ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన గురించి ఇంతవవరకు ఎవరికీ తెలియని నిజం బయటపెట్టి సంచలనం సృష్టించారు.
తాను రాజకీయ నాయకుడిని కాదని, సాంస్కృతిక మానవుడినని చెబుతూ తానింతవరకు 70,000 నుంచి 80,000 పుస్తకాలను చదివానని చెప్పారు.
2015 మే నాలుగో తేదీన ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో,ఎంపిలతో, ఎమ్మెల్సీలతో సమావేశమయినపుడు ఈ విషయం బయటపెట్టారు.
‘ మీకు తెలుసోలేదో, రాజకీయాలు నా మొదటి చాయస్ కాదు. ఏదో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిపడ్డా. సంస్కృతి నా మొదటి లక్ష్యం. నేను ఆరోజుల్లో విపరీతంగా పుస్తకాలు చదివే వాడిని. అంతా ఏమనేవాళ్లంటే, ‘అరే వాడికొక పుస్తకం పడేయండిరా వాడు హ్యాసీ అవుతాడు’ అని. దాదాపు నేను 70 వేలనుంచి 80 వేల పుస్తకాల దాకా చదివాను, ’ అని చప్పట్ల మధ్య ప్రకటించారు.
కొసమెరపుగా మరొక విషయం చెప్పారు. ‘నేనెపుడు ప్రయాణంలో ఉంటే నా బట్టల సూట్ కేసుకంటే పుస్తకాల సూట్ కేసేపెద్దదిగా ఉండేది,’ అని ఆయన చెప్పి అంతా అవాక్కయ్యేలా చేశారు.
దీనితో అంత ఇదెలా సాధ్యమో లెక్కకట్టడం మొదలుపెట్టారు. ఇదెలా సాధ్యం. ఒక మనిషి రోజుకు ఎన్నిపుస్తకాలు చదవగలరు, స్నానం, కాలకృత్యాలు, బోజననం, టిఫిన్,నిద్ర పోనూ మిగిలే సమయంలో ఒక మనిషి గరిష్టం మూడు నాలుగుకంటే ఎక్కువ పుస్తకాలు చదవడం సాధ్యం కాదు. రాజకీయాల్లో ఉండేవాళ్లకి అసలు సమయమే దొరకదు.
ఎందుకంటే, అసెంబ్లీలో, పార్లమెంటులో కనీసం రెండు మూడు గంటలైనా కూర్చోవాలా. అయినా సరే రోజు నాలుగు పుస్తకాలేసుకున్నా, సంవత్సరానికి వేయి నుంచి 1200 పుస్తకాలు మించి చదవడం కష్టం. ఈ లెక్కన కెసిఆర్ ఫుట్టినప్పటినుంచి ఆయన ఈ విషయం వెల్లడించిన 2015 నాటిదాకా, చదివన పుస్తకాలు 50 నుంచి 60 వేలుండవు. మరి ఎనభైవేలు ఎలా అవుతాయి. కామెంట్స్ మీ ఇష్టం.
ఎపుడో నాలుగేండ్ల కిందట జరిగిన ఈ విషయాన్ని ఇపుడెందుకు గుర్తుచేయాల్సివచ్చిందంటే… పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధంకర్ కూడా ఇపుడిలాంటి విషయమే వెల్లడించారు.
గత శుక్రవారం నాడు కలకత్తాలో ఒక పబ్లిక్ పంక్షన్ మాట్లాడుతూ గవర్నర్ జగదీప్ దంకర్ తను పుస్తకాలు చదవడం గురించి గొప్పగా చెప్పారు.
తాను బెంగాల్ గవర్నర్ అయినప్పటినుంచి… అంటే మూడునెలల నుంచి ఇప్పటిదాకా రాష్ట్రాన్ని క్షణ్ణంగా అర్థం చేసుకునేందుకు వేయి పుస్తకాలు చదివానని సెలవిచ్చారు.
ఈవిషయాన్ని ఆనంద బజార్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఆనంద్ బజార్ అనేది చాలా ప్రతిష్టాత్మకమయిన పత్రిక. ది టెలిగ్రాప్ ఇంగ్లీష్ పత్రిక, ఎబిపి న్యూస్ ఈ గ్రూప్ వే. మూడు నెలల్లో వేయి పుస్తకాలు చదవాలంటే అంటే 90 రోజుల్లో వేయిపుస్తకాలంటే రోజు కు 11 పుస్తకాలు చదవాలి. పదకొండు పుస్తకాలు ఒక రోజు చదవాలంటే ప్రతిగంటకొక పుస్తకం చదవాలి.
అంటే నిద్రాహారాలు కూడా చేసేందుకు కూడా టైం ఉండదు. ఇదెలా సాధ్యం? గవర్నర్ కు రాజ్ భవన్ లో పనేలేదా, ఆయన సంతకాలు పెట్టడం, ఏదో ఫైలు చూడటం, అధికారులతో మాట్లాడటం, కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడటం చేయరా. ఆయన చెప్పి యవ్వారం చాలా సీరియస్ అని మీడియా వ్యాఖ్యానించింది.