మహారాష్ట్ర బిజెపికి చాలా ముఖ్యమయిన రాష్ట్రం. మొదట శివసేనతో కలసి అధికారం చేపట్టి,తర్వాత శివసేనను మించి అధిక్యత సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బిజెపి ఇక్కడ ఎదిగింది.
ఇపుడు కూడా బిజెపి-శివసేన పార్టీల కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ప్రభుత్వమూ ఏర్పాటు చేసేస్తున్నది.
అయితే, బిజెపి లోఅంత ఆనందం లేదు.ఈ విజయం,రెండో సారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఆ పార్టీలో అంత కిక్ ఇవ్వడం లేదు.
ఎందుకంటే, జాతీయ స్థాయిలో కలకలలాడి పోతున్నబిజెపి,మోదీ గ్లామర్ లాగా మహారాష్ట్ర విజయం లేదు.
ఎందుకంటే, రాష్ట్రంలో మోదీ గ్లామర్ తోనే ఎన్నికల్లో తలపడినా, ఆకాశమంత ఎత్తు ఎదుగుతున్న మోదీ కీర్తితో ఈ విజయం సరితూగ లేదు.
కారణం, బిజెపి 17 సీట్లు కోల్పోయింది. 2014లో బిజెపికి 122 సీట్లు వచ్చాయి. ఇపుడు 105 మాత్రమే వచ్చాయి.
అంతేనా, కాదు, ఇంకా చాలా కథ. ఉంది.
ఓడిపోయిన ప్రముఖుల్లో అయిదుగురు క్యాబినెట్ మంత్రులున్నారు. పట్టణ ప్రాంతాల్లో బిజెపి పనితీరు బాగానే ఉన్నా, పల్లె ప్రాంతాల్లో బిజెపి పరిస్థితి బాగాలేదు.
కరువులుకాటకాలు,పంటనష్టాలు,రైతుల ఆత్మహత్యల మధ్య బిజెపి జాతీయ వాదం,దేశ భక్తి పనిచేయలేదు.
ముఖ్యంగా కరువుకాటకాలకు నిలయమయిన మరాఠ్వాటా ప్రాంతంలో పార్టీ బాగా దెబ్బతినింది.
తమాషా ఏమిటంటే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ తమ పనితీరును మెరుగుపర్చుకున్నాయి.
బిజెపితో పొత్తున్న శివసేన సీట్లు కూడా పడిపోయాయి. ధాకరే వారసుడు ఆదిత్య థకారే గెల్చాడన్న ఆనందమే తప్ప 2014లో వచ్చిన 63 సీట్ల నుంచి శివసేన బలగం 56 పడిపోయింది.
కాంగ్రెస్ కు 2014కంటే రెండు సీట్లు ఎక్కువ గెల్చుకుని 44 కు చేరింది. కరప్షన్ కేసులో అనుమానితునిగా పేరు చేర్చినా, శరద్ పవార్ ఆకర్షణ తగ్గలేదు. ఆ పార్టీ 54 సీట్లు గెల్చుకుంది. అంటే దాదాపు శివసేన తో సమానంగా ఉందన్నమాట.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు మంచి పేరొచ్చినా పార్టీకి అది ఉపయోగపడలేదు. పార్టీకి కావలసింది వేరు,ప్రజలకు కావలిసింది వేరు. ఈ రెండింటి మధ్య గత అయిదేళ్ల మ్యాచ్ కుదరక కోవడం వల్ల బిజెపి పనితీరు మసకబారింది.
ఈ దఫా ఎన్నికల్లో బిజెపి ఫలితాలు ఏ రాష్ట్రంలో కూడా సంతృప్తికరంగా లేదు. హర్యానాలో అంతంత మాత్రమే. కాంగ్రెస్ అంతరించిపోలేదు.తెలంగాణలో పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఉత్తర ప్రదేశ్ లోనూ అంతే సమాజ్ వాది పార్టీ పుంజుకుంది.
మొత్తానికి దేశంలోప్రజలు ప్రతిపక్షం అవసరముందనే భావిస్తున్నట్లు అర్థమవుతుంది.ప్రతిపక్షంలో ఆశలు మొలకెత్తించాయి ఈ ఎన్నికలు.
ఎక్కడా మోదీ మ్యాజిక్ పూర్తిగా పనిచేయలేదు. గెల్చామన్నా ఆనందం పైకి ప్రదర్శిస్తున్నా లోలోన చాలా దిగులుపుట్టించే ఎన్నికలివి.