నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలుగుదేశం ప్రభుత్వం మీద నూరు కోట్ల రుపాయల ఫైన్ ఎందుకు విధించిందో ఆ పార్టీ నేతలొకసారి ప్రజలకు వివరించాలని పంచాయతీరాజ్,గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి సలహా ఇచ్చారు.
ఈ ఫైన్ గత అయిదేండ్లలో రాష్ట్రంలో పెరిగిన ఇసుక మాఫియాకు సాక్ష్యమని ఆయన అన్నారు.
రాష్ట్రంలో గత పదేళ్లలో ఎపుడూ లేనంతగా వర్షాలు కురియడం వరదలు రావడంతో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయని, ఇది తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఇసుక రాజకీయం చేస్తున్నదని రామచంద్ర రెడ్డి ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీ హయాంలో ఇసుక దోపిడీ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అవాక్కయి నూరు కోట్ల రుపాయల జరిమాన విధించిన విషయం ఆయన ప్రస్తావించారు. ఇాలాంటి విధానం ఇపుడు రద్దయినందున తెలుగుదేశం నాయకులు కంగారుపడుతున్నారని, అందుకే వరదలొచ్చిన విషయం కూడా విస్మరించి ఇసుక లేదని గోల చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇసుక కొరతను కావాలనే వైసిపి ప్రభుత్వం సృష్టిస్తున్నదని మొన్న మచిలీ పట్నంలో తెలుగుదేశం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష చేశారు.
ఇదే ఇసుక కొరత మీద జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ నవంబర్ మూడో తేదీన విశాఖలో ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంతో మంత్రి ఇసుక కొరత ఎందుకొచ్చిందో వివరించారు.
మంత్రి ఏమన్నారంటే…
మరో పదిహేను రోజుల్లో వరదలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని, ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు.
గత డెబ్బై రోజులుగా కృష్ణానదిలో, నలబై రోజులుగా గోదావరిలో వరద కొనసాగుతోంది.
ప్రతికూల పరిస్థితి వల్ల రీచ్ ల నుంచి ఇసుకను తీయలేకపోతున్నాం.
ఇసుక కొరత వల్ల నిర్మాణ పనులు మందగించకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం.
భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు. పట్టా భూముల ద్వారా నిర్మాణాలకు ఇసుకను అందిస్తున్నాం.
ఇప్పటి వరకు 82 పట్టాభూముల యజమానులతో అగ్రిమెంట్లు. వాటిల్లో పది పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు కూడా ఇచ్చేశాం.
ఇప్పటి వరకు ముప్పై ఆరువేల మంది దరఖాస్తు దారులకు ఆరులక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేశామని తెలిపారు. క్రెడాయ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ లతో మాట్లాడి, వారి అవసరాలకు కూడా దాదాపు యాబై వేల టన్నుల ఇసుకను అందించాం.
రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్నుల మేరకు పెంచగలిగాం.
ఇసుక దోపిడీకి అవకాశం లేకపోవడంతోనే ఆరోపణలు చేస్తున్నారు.
నదుల్లోని ఇసుకను యధేచ్చగా దోచుకున్న తెలుగుదేశం నేతలకు తమ అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారు.
నదుల్లో రీచ్ లు వరదతో నిండిపోతే ఎవరైనా ఇసుకను ఎలా వెలికితీస్తారుఈ మాత్రం అవగాహన లేకుండానే ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణం.
ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యూనల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా వందకోట్ల రూపాయలు జరిమానా కూడా విధించింది.
ఇటువంటి విధానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తి విరుద్దం. దీనివల్లే ప్రతిపక్ష పార్టీలు ఇసుక రాజకీయాలు చేస్తున్నాయి.