“అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు’’ అనే పాటెప్పుడైనా విన్నారా? ఇప్పటికి యాభై ఏళ్లకు ముందు దసరా సెలవులప్పుడో సెలవుల ఆరంభానికి ఒకటి రెండ్రోజులకు ముందో స్కూలు పిల్లగాళ్లను గుంపేసుకుని అయ్యవార్లు అంగళ్ల దగ్గరకు వెళ్లే వాళ్లు. అప్పటి పాట ఇది. ఎవరికేం కావాలో పాటలోనే ఉంది కదా వరహాలు,
పప్పుబెల్లాలని. మా పాతకాలం ముచ్చట్లు నచ్చనివాళ్లు టీచర్లు అడుక్కుతినడమని దీన్ని ఛీత్కరించి తీసి పడెయ్యచ్చు. కానీ అది చాలా నిర్దయతో కూడిన అభిప్రాయమని నాకనిపిస్తుంది.
అలా గతంలోకి జారుకుని ఆ జ్ఞాపకాలను స్మరించుకుంటుంటే ఇలాంటి సంగతుల పట్ల నాలో ఆరాధనా భావం మరింత పెరుగుతుందే తప్ప వ్యతిరేకత మాత్రం కలగనే కలగదు. బహుశ అది నా దౌర్బల్యమేమో. అయినా బాల్యాన్ని ప్రేమించని వాళ్లెవరుంటారు? అందరం సుభద్రా కుమారి చౌహాన్ లాగా అందమైన కవితలు రాయలేం గానీ అప్పుడప్పుడూ బాల్యం స్మృతులను తల్చుకుని మురిసిపోని మనిషంటూ ఉంటాడా?
నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల్లో స్కూలంటే ఊరికంతటికీ ఓ కమిట్ మెంట్ ఉండేదేమో అనిపిస్తుంది. స్కూల్లో అఆలు దిద్దుకునే బుడతల్నీ, చిన్న చిన్న పద్యాలు ముద్దుగా అప్పజెప్పే పిల్లోళ్లనీ చూస్తే ఊరు ఊరంతటికీ అదో రకమైన గర్వం. మాటల్లో చెప్పలేనంత ముద్దు.
నేను చెప్పిన దసరా ముచ్చట జ్ఞాపకం నంద్యాలది.
అయ్యవార్లతో కలిసి అంగళ్లకు పోయే ముందు పాత నోట్ బుక్కుల అట్టలతో కిరీటాలు చేసుకునే వాళ్లం, రాముడు, అర్జునుడు వగైరా వేషాల కోసం. పాత బ్లేడు ముక్కలను పెన్సిళ్లు జువ్వుకోడానికి వాడుకునేవాళ్లం కదా, ఆ బ్లేడు ముక్కలే ఇప్పుడు కిరీటాలు చేసుకోడానికి పని కొచ్చేవన్న మాట. ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు పెద్దవాళ్లు విధిగా పక్కనుండి సహాయపడుతున్నా అప్పుడప్పుడూ వేలు కోసుకోడం మామూలే. వేలు కోసుకున్నప్పుడు వెంటనే నోట్లో పెట్టుకుని చీకితే తొందరగా మానిపోతుందని చిన్నపిల్లలమైనా మాకందరికీ బాగా తెలుసు.
మరి కిరీటం ఆకారం ఎట్లా ఉంటుంది? నేను మరీ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కర్నూలులో లవకుశ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు చూశాను కదా, వాటిలో ఎన్టీఆర్, ఏయన్నార్ నెత్తిన పెట్టుకునేవే కిరీటాలంటే. ఇంట్లో అన్నయ్యలు, అమ్మానాన్నల ఓపికకు మా పనితనాన్ని జోడించి నానా కుస్తీలు పట్టి కష్టపడి కిరీటాలు చేసుకునే వాళ్లం. నోట్ బుక్కు అట్ట దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది కదా, దానిపైన పూర్తి అర్ధవృత్తం కాకుండా కొంచెం కోలగా ఉండేట్టు పెన్సిలుతో గీసుకోవాలి. రెండు వైపులా సమానమైన ఎత్తులో ఒకటి రెండు చోట్ల పాత గీతను రబ్బరుతో కొట్టేసి (అది ముమ్మాటికీ రబ్బరు లేదా లబ్బరు అంతే, ఇప్పటిలాగా ఎరేసర్ మాత్రం చచ్చినా కాదు.) చూపైన కొసలు వచ్చేలాగానూ, టాపులో ఓ మొగ్గ లాగానో, బల్లెం మొనలాగానో ఉండేట్టు సరి చేసి గీసుకోవాలి.
ఈ ఆర్టు వర్కు దాకా అంతా హాయిగానే ఉంటుంది గానీ అటు తర్వాతే ఆ దళసరి అట్టకూ మన దగ్గరున్న మొద్దు బ్లేడుకు మధ్య పెద్ద యుద్ధమై పోతుంది. కళ్లు ఇంతింతలు చేసి పెన్సిలు గీత మీద బ్లేడుని వొత్తి పట్టి నాగలిలా లోతుగా దించి ముందుకు నడిపించాలంటే మాటలా? మోకాలి మీద కూర్చుని బలమంతా ఉపయోగించి నానాతంటాలూ పడుతుంటే ఏ అన్నయ్యో వచ్చి ఆదుకుంటే అంత కంటే కావలిసిందేముంది?
మన ఫ్రెండ్సుల్లో ఎవరికైనా వాళ్ల నాయన వడ్రంగి పనో, పేద్ద కత్తెరున్న టైలర్ పనో చేసేవాళ్లయితేనా ఈ కిరీటాల పని యమ హీజీ అయిపోతుంది. మన ఫ్రెండ్సులు అందరం కట్టగట్టుకుని వాళ్లింటికి పోయి అందరి కిరీటాల అట్టలను కత్తిరించుకుని వచ్చేయొచ్చు.
అయితే అట్టలు కత్తిరించేసినంత మాత్రాన కిరీటాల పని అయిపోయినట్టు కాదు. వాటికి రంగు కాయితాలు, తగరాలు అతికించి తళతళలాడేలా చేయడం చాలా ముఖ్యమైన పని. అప్పట్లో ప్లాస్టిక్ పేపర్లు లేవు. అన్నీ గడ్డి కాయితాలే. అసలు ఈ అతికించే పనులంటే మా పిలగాళ్లకు ఎంతిష్టమో. ఆగస్టు 15న, జనవరి 26న స్కూల్లో పురికోసలు వేలాడ దీసి త్రిభుజాకారం రంగు కాయితాలు అతికించే పనంటే నేను ముందుండే వాడిని.
ఈ రంగు కాయితాలకు తోడు తగరాలు కూడా సంపాదించుకోవాలి. తగరాలు సిగిరెట్ పెట్టెల్లో ఉంటాయని కూడా మా పిల్లలకు బాగా తెలుసు. ఇంటి నుంచి స్కూలుకు పోయేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఒక్కోసారి ఎక్కడికైనా ఆడుకోడానికి వెళ్లేటప్పుడు దారెంబడి పారేసిన ఖాళీ సిగిరెట్ పెట్టెల కోసం మా కళ్లు చురుగ్గా వెదుకుతుండేవి. అమ్మా నాన్నలతో కలిసి బజారులో నడిచేటప్పుడు సిగిరెట్ పెట్టెలు కనిపించినా వాటిని ఏరుకోవడం కుదరదు. వాళ్లు తిడతారు. వీటిలో తగరాలను తీసేసి బుక్కుల మధ్యనో, లేక పుస్తకాల గూట్లోనో భద్రంగా దాచుకునే వాళ్లం. పుస్తకాల మధ్య దాచుకుంటే అయ్యవార్లో, ఇంకెవరో చూస్తే తిట్లు తప్పవు. అందుకే ఈ తగరాలను మనకు తప్ప మరెవ్వరికీ తెలియనంత రహస్యంగా పుస్తకాల అడుగున అత్యంత భద్రంగా దాచుకోవాలన్న మాట. పుస్తకాలకు ఎన్టీఆర్, ఏయన్నార్ బొమ్మలున్న న్యూస్ పేపర్ లతో అట్ట వేసుకుంటాం కదా, ఆ అట్టలోపల కూడా ఎవ్వరికీ తెలియకుండా దాచుకోవచ్చు.
కిరీటాలను బంగారంతో వజ్రవైఢూర్యాలతో, రత్నాలతో చేస్తారంట కదా. కానీ మనకు చిన్నపిల్లలకు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దొరకవు కాబట్టి తగరాలతో సర్దుకోవాలన్నమాట. అట్టల మీద ఎర్ర రంగుదో లేక పసుప్పచ్చ రంగుదో కాయితం కరిపించి, దానిపైన తగరంతో నక్షత్రాల మాదిరో తామర పుష్పాల మాదిరో కత్తిరించి అతికిస్తే ఇవి కూడా అచ్చం వజ్రవైఢూర్యాల మాదిరే మెరుస్తాయి.
అట్టలమీద రంగు కాయితాలు, తగరాలు అతికించడం అదింకో పెద్ద పని. కొందరు తెలివైన పిల్లకాయలు ఇండ్లల్లో బంక స్టాకు పెట్టుకుంటారు. గాలిపటాలకు తోక అతికించడానికీ, చినిగిపోయిన పుస్తకాలను అతికించుకోడానికీ, ఇంకా కొన్ని పనులకు బంక కావాలిసొస్తుంది కదా. నేను కూడా కొంచం పెద్దయ్యాక టెంకాయ చిప్ప పట్టుకుని వేప మాన్ల దగ్గరకు పోయి బంక తెచ్చుకునే వాడిని. వేపమాన్ల మీద దయ్యాలుంటాయని భయపడే వాణ్ణి కాబట్టి చిన్నప్పుడు పోయేవాడిని కాదు. పాపం వేప మాన్లను గొడ్డలితోనో, చాకుతోనే ఎవరో కొందరు కొట్టి గాయం చేసేవాళ్లు కదా, అదిగో అలా కచ్చు పడితే అక్కడ బంక కాస్తుందన్న మాట. ఈ రోజు మనం బంకను గిల్లి మన చిప్పలో వేసుకుని తీసుకుని పోతే మళ్లీ రెండు మూడు రోజుల్లోపల అక్కడే ఇంకో బుడిపె బంక కాస్తుంది. అప్పుడు మళ్లీ గిల్లుకోవచ్చు. ఇట్లా వారం పది రోజులు రోజూ తిరిగితే మన చిప్ప నిండిపోతుంది. కానీ ఇటువంటి పనులు పెద్దవాళ్లకు ఇష్టం ఉండవు కాబట్టి వాళ్లకు తెలియకుండా మన బంక మనమే సంపాదించుకోవాలి. ఒక్క వేపమాన్లకే కాకుండా సుంకేసుల చెట్లకు, రామబాణం పూల చెట్లకు, చింత చెట్లకు కూడా బంక కాస్తుంది కానీ వేప మాను బంకైతేనే గట్టిగా అతుక్కుంటుందని మా ఫ్రెండ్సులు చెప్పేవాళ్లు. తుమ్మ మాను బంక కూడా గట్టిదే కానీ ఆ చెట్టుకు ముండ్లుంటాయి కదా, అందువల్ల మనకు ఇబ్బంది.
కిరీటాలకు రంగుకాయితాలు, తగరాలు అతికించడానికి ముందురోజు రాత్రి బంకచిప్పలో కొంచం నీళ్లు వేసి పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్లు వేశామనుకో, బంక నీళ్లగా అయిపోయి సరిగ్గా అతుక్కోదన్నమాట. ఒకవేళ మన దగ్గర అస్సలు బంక లేకపోతేనో, లేక ఉన్న బంక అయిపోతేనో మనకు పెద్ద కష్టం వచ్చినట్టన్న మాట. అయినా ఏం ఫర్లేదు, మనం కొంచం ధైర్యం తెచ్చుకుని మంచి ఐడియా వేయాలి. అమ్మ దగ్గరకు పోయి అమ్మ చెంగు పట్టుకుని బతిమాలి, గోము చేసి కిరీటాలు అతికించుకోడానికి కొంచం చద్దన్నం సంపాదించాలి. అమ్మ నాలుగైదు మెతుకు లిచ్చేందుకు ఒప్పుకుంటే మనం పది పదహైదో లేక నూరో నూటాయాభయ్యే మెతుకులు తీసుకున్నా ఫర్వాలేదు. అయితే నాయన చూస్తే అన్నం వేస్టు చేస్తున్నావని తిడతాడు కాబట్టి అన్నాన్ని కనబడకుండా చేతిలో దాచిపెట్టుకుని గప్ చుప్ గా మిద్దె మీదకు పోయి పని పూర్తి చేసుకోవడం మేలు. అతికించడం అయిపోయాక అన్నం ఒకవేళ మిగిలితే మనం చీమలకు వేస్తాం కాబట్టి మనకి పుణ్యం వస్తుందే తప్ప అన్నం వేస్టు మాత్రం కాదు.
హమ్మయ్య, రంగు కాయితాలు, తగరాలు అతికించాక అట్టలను ఎండబెట్టుకుంటే కిరీటాలు దాదాపు పూర్తయినట్టే లెక్క. ఇప్పుడు వాటికి కుడి పక్క, ఎడమ పక్క దబ్బనంతోనే చీలతోనో చిన్న బొక్కలు చేసి వాటిలోకి దారం దూర్చి ముడివేస్తే నెత్తిన పెట్టుకోడానికి కిరీటాలు రెడీ.