ఆంధ్ర జనరల్ హాస్పిటల్స్ హోదా మార్చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 2019 అక్టోబరు 29న జారీ చేసిన జి.ఓ.ఆర్.టి.నెం.558 పై నాకు వచ్చిన సందేహాలు:

1. బోధనాసుపత్రులను మరియు జిల్లా ఆసుపత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చే అంశాన్ని పరిశీలించి, ముసాయిదా బిల్లును తయారు చేయడం కోసం సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ ఆ.ప్ర.ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ జీ.ఓ.ఆర్.టి.నెం.558 ను జారీ చేసింది.

2. వైద్య కళాశాలలను ప్రభుత్వం నిర్వహిస్తూ, బోధనాసుపత్రిని మాత్రం స్వయం ప్రతిపత్తి సంస్థగా మార్చడం సాధ్యమా? బోధనాసుపత్రులు అని జి.ఓ.లో ప్రస్తావించడం అంటే వైద్య కళాశాలలతో పాటు అని అంతరార్థమా?

3. బోధనాసుపత్రులతో పాటు వైద్య కళాశాలలను కూడా స్వయం ప్రతిపత్తి కళాశాలలుగా మారుస్తారా? కళాశాలలు, బోధనాసుపత్రులను వేరు వేరుగా నిర్వహిస్తే, వాటి మధ్య సమన్వయం మాటేంటి?

4. స్వయం ప్రతిపత్తితో నిర్వహించబడుతున్న కడప, ఒంగోలు, శ్రీకాకుళం “రిమ్స్” వైద్య కళాశాలలను ప్రభుత్వ కళాశాలలుగా ఇటీవలే విలీనం చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చాలన్న ఆలోచన ఉన్నప్పుడు “రిమ్స్” వైద్య కళాశాలలను ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసినట్లు?

5. తిరుపతి ” స్విమ్స్”, హైదరాబాదు “నిమ్స్” స్వయం ప్రతిపత్తి ఆసుపత్రులు. రోగులు చికిత్స కోసం డబ్బు చెల్లించు కోవాలి. బోధనాసుపత్రులను, జిల్లా ఆసుపత్రులను స్వయం ప్రతిపత్తి ఆసుపత్రులుగా మార్చితే ప్రజలు చికిత్స కోసం డబ్బు చెల్లించు కోవాలా?

 

– టి.లక్ష్మీనారాయణ
సామాజిక, రాజకీయాంశాల విశ్లేషకులు