యూనిస్టు నైతిక విలువలకు కట్టిబడి జీవించిన పాతతరం కనుమరుగైపోతున్న వెలితి కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.
ఎప్పుడు కలిసినా కమ్యూనిస్టు ఉద్యమం భవిష్యత్తుపై ఆరాటం, పతనమవుతున్న నైతిక విలువల పట్ల ఆవేదన వ్యక్తం చేసే వారు.
సమాజాన్ని చైతన్య పరచడంలో ప్రజానాట్య మండలి పోషించిన ఘనమైన పాత్ర, సాంస్కృతిక ఉద్యమం ఆవశ్యకతపై ముచ్చటించే వారు.
 కర్నాటి లక్ష్మీనరసయ్య  మరణం ప్రగతిశీల ఉద్యమానికి, ప్రత్యేకించి తెలుగు సాంస్కృతిక రంగానికి తీరని లోటు. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నా.
సిపిఐ, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు కా.డి.రాజా, నేను 2018 జూన్ 20 న గౌరవనీయులు కర్నాటి లక్ష్మీనరసయ్య తో  కలిసినపుడు  తీసిన ఫోటో దిగువన ఉంది.
జీవిత విశేషాలు (వికిపీడియా నుంచి)
ప్రజానాట్యమండలి నటుడు. కర్నాటి లక్ష్మీనరసయ్య కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, తునికిపాడు గ్రామంలో 1927, అక్టోబర్ 5 వ తేదీన జన్మించారు.
వ్యవసాయ కుటుంబం. రాజమ్మ, వెంకయ్యలు తల్లిదండ్రులు. బాల్యం మధిర తాలూకా దెందులూరులో గడచింది. ఉన్నత విద్యాభ్యాసం ఖమ్మం హైస్కూలులో ఉర్దూ మీడియంలో. చదువు మధ్యలో ఆగిపోయింది. పద్మశ్రీ నాజరు బుర్రకథ దళంలో చేరారు. నాజర్‌ బృందంలో హాస్యాన్ని, రాజకీయాన్ని కూడా ప్రజలు మెచ్చేలా నిర్వహించారు.
ముందడుగు నాటకంలో డాక్టరు గరికపాటి రాజారావు కథానాయకుడి పాత్రకు లక్ష్మీనరసయ్యను ఎంపికచేశారు. తరువాత లక్ష్మీనరసయ్య, కోడూరు అచ్చయ్య, పెరుమాళ్లు వంటి వారి శిక్షణలో రాటుదేలారు. నటుడిగానే కాక, ప్రయోక్తగా, దర్శకునిగా ఎదిగారు. మిక్కిలినేని, రక్తకన్నీరు నాగభూషణం, రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప్‌, కె.వి.ఎస్‌.శర్మ వంటి రంగస్థల, సినిమా నిపుణుల ఆధ్వర్యంలో అనేక ప్రదర్శనలు, పోటీలలో పాల్గొన్నారు.
చెక్కభజన లు, కోలాటాలు, సుద్దులు, చిత్ర విచిత్ర వేషాలు వంటివి నేర్చుకొని విరివిగా ప్రదర్శించారు. అల్లీముఠా నాటకాన్ని ప్రపంచ తెలుగు మహాసభలో ప్రదర్శించారు. అంతా పెద్దలే అనే రెంటాల నాటకాన్ని తన దర్శకత్వంలో రూపొందించి రాష్ట్రంలో అన్ని ముఖ్యపట్టణాల్లోనూ ప్రదర్శించారు.
పుట్టిల్లు, అగ్గిరాముడు, భలేబావ, లవ్ మ్యారేజ్, నీడ, పూలపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, ఇదికాదు ముగింపు, ఈ చదువులు మాకొద్దు వంటి సినిమాల్లో లక్ష్మీనరసయ్య నటించారు.
విజయవాడలో జానపద కళాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ సంస్థ అధ్యక్షులుగా ఉంటూ నూట ఇరవైమంది కళాకారులను తీర్చిదిద్దారు.విజయవాడ పురప్రముఖులు (1983)లో ప్రజానటుడు బిరుదంతో సత్కరించారు. 1987లో షష్టిపూర్తి మహోత్సవం జరిగింది. డాక్టర్‌ నందమూరి తారక రామారావు 1988 ఏప్రిల్‌ పదిహేనో తేదీన కర్నాటి లక్ష్మీనరసయ్యను సత్కరించారు. 2008లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డును స్వీకరించారు.

(వికిపీడియా నుంచి తీసుకున్నది)