నవంబర్ ఒకటిన ‘ౙఖ్మీ’ ఆవిష్కరణ

ఏళ్ళుగా పాతుకు పోయిన దుఃఖపు చారికలు ఏ లేపనాలతో మరుగున పడతాయి?
ఏ సమాజంలోనూ లేనంత వెనుకబాటుతనం
ఏ వర్గంలోనూ లేనంత చైతన్యలేమి
ఏ కట్టుబాట్లలోనూ లేనన్ని స్వేచ్ఛా సంకెలలతో
కునారిల్లే సమాజాన్ని తమ వంతు కర్తవ్యంగా బయటకు తీసుకురావాల్సిన పాలకులు పట్టించుకోకుండానే మరింత దైన్యంలోకి నెట్టి వేయడం చేసే చేటు అంతా ఇంతా కాదు.
ఇప్పుడు దేశమంతా అభివృద్ధి జపమే చేస్తోంది. ఒక్క ముస్లిం సమాజం తప్ప.
ఒక పది మంది ముస్లిమేతరులు క్యాబ్ లో సాఫ్ట్ వేర్ జాబ్ కు వెళ్తుంటే ఆ క్యాబ్ కు డ్రైవరుగా ఒక ముస్లిం ఉండి ఉంటాడు.
పది మంది ముస్లిమేతరులు క్యాబ్ నడిపేవారుంటే వాటి మెకానిక్లు మాత్రం ముస్లింలే అయి ఉంటారు.
ఇవే కాదు ఉల్లిపాయలు, అరటి పళ్ళు, సైకిల్ పంక్చర్ షాపులు, మాంసం దుకాణాలు, వెల్డింగ్, పాన్ షాప్ ఏది చూసినా అధిక సంఖ్యలో ముస్లిములే ఉంటారు. వారు మాత్రమే ఎందుకుంటున్నారు?
ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేసేంతగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఇలాంటి అసమానతలు పుట్టుకు రావడానికి కారణాలేమిటి? తదితర అంశాల సారమే ‘ౙఖ్మి’ కవితా సంకలనం. ముస్లిం సమాజానికో దివిటీ.
అనేకానేక దుఃఖాల సమాహారం ముస్లిముల పేద బతుకులు. అసలు తామనుభవిస్తున్నదంతా దుఃఖమే అని ఎరుగని జీవితాలు. వీటన్నింటికీ అద్దం పడుతోంది ౙఖ్మీ కవిత్వం. స్వతహాగా జర్నలిస్ట్ అయిన నస్రీన్ ఖాన్ ముస్లింల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవంతో ఈ కవితలను రచించారు. ఒక్కొక్క కవిత ఒక్కో పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ కవితా సంకలనం నవంబర్ ఒకటో తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాలులో సాయంత్రం 6గంటలకు ఆవిష్కృతమవుతుంది.
ప్రముఖ ఉర్దూ కవయిత్రి, షాహీన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక, నిర్వాహకురాలు జమీలా నిషాత్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ప్రముఖ ముస్లింవాద కవి స్కైబాబ అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముస్లింవాద తొలితరం కవి ఖాదర్ మొహియుద్దీన్, ప్రముఖ సినీనటులు, పర్యావరణ ప్రేమికులు షఫీ, ప్రముఖ కవి, విమర్శకులు జి. లక్ష్మీ నర్సయ్య, ప్రముఖ కవి, కవి సంగమం వ్యవస్థాపకులు యాకూబ్, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి, రచయిత, విమర్శకులు కె. ఆనందాచారి, రచయిత, కవి, విమర్శకులు, గాయకుడు, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డా.పసునూరి రవీందర్, స్ర్పెడింగ్ లైట్ నిర్వాహకులు పి.జ్యోతి తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు.
అంకుర్ ముస్లిం రచయిత్రుల వేదిక, హర్యాలి ముస్లిం రచయితల వేదిక, తెలంగాణ సాహితి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహితి సహాయ కార్యదర్శి షేక్ సలీమా ఆహ్వానం పలుకుతుండగా, వర్థమాన యువ కవి ముజాహిద్ అలీ వందన సమర్పణ చేయనున్నారు.