కేంద్ర హోం మంత్రి షా ప్రవచించిన ‘ఒకే దేశం, ఒకే భాష’ అనేది శుష్క నినాదం.
మనది అనేక రాష్ట్రాలు భాషలు కలిసి బ్రతుకుతున్న దేశం.ఒక దేశంగా ఉంటాం గానీ అందరూ ఒకేభాష మాట్లాడాలి అని శాసిస్తే ఎదురు తిరుగుతాం.
హిందీ భాషను దేశమంతా నేర్చుకోవాలనే ప్రకటనను అన్నీ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
మతం కన్నా భాషనే ప్రజల్ని ఐక్యం చేస్తుంది. భాష విషయంలో రాష్ట్రాలకే అధికారం ఉండాలి. రాష్ట్రాలు కూడా ఆంగ్లం మోజులో పడి స్థానిక భాషల్ని పట్టించుకోకపోతే, రాష్ట్రాల స్థాయిలో కూడా భాషా సమస్యలు తలెత్తి, ఉద్యమ రూపం దాల్చవచ్చు.
భాష ఓ సాంస్కృతిక వారధి.భాషను ధ్వంసం చేస్తే ఆ జాతి అంతమై వచ్చే కొత్త తరం పరాయీకరణకు గురవుతుంది.
వలస పాలకుల కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కింద దాదాపు 125 పాఠశాలల్లో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టారు.పెరియార్ నాయకత్వంలో తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని రద్దు చేసుకున్నారు.
1960లో డిఎంకె పార్టీ, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నడిపి అధికారాన్ని చేపట్టింది. . కొఠారి,కస్తూరి రంగన్ ప్రస్తావించిన త్రిభాషా సూత్రాన్ని ముందుగా నిరసించింది తమిళనాడే!
జాతీయ రహదారుల వెంట మైలురాళ్ళ మీద హిందీలో రాసిన ఊళ్ళ పేర్లను తుడిపేయటం తమిళనాడు వెళ్ళినవాళ్ళు చూసేవుంటారు.
వాళ్ళు Longlive Classical Divine Tamil అని బోర్డులు పెడతారు.
ప్రాచీన దేవభాష తమిళం కలకాలం వర్ధిల్లాలి అని కోరుకుంటారు.అందుకే తమిళం జోలికి వెళితే అసలు ఊరుకోరు.
ఆభాషను కాపాడుకోటానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటారు.తమిళ ఉద్యమం జల్లికట్టు ఉద్యమం కంటే పదిరెట్లు ఉంటుందని కమల్ హాసన్ హెచ్చరించారు కూడా.
ప్రజలు మాట్లాడే భాష వివక్షతకు గురైతే దేశాలే విడిపోతాయని బంగ్లాదేశ్ ఏర్పాటు తెలిపింది. భారతదేశ విభజన వలన ఏర్పడిన తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లలో కూడా ఉర్దూనే అధికార భాషగా ఉంటుందని 1948లో ఇస్లామాబాద్ ప్రకటించింది. 1952లో చెలరేగిన భాషాపరమైన అల్లర్లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 21, 1952న కాల్పులు జరిపించింది. ఢాకా హైకోర్టు ముందే బంగ్లా విద్యార్థులు, పౌరులు మరణించారు. చివరికి ప్రభుత్వం 1956లో బంగ్లాను జాతీయ భాషగా గుర్తించింది. 1971లో మొత్తంగా తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాక్ నుంచి విముక్తి పొంది భాష పేరుతో బంగ్లాదేశ్గా ఏర్పడింది ! భాష రక్షణ కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా యునెస్కో 1999 ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా గుర్తించింది.
మధురై హైకోర్టు న్యాయమూర్తి రమేశ్ గారు న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన సెంథిల్ కుమార్ అనే విద్యార్ధిని అభినందించారు.
అక్కడ సివిల్ జడ్జి పోస్టుల వరకు కూడా తమిళ మాధ్యమంలో చదివి తమిళ మాధ్యమం లోనే పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేశారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా రిట్ పిటీషన్ నంబర్లు 695 and 7403 of 2011 Dt.3.2.2012 , 23.2.2016 న,మళ్ళీ 28.9.2019 న ఈ చట్టాన్ని సమర్ధించింది.
తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.
రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
ఈ తీర్పుల్ని ఉదహరిస్తూ మన రాష్ట్రంలో కూడా తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 1985 వరకు ఇచ్చిన 5% ప్రోత్సాహక మార్కులను ఆ తరువాత వివిధ సందర్భాలలో ఇస్తామని ప్రకటించిన 20% రిజర్వేషన్లను ఇప్పించవలసిందిగా హైకోర్టును కోరాలి.
ఈ మధ్య జరిగిన గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయాల అధికారుల ఎంపిక పరీక్షలలోనైనా తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు 5% ప్రోత్సాహక మార్కులు ,20% శాతం రిజర్వేషన్ ఇస్తే తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లవుతుంది.పైగా ఇవి గ్రామస్థాయి ఉద్యోగాలే కాబట్టి తెలుగులో ఆలోచించి రాయటం ఖచ్చితంగా రావాలి.
ప్రజాజీవితంలో తమిళం అవసరమైన అన్నీ ఉద్యోగాలనూ తమిళం చదివిన అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసేలా తమిళ పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలుగునాట రెండు రాష్ట్రాలలో తమిళనాడు తరహా పనులు జరగాలి.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాధమిక విద్యను ఇంగ్లీషు కాన్వెంట్లలోకి ప్రభుత్వాలు మార్చాయి.
తెలుగుమాధ్యమ కళాశాలలను, తెలుగు మాధ్యమ పట్టభద్రులను వెతికి పట్టుకోవలసి వస్తుంది.ప్రభుత్వ అధినేతలే తెలుగుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు అదే సరైన బాట అనుకొని సాగిపోతారు.
విచిత్రంగా ఆంధ్ర,తెలంగాణాలలో తెలుగుభాషకు ప్రభుత్వం ఏమిచేస్తుందో పాలకులు చెప్పటంలేదు. తెలుగుకోసం న్యాయస్థానాలకు వెళ్ళి ఓడిపోయిన వాళ్ళ పక్షాన అప్పీలు కూడాచేయటం లేదు.ఇచ్చిన జీవోలు అమలు కాకపోయినా పట్టించుకోవటం లేదు.
ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో లేకుండా నిర్మూలించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే తెలుగును పాలనాభాష కాకుండా మొదటి దెబ్బ కొట్టాయి. ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యటం అసాధ్యమే.పునాది లేకుండా భవనాన్ని కట్టలేము.
తెలుగుపత్రికా యజమానులు కొందరైనా ముందుకు రావాలి.
కొన్నేళ్ళు పోతే తెలుగు పత్రికలు చదివేవాళ్ళు లేక మూతపడవచ్చు.
భాష రక్షణ కేవలం భాషాభిమానుల వల్ల కాకపోవచ్చు.తెలుగు ప్రాధికార సంస్థ కోసం ఇచ్చిన జీవోను అమలు చెయ్యమని అడగాలి.ఒక్కొక్క డిమాండును అమలు చెయ్యమని విడివిడిగా ధరఖాస్తులతో ప్రభుత్వాన్ని కోరాలి.
తెలుగు పత్రికాధిపతులు , విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖాధిపతులు,తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు ముందుకు రండి.మనం కోరుతున్న కోర్కెలు ఇవే: ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.
తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి.
తమిళనాడులో లాగా మనమూ కోర్టుకు వెళదామా? సుముఖంగాఉన్నవారు నాకు మద్దతు ఇవ్వండి.
—నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266
(ఈ పోస్టుని తెలుగ మాట గూగుల్ గ్రూప్స్ నుంచి తీసుకున్నది)