ఆదిలాబాద్ కు రవీంద్రనాధ్ టాగోర్ కు ఉన్న సంబంధం ఏమిటి?

ఎక్కడి బెంగాల్ ఎక్కడి ఆదిలాబాద్. ఇది వినడానికి నక్కకు నాగలోకానికి ఉన్న సంబంధం లాగా లేదూ?
పైకి అలా అనిపిస్తుంది కాని, ఆదిలాబాద్ కు విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కు సంబంధం ఉంది.

ఎలాగేంటే …

1961లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో  డైనోసార్ అవశేషాలను కనుగొన్నారు. ఇది 18 మీ పొడవుంటుంది. 7 టన్నుల బరువుంటుంది. ఇది ఎపుడో పురాతన కాలంలో ఈ ప్రాంతంలో బాగా తిరిగిన డైనోసార్.

ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో దొరికిన పూర్తిస్తాయి డైనోసార్ అస్తిపంజరం. దీనికి రవీంద్రనాథ్ పేరుపెట్టడానికి కారణం ఉంది. ఈ డైనోసార్ శాస్త్రీయ నామం బారపాసారస్ టాగోరీ (Barapasaurs Tagorei) (కింది ఫోటో).

 

ఈ విషయాన్ని పర్వీన్ కాశ్వాన్ అనే ఇండియన్ ఫారెస్టు సర్వీస్ అధికారి ఒకరు ట్విట్లర్ పేర్కొన్నారు. భారపారస్ అనే పదానికి అర్థం ఏమిటంటే బార అంటే పెద్ద,భారీ అని,పా అంటే పాదాలు. సారస్ అనే గ్రీకు మాటకు అర్థం బల్లి అని. అన్నికలిపితె ఇదిపెద్ద కాళ్లున్న బల్లి .

దీనితో పాటు కాశ్వాన్ మరికొన్ని ఆసక్తికరమయిన విషయాలను ట్విట్లర్ వెల్లడించారు. భారతదేశంలో డైనోసార్లు లేవనుకోరాదున మొదటి డైనోసార్ అవశేషాలు 1828లో కనిపించాయి. వీటిని జబల్ పూర్ కంటోన్మెంట్ లో ఆర్మీఆఫీసర్ కెప్టెన్ డబ్ల్యు హెచ్ స్లీమన్ కనుకొన్నారు.  ఇలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా డైనోసార్ పార్కులున్నాయి. అంటే సంచరించిన ప్రాంతాలు అని అర్థం. అంటే భారతదేశంలో డైనోసార్లను అధ్యయనం చేయబట్టి  175 సంవత్సరాల పైబడే అయిందన్నమాట.

అయితే, ట్రెండింగ్ తెలుగు న్యూస్ దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమయిన విషయాలను అందిస్తూ ఉంది.

ఈ శిలాజం (Fossil) గోదావరి ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో 1961లో దొరికింది. నిజానికి ఇది ఆ ఏడాది ‘గ్రేట్ డిస్కవరి’ అని  జియాలజిస్టులు చెబుతారు.

ఎందుకంటే ఈ డిస్కవరీకి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉంది. కలకత్తాలోని  ఇండియన్ స్టాటిస్టిటికల్ ఇన్ స్టిట్యూట్ (ISI) జియోలాజికల్ స్టడీస్ రీసెర్చ్ యూనిట్ వారు ఈ శిలాజాన్నికనుగొనడం ఒక విశేషం.

ఇది పూర్తి శిలాజం కావడం మరొక విశేషం.

శిలాజాన్ని కొనుగొనింది విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శతజయంతి సంవత్సరం కావడంతో దీనికి ఆయన పేరు పెట్టాలనుకున్నారు.

ఇంత   పూర్తిగా చక్కగా ఉండే శిలాజం (కింద రెండో ఫోటో) భారతదేశంలో దొరకడం ఇదే ప్రథమం. అంతేకాదు, డైనోసార్ పరిణామానికి సంబంధించి కనిపించకుండా సతాయిస్తున్న ఒక లింక్ దీనితో దొరికిపోయింది.

ఈ డిస్కవరీకి లండన్ రాయల్ సొసైటీ రు. 15,000 గ్రాంటు ఇచ్చింది. ఈ డిస్కవరీలో పాల్గొన్నవారు.

డాక్టర్ పామెలా రాబిన్సన్, డాక్టర్ ఎలెక్ స్మిత్ ( యూనివర్శటీ ఆఫ్ లండన్), లతోపాటు ఐఎస్ ఐ కి చెందిన డాక్టర్ రాయ్ చౌదరి, డాక్టర్ ఎస్ ఎల్ జైన్, తపన్ కుమార్ చౌదరి.

అలా ఆదిలాబాద్,రవీంద్రనాథ్ టాగోర్ ను కలుపుతూ బారపాసారస్ టాగోరి (Barapasaurs Tagorei) అనే పేరు తయారయింది.

బారాపసారస్ టాగోరీ అనేది జురాసిక్ యుగానికి చెందిన Sinemurian Age లో జీవించింది. భూమ్మీదే సంచరించేది. ఇది శాకాహారి. గుడ్లు పెట్టేది.

బారపాసారస్ అస్తిపంజరం ఇది (ISI పాలియంటాలజీ మ్యూజియం)