కరీంనగర్ పక్కనే ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)ని ఒక మాంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.
డ్యాం దిగువ భాగంలో రూ. 551 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం కేసీఆర్ ఇంతకు ముందే అనుమతించారు.
దీనికి నిధులు కూడా కేటాయించారు .
ఇపుడు డ్యాం మధ్యలో నాలుగు ఎకరాల్లో ఉన్న మైసమ్మగుట్టని రూ.20 కోట్లతో విజయవాడ భవానీ ద్వీపంలాగా ‘కేసీఆర్ ఐలాండ్’ అనే పేరు తో టూరిస్ట్ స్పాట్ చేస్తున్నారు.
అత్యాధునిక హంగులతో టూరిస్టులను ఆకట్టుకునేలా పలు రకాల నిర్మాణాలు చేపట్టేందుకు పర్యాటకశాఖ నిర్ణయించింది.
ఇందుకు గాను మొదటి దశలో రూ.5 కోట్లు కేటాయించారు.
కేసీఆర్ ఐలాండ్‌ను ప్రపంచస్థాయి వసతులతో తీర్చిదిద్దుతారు.
ఇక్కడ చేపట్టే ప్రతి నిర్మాణాన్ని వరల్డ్ క్లాస్ స్థాయిలో తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా అకట్టుకునేలా ఇన్ఫినెట్యూడ్ డిజైన్ కంపెనీ డిజైన్లు తయారు చేసిన ప్రభుత్వానికి అందజేసింది.
కేసీఆర్ ఐలాండ్ ఏముంటాయంటే…
– అందమయిన విశాలమైనా ఎంట్రెన్స్ లాబీ.
-పూర్తిగా అద్దాలతో బాంక్వె ట్ హాల్, మెడిటేషన్ హబ్,
డబుల్‌కాట్ బెడ్స్‌తోపాటు ఆధునిక వసతులతో ఐదు ప్రీమియం స్విట్స్.
-ఇండోనేషియా ఆర్కిటెక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు.
-40 మందికి సరిపోయే ఫ్లోటింగ్ రెస్టారెంట్.
-క్యాండిల్‌లైట్ డిన్నర్, కాక్‌టెల్ పార్టీల కోసం నలుమూలలా ఫ్లోటింగ్ బ్రిడ్జిలు.
-సెవెన్‌స్టార్ హోటల్‌కు మించిన సదుపాయాలతో వీవీఐపీల కోసం గుట్టపై భాగంలో ప్రెసిడెన్షియల్ స్వి ట్.
-పిల్లలు, పెద్దలకు వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్. రెండు ఎలివెటేడ్ బ్రిడ్జిలు.
-పర్యాటకులు వివిధ సూట్స్‌కు వెళ్లడానికి కావాల్సిన లిఫ్టులు.
ఇది పూర్తయితే దేశ, విదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తారరని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఆయన కరీంనగర్ ఎమ్మెల్యే కూడా . ‘యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్ల నుంచి రూ.3 కోట్లు కేటాయించాం. మరో రూ.2 కోట్లను పర్యాటకశాఖ కేటాయించింది. దశలవారీగా జరిగే నిర్మాణాలకు ముందుముందు కావాల్సిన నిధులను కేటాయిస్తాం. కేసీఆర్ ఐలాండ్ కరీంనగర్‌కే కాదు యావత్ తెలంగాణకు ఒక మణిహారంలా నిలువనున్నది,’ అని ఆయన నిన్న ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు చెప్పారు.