నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ జారీ చేసిన నవంబర్ 5 డెడ్ లైన్ అల్లిమేటమ్ పనిచేస్తుందనే విశ్వాసం అధికారుల్లో కలుగుతూ ఉంది.
ఆదివారంనాడు కొంతమంది ఆర్టీసి కార్మికులు విధులకు హాజరయ్యేందుకు సముఖత చూపడంతో వారికి నిర్ణయానికి బాగా ప్రచారం ఇచ్చి ఇంకా ఎక్కువ మంది డ్యూటీల్లో చేరేలా చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
డ్యూటీల్లోచేరేందుకు ముందుకు వచ్చిన వారి చేత వారి మిత్రులకు కుటుంబ సభ్యులకు ఫోన్ లుచేయించి విధుల్లో చేరేందుకు బాటవేస్తున్నట్లు తెలిసింది.
అంతేకాదు, విధుల్లో చేరాలనుకునేవారి యూనియన్ల నుంచి ఎలాంటి సమస్యరాకుండా చూస్తామని కూడా చెబుతున్నారు.
విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా డ్యూటీ లో చేరవచ్చు
ఆర్టీసీ ఉద్యోగులపై యూనియన్ నాయకులు బెదిరింపులు, భౌతికదాడులు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా పోలీసులు సహకరిస్తారని ఆయన చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే నిర్భయంగా చేరవచ్చునని చెబుతూ విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, భౌతిక దాడుల కు పాల్పడినా, వారికి ఏ విధమైన నష్టం కలుగజేసినా వారిపై చట్టప్రకారం సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హమీ ఇచ్చారు.
ఉద్యోగంలో తిరిగి చేరాలనుకునే వారిని ఎవరైనా ఉద్దేదపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అని ఆయన చెప్పారు.
బెదిరింపులు ఎదురయినపుడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని సంబంధిత పోలీస్ అధికారులకు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు.
డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ 9490617444 నంబర్లలో సంప్రదించవచ్చని కూడా సజ్జనార్ ప్రకటించారు.