ప్రపంచంలోని సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో హైదరాబాద్ నగరానికి స్థానం లభించింది. యునెస్కో క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 66 నగరాలను ఈ నెట్‌వర్క్‌లో చోటుచేసుకున్నాయి. వీటిలో భారతదేశం నుండి ముంబాయి నగరాన్ని సినిమా రంగం నుండి ఎంపికచేయగా హైదరాబాద్ నగరాన్ని ఆహారం, తినుబండారాల (Gastronomy) విభాగం నుండి ఎంపికచేశారు. భారతదేశం నుండి మొత్తం 18నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం పోటీపడగా వీటిలో కేవలం 8 నగరాలు మాత్రమే నియమిత సమయంలో నిర్థేశిత ప్రొఫర్మాల ద్వారా దరఖాస్తులను యునెస్కోకు పంపుకున్నారు. వీటిలో నాలుగు నగరాలు హైదరాబాద్, ముంబాయి, శ్రీనగర్, లక్నో లు మాత్రమే ఎంపికయ్యాయి. కాగా హైదరాబాద్ నగరం క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జిహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌లు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.