నేడు శ్రీశైలం నీటిని అందుకోలేని రాయలసీమ రేపు గోదావరి నీటిని ఎలా అందుకుంటుంది ?
చాలా మంది దృష్టిలో రాయలసీమ నీటి సమస్యకు కారణం నీటి కొరత , కృష్ణలో తగ్గిన నీటి లభ్యతగా చెపుతారు. మొదటి నుంచి రాయలసీమ ఉద్యమం సీమలో నీటి నిల్వ ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం , నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణం కూడా సీమకు ఉపయోగపడని రీతిలో చేయడం వల్ల అని. రాయలసీమ ఉద్యమం మాట వినని పాలకులు ప్రకృతి చెప్పిన నిజాలను చూడటం కనీస ధర్మం.
రాయలసీమలో నీటి అవకాశాలకు ఏనాడు కొరత లేదు.
అనేక సంవత్సరాల లెక్కలను పరిగణనలోకి తీసుకొని చూస్తే సీమ నుండి వందల టీఎంసీల నీరు క్రిందకు వెళుతుంది. కృష్ణలో నీరు తగ్గిన సమయంలో కూడా తుంగభద్ర , కుందు ఉపనదులు పుష్కలంగా నీటిని తీసుకువస్తున్నాయి నేడు నెల్లూరు జిల్లాలోని సోమశిలకు 70 టీఎంసీలు , కండలేరుకు 25 టీఎంసీల నీరు చేరింది కేవలం కర్నూలు , కడప జిల్లాలలోని కుందు , చెయ్యేరు నదులు తెచ్చిన వరద నీరు మాత్రమే. సమస్య ఆ నీటిని రాయలసీమలో నిల్వ చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడమే.
ఆగస్టు నెల నుండి నేటి వరకు దాదాపు 70 రోజులుగా విడతల వారిగా వరద వస్తుంది. 6 సార్లు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ , పులిచింతల , ప్రకాశం బ్యారేజి నిండి వందల టీఎంసీల సముద్రంలో కలిసింది. కానీ రాయలసీమలో మాత్రం కేవలం 45 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. 4 రాయలసీమ జిల్లాల్లో చిన్నా పెద్దా ప్రాజెక్టుల సామర్థ్యం 115 టీఎంసీలు. వాటిలో చేరిన నీరు మాత్రం 48 టీఎంసీలు. సీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే అది పోతిరెడ్డిపాడు , మాల్యాల , ముచ్చి మర్రి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్కుసెక్వ్యూల నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి బనకచర్ల వరకు ఉన్న 12 కిలోమీటర్ల కాలవ నిర్మాణం నీటిని అందుకునే స్థాయిలో చేయలేదు. బనకచర్ల నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయాల్సిన 3 పాయల నిర్మాణ సామర్థ్యం వరుసగా 15 , 12 , 8 వేల క్కుసెక్వ్యూలు. అంటే 2 .5 టీఎంసీల నీరు మాత్రమే. ఇక మిగిలింది మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి అర టీఎంసి మాత్రమే నీటిని సరఫరా చేయగలం. మొత్తంగా రోజుకు 3 టీఎంసీల నీరు విడుదల చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. నేడు నెల్లూరు , రాయలసీమలో కలిపి దాదాపు 150 టీఎంసీల నీరు నిల్వ చేసినారు. మరో 50 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉన్నా ఎక్కడ లోపం జరిగిందో ప్రభుత్వం గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేయాల్సిసింది….
శ్రీశైలం నుంచి క్రిష్ణ నీటిని వరదల సమయంలో డ్రా చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వెడల్పు ఒక లక్ష క్కుసెక్వ్యూలకు పెంచి దానికి అనుగుణంగా బనకచర్ల కాల్వ , అక్కడి నుంచి 3 పాయలుగా ఉన్న కాల్వల సామర్ధ్యాన్ని కూడా తగిన స్థాయిలో పెంచాలు. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిన సమయంలో కూడా పుష్కలంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర , కుందు నీటిని నిల్వ చేసుకోవడానికి అనువుగా HLC కి సమాంతర కాల్వ , గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలి. కుందు నదిపై రాజోలు , జోలదరాసి , ఆదినిమ్మాయని బ్యారేజిల నిర్మాణం చేయాలి. రాయలసీమలోని కుందు , చెయ్యేరు నీటితో సోమశిల నిండి సముద్రంపాలు అవుతున్నా రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు ఉపయోగపడే కండలేరుకు నీరు అందని పరిస్థితిని అధిగమించడానికి గాను సోమశిల – కండలేరు కాల్వ సామర్ధ్యాన్ని 12 వేల క్కుసెక్వ్యూల నుంచి 44 వేల క్కుసెక్వ్యూలకు పెంచాలి.
గోదావరి నీటిని శ్రీశైలంలో నింపి రాయలసీమ నీటి సమస్యను పరిష్కరించాలనుకుంటున్న ప్రభుత్వం నేడు శ్రీశైలంలో 70 రోజులుగా నీరు నిండుకున్నా సీమ ప్రాజెక్టులకు నీరు అందక పోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలు. వరద నీటిని త్వరితగతిన ఉపయోగించుకునే ప్రాధమిక ఏర్పాట్లు మొదట యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. అలా కాని పక్షంలో నేడు శ్రీశైలం నీటిని వాడుకోలేని రాయలసీమ రేపు గోదావరి నీటితో శ్రీశైలం నింపినా అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండవు.