ఆదర్శ నేత గురుదాస్ దాస్ గుప్తా కు నివాళి

(డి సోమసుందర్)
1920 అక్టోబర్ 31 న ఏ.ఐ.టీ.యు.సి. నాటి బొంబాయి లో ఆవిర్భవించింది. ఈ అక్టోబర్ 31 వ తేదీనాటికి 99 యేళ్లు నిండి నూరవ ఏట అడుగుపెట్టింది. శతాబ్ది వేడుకల ప్రారంభ కార్యక్రమం ముంబాయి లో జరుగుతోంది. అదే రోజు ఉదయం 6 గంటలకు ఏ.ఐ.టీ.యు.సీ. సీనియర్ నేత, సి.పీ. ఐ. జాతీయ నాయకుడు, గొప్ప పార్లమెంటేరియన్, గురుదాస్ దాస్ గుప్తా కోల్ కటా లో కన్ను మూశారు.
శతాబ్ది వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమయిన కార్మిక వర్గం దిగ్భ్రాంతి చెందింది. అక్టోబర్ 31 న ఆయన మరణించడం యాదృచ్ఛికం అయినప్పటికీ ఒక చారిత్రక సంస్థకు ఉత్తమ పుత్రునిగా ఆయనను స్మరించు కునేందుకు ఈ తేదీ ఒక శాశ్వత అవకాశం ఇచ్చింది అని చెప్ప వచ్చు.
జీవిత విశేషాలు ఎలాగూ మీడియాలో వస్తాయి. ఆయన ప్రత్యేకతను తెలిపే ఒక ఉదంతాన్ని మాత్రం నేను గుర్తు చేస్తాను.
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల లో ఒక సంస్థ ఆదాయపు పన్ను ఎగ వేస్తున్నట్లు దాస్ గుప్తా దృష్టికి వచ్చింది. ఎంపీ గా తనకున్న అవకాశాన్ని వినియోగించుకుని ఆయన సదరు కంపెనీ నివేదికలను సంపాదించారు.
ఆ కంపెనీ తన షేర్ హోల్దర్లకు, కార్మిక శాఖకు, బ్యాంక్ లకు, వివిధ ప్రభుత్వ శాఖల కు ఇచ్చిన వేర్వేరు నివేదికలను లోతుగా పరిశీలించారు. కంపెనీ తన ఆదాయాలను ఒక్కొక్క నివేదికలో ఒకో రకంగా చూపించడాన్ని ఆయన గుర్తించారు.
కంపెనీ మూడు కోట్ల రూపాయల మేరకు ఆదాయపు పన్నును కంపెనీ ఎగ వేసినట్లు అవే నివేదికల ఆధారంగా ఆయన పట్టుకున్నారు. అదే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ కు ఫిర్యాదు చేశారు. వి
దాస్ గుప్తా ఫిర్యాదు నిజమేనని రుజువు అయ్యింది. శాఖ మూడుకోట్ల రూపాయల పన్ను ను కంపెనీ నుండి వసూలు చేసింది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు వసూలు అయిన సొమ్ములో పది శాతం మొత్తాన్ని సమాచారం ఇచ్చినందుకు దాస్ గుప్తా కు రివార్డ్ గా అంద చేసింది.
అది అక్షరాలా ముప్పై లక్షల రూపాయలు. కమ్యూనిస్ట్ ఎంపీ లు అందరి మాదిరిగానే ఎంపీ గా తనకు వచ్చిన జీతాన్ని, భత్యాలను, పార్టీకి ఇచ్చేసే దాస్ గుప్తా ఈ డబ్బును కూడా అలాగే విరాళం గా ఇచ్చేశారు.
కోల్ కతా లో పనిచేస్తున్న జోషి – అధికారి ట్రస్ట్ కు పది లక్షలు, పశ్చిమ బెంగాల్ సి.పీ.ఐ. శాఖకు ఐదు లక్షలు, కేంద్ర కమిటీ కి పది లక్షలు ఇచ్చారు. ఖ
ఉద్యమ కాలంలో టెర్రరిస్ట్ ల చేత హత్యకు గురయిన కమ్యూనిస్ట్ కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం పంజాబ్ ఇస్త్రిసభ నడిపిన ట్రస్టుకు ఐదు లక్షలు చందా గా ఇచ్చి దాస్ గుప్తా చేతులు దులుపుకున్నారు.
అత్యంత నిజాయితీగా, నిరాడంబర జీవితాన్ని కొన సాగించిన గురు దాస్ దాస్ గుప్తా వంటి గొప్ప ఆదర్శ నేతల ఆశయాల నుంచి మనం నేర్చకోవలసింది చాలా వుంది కదా. హర్షద్ మెహతా కుంభకోణం పై నియమిత మైన జే.పీ.సి. లో ఆయన సభ్యునిగా వున్నారు. కమిటీ మెజారిటీ నిర్ణయంతో దాస్ గుప్తా విభేదించారు. తన అభిప్రాయాలను “ఏ రిపోర్ట్ టు ద నేషన్” పేరుతో పుస్తకంగా రాశారు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించింది.
ఆ రోజుల్లో ఏదో వేరే సమస్య పై దాస్ గుప్తా రాష్ట్ర పతి డా.శంకర్ దయాళ్ శర్మ ను కలవాల్సి వచ్చింది. ఆ పుస్తకం గురించి అప్పటికే విని వున్న రాష్ట్రపతి తనకు ఒక కాపీ పంపాలని కోరారు. త
భుజాన వున్న గుడ్డ సంచి లో నించి దాస్ గుప్తా ఆ పుస్తకం కాపీ ని రాష్ట్ర పతి కి అంద చేశారు. తన పార్టీ పేదల పార్టీ అనీ, పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వలేనని, కాబట్టి దాని ఖరీదు ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి ని అడిగారు.
శంకర్ దయాళ్ శర్మ ఒక నిముషం నిర్ఘాంత పడి, ఆ తర్వాత తేరుకుని పుస్తకం ఖరీదు 150 రూపాయలను దాస్ గుప్తా కు చెల్లించారు.
మరో విశే వుషం ఏమిటంటే ఆ సమయానికి డా.శర్మ జేబులో డబ్బు లేకపోవడం తో ఆయన తన వ్యక్తిగత సిబ్బంది నించి అప్పు తీసుకుని సొమ్ము చెల్లించారు.
దాస్ గుప్తా వ్యక్తిత్వం అలాంటిది. ఆయనకు శ్రద్ధాంజలి. డి.సోమ సుందర్.