నాటి మిడిల్ క్లాస్ కలల రాణి, బజాజ్ చేతక్ మళ్లీ వస్తాంది, ఈ సారి కరెంటుతో

బజాజ్ చేతక్ స్కూటర్ గుర్తుందా? బజాక్ చేతక్ నడపడం ఇండియాలో ఒకపుడు మిడిల్ క్లాస్ డ్రీమ్.

ఇలాంటి బజాజ్ చేతక్ కనుమరుగుయిపోయింది. ఒకటిన్నర దశాబ్దం కిందట,  భారతీయు టూవీలర్ రైడర్ స్కూటర్ నుంచి మోటార్ సైకిల్ కు మైగ్రేట్ కావడంతో చేతక్ చాప్టర్ ముగిసింది.

అయినా సరే, ఇంకా, అక్కడక్కడా చెక్కుచెదరకుండా రోడ్లమీద చేతక్ లు తిరుగుతూనే కనిపిస్తాయి. గత వైభవాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి.

ఇపుడదే  బజాజ్ చేతక్ మళ్లీ ప్రత్యక్షం కాబోతున్నది. కాకపోతే,అవతారం మార్చుకుని. ఈ సారి బజాజ్ చేతక్ ఎలెక్ట్రిక్ స్కూటర్ గా రాబోతున్నది.

అదే స్లోగన్ ‘హమారా బజాజ్’. అయితే అడ్వర్టయిజ్ మెంట్ జింగిల్ ఎలా ఉంటుందో తెలియదు.

ఒకపుడు,  దూరదర్శ న్ స్వర్ణ యుగంలో దేశ ప్రజలంతా క్రమం తప్పకుండా చూడటమే కాదు, స్కూటర్ కొనాలనే తమ  కలలను ఈ అడ్వర్టయిజ్ మెంట్లలో చూసుకునే వాళ్లు.

పటిష్టమయిన భారతదేశం, పటిష్టమయిన వాహనమంటూ జాతీయ భావం జోడించిన ‘హమారా బజాజ్ ’జింగిల్ చాలా ఉల్లాసంగా,ఆహ్లాదకరంగా,ప్రశాంతంగా, జీవితంలో బజాజ్ చేతక్ వోనర్ కావాలన్న ఒక కలని మొలకెత్తిస్తూ  టివిసెట్లలో మారుమ్రోగేది.

ఆరోజుల్లో చేతక్ నడిపినవాళ్లందరికి అదొక అద్భుతమయిన అనుభవం.

బజాజ్ చేతక్ డ్రీమ్ ఇండియన్ వివాహ సంస్క‌‌ృ తిలో భాగమయిపోయిందని కూడా చెబుతారు. బజాజ్ చేతక్ అంత సులభంగా దొరికేది కాదు. బుక్ చేసుకున్న రెండు మూడేళ్ల దాకా డెలివరీ అయ్యేది కాదు. బ్లాక్ లో కూడా అమ్మేవాళ్లని చెబుతారు.చాలా చోట్ల పెళ్లికొడులు కట్నం కింద బజాజ్ చేతక్ కావాలని మారాము చేసే వాళ్లు. కట్నం కింద బజాజ్ స్కూటర్ ఇవ్వడం అల్లుడికి  అత్తగారిచ్చే ప్రాముఖ్యాన్ని చెప్పేది.  అంతేకాదు, బజాజ్ డెలివరీ డేట్ కు తగ్గట్టుగా ముహూర్తాలు కూడా పెట్టుకునే  వాళ్లు.

ఉద్యోగంలో చేరిన ప్రతి యువకుడికి చేతక్ కొనడం కలగా ఉండేది. కన్నులకు ఇంపుగా, మనుసుకు దృఢంగా, డ్రైవింగ్ కు తేలికగా ఉండే బజాజ్ చేతక్ సర్వకాల సర్వావస్థల వెహికిల్.

ఒక సారి కొంటే రిపేర్లు, మెయింటెన్స్ గురించి మర్చిపోవచ్చు. చెడిపోవడం అనేది అరుదాతి అరుదు.

కార్లింకా వూపందుకోని ఆ రోజులలో బెస్ట్ ఫామిలీ వెహికిల్ చేతకే.

లగేజీ కూడా ఈజీగా తీసుకుపోయే వీలున్నందున చేతక్ బెస్ట్ గూడ్స్ కారియర్ కూడా అయింది. కూరగాయల మార్కెట్లనుంచి పొలాలనూర్పిళ్ల కుప్పలదాకా చేతక్ తిరుగుతూ కనిపించేది.

 చేతక్ సులభంగా గుట్ట లెక్కుతుంది, గుంతల్లో దిగుతుంది,గతుకుల మీద హాయిగా తీసుకువెళ్లుంది. అసలు  మిడిల్ క్లాస్ జీవితాలకు ఒక యుద్ధట్యాంక్ లాగా  సేవ లందించిన వెహికిల్ బజాజ్ చేతక్.

ఇలాంటి బజాజ్ చేతక్ కు కూడా కష్టాలొచ్చాయి. పోటీ ప్రపంచం ఒడిదుడుకులను తట్టుకోలేక పోయింది. 1980 దశకాన్ని చక్రవర్తిలాగా ఏలి ఎన్నియుద్ధాలలోనో అజేయంగా నిలిచిన చేతక్, 1990 దశకంలో ఎదురయిన సవాళ్లకు తట్టుకోలేక పోయింది.

1990 దశకంలో మోటార్ సైకిల్ కల్చర్ ఇండియా మీద దాడి చేసింది.లెక్కలేనన్ని రకాల జాపనీస్ మోటార్ సైకిళ్లు ఇండియాలోప్రవేశించాయి.

ప్రశాతంగా, ఒడిదుడుకులు లేని చేతక్ ప్రయాణం కంటే, రఫ్ అండ్ టప్ జర్నీలకు ప్రాముఖ్యం ఇచ్చే కొత్త యువతరం స్కూటర్ నుంచి దూరం జరిగింది.

జీవితంలో వేగానికి ఎనలేని ప్రాముఖ్యం వచ్చింది. సాంకేతిక మార్పులు పెరిగి జీవితంలో స్పీడు పెరిగింది. యువకుల్లో హీరోయిజం టెండెన్సీ పెరిగింది.ఈ స్పీడ్ జీవితానికి చేతక్ తట్టుకోలేక చతికిల పడింది.   ఉమ్మడి కుటుంబాలు చితికిపోయి న్యూక్లియర్ ఫామిలీలు రావడం, యువకులు ఉద్యోగాలకోసం సూదూరం ప్రాంతాలకు ప్రయాణించి ఒంటరిగా జీవించడం పెరిగింది.

ఇలాంటపుడు పాత ఫామిలీ టైప్ వెహికిల్ తో జీవితం పొసగడం కష్టం. స్పీడందుకోవాలి.  జీవితానికి స్పీడ్ అందించే మోటార్ సైకిళ్లను యువకులు ఆరాధించడం మొదలుపెట్టారు.

ఈ మార్పును తట్టుకునేందుకు స్కూటర్ కూడా ఆటోమేటిక్ గా మారి మార్కెట్లో నిలబడే ప్రయత్నం చేసింది. స్కూటర్  పరిణామ కష్టాలనుంచి  వచ్చిన మార్పుకు కైనెటిక్ హోండా సాక్ష్యం. చేతక్ ఇచ్చే సౌకర్యం తో పాటు మోటార్ సైకిల్ లక్షణాలను కూడా ఆపాదించుకుని కైనెటిక్ హోండా రంగ ప్రవేశం చేసింది.

తర్వాత ఇదే తరహాలో మరికొన్ని వాహనాలు వచ్చాయి. ఈ ఆటోమేటిక్ స్కూటర్ల రాకతో ఉద్యోగిణులవుతున్న  మహిళలు అటువైపు వెళ్లిపోయారు.

ఫామిలీ విఛ్చిన్నం కావడం, యువతీయువకులు తమ తమ అభిరుచులకు తగ్గట్టుగా కొత్త వాహానాలకు వలసపోవడంతో చేతక్ బలహీనపడింది. దానికి తోడు చేతక్ డిజైన్ కూడ పాతచింతకాయ పచ్చడి లాగా అలాగే ఉండిపోయింది,అంబాసిడర్ కార్ లాగా.

స్జైలిష్  జనం చేతక్ ను నడిపించలేని పరిస్థితి వచ్చింది. బజాజ్ గ్రూప్  కూడా చేతక్ ను కొత్త స్టైల్ కు   మార్చలేని,పాతరకం  తయారుచేయలేని స్థితికి వచ్చింది.

దీనితో 2005 డిసెంబర్ బజాజ్ చేతక్ ప్రొడక్షన్ ఆపేసింది. ఇలా ముగిసింది చేతక్ గత జన్మ.

అయితే, ఇపుడు మళ్లీ చేతక్ పునర్జన్మ ఎత్తుతూ ఉంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రకటించింది. పుణే కేంద్రంగా పని చేసే ఈ సంస్థ దేశంలో రెండో పెద్ద ఆటోతయారీదారని తెలుసుగా.

దాదాపు ఒకటిన్న దశాబ్దం తర్వాత ఇపుడు బజాజ్ చేతక్ ను ఎలెక్ట్రిక్ వాహనంగా విడుదల చేయబోతున్నది.

అయితే, ఎలెక్ట్రిక్ చేతక్ ఎలా ఉంటుంది,ధర ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ గోప్యం దాచింది.

కాకపోతే, ఇది రెండు రకాలలో వస్తుంది.ఒక రకం వేగం గంటకు 85 కిమీ ఉంటే, రెండో రకం వేగం 95 కిమీ వుంటుంది.

భారత దేశంలో ఎలెక్ట్రికల్ స్కూటర్లకు, త్రి చక్ర వాహానాలకు ఇంకా మంచిఫ్యూచర్ ఉందనే కంపెనీ సిఎండి రవి బజాజ్ చెప్పారు.

‘ మనం ఏదైనా చేయాలనుకుంటే ఫస్టే చేయాలి, రెండో స్థానంలోనో మూడో స్థానంలోనో వస్తే లాభం లేదు. మార్కెట్లోకి అందరి కంటే ముందే ప్రవేశించాలనేది మా ధ్యేయం,” ఆయన చెప్పారు.

వచ్చే జనవరి నుంచి ఎలెక్ట్రిక్ స్కూటర్లను పుణే లో ప్రారంభించాలనుకుంటున్నారు.

తర్వాత బెంగుళూరు మార్కెట్లోప్రవేశిస్తారు.

ఇంతకీ చేతక్ ఎలా ఇండియాలో ప్రవేశించిందోతెలుసా?

టూవీలర్ల డిజైన్లలో ఇటలీది పెట్టింది పేరు. ఇటాలియన్ కంపెనీ పియాహియో (Piaggio) 1940 ప్రాంతంలో వెస్పా స్కూటర్ ను తయారుచేసింది.

వెస్సా ఇన్  స్టంట్ హిట్ టూవీలర్ ప్రపంచాధినేత అయింది. వెస్సాక్రేజ్ ఎలాంటిదో ‘రోమన్ హాలిడే’ హాలివుడ్ మూవీ లో  చూడవచ్చు. అందులో ఒక వెస్సారైడ్ సీన్ ఆ స్కూటర్ ను ప్రపంచమంతా  డ్రీమ్ వెహికిల్ చేసింది.

వెస్పాలో వెస్పా స్ప్రింట్ అనేది ఒక వేరియాంట్.

ఇది మార్కెట్ ని దున్నేస్తున్నపుడు బజాబ్ గ్రూప్ కంట పడింది. చాలా స్టైలిష్ గా ఉంటూ ఇటాలియన్ దర్జాకు ప్రతీకగా నిలిచిన స్ప్రింట్ వెస్టు మనసుదోచుకుంటే, దీన్ని ఇండియన్ సింప్లిసిటీకి కుదించి, ఎలాంటి హంగులు లేకుండా, దర్పంగా, ధరలో తేలికగా ఉండే చేతక్ గా మార్చేసింది బజాజ్ ఆటో. పియాహియోనుంచి బజాజ్ వెస్సా లైసెన్స్ కొనింది. చేతక్ పేరుతోమొదటి బ్యాచ్ స్కూటర్లు 1972లో మార్కెట్ లోకి వచ్చాయి. అపుడు మార్కెట్ లో ఉన్న మోటార్ సైకిళ్ల కంటే సులభంగా, సౌకర్యవంతంగా నడిపేందుకు వీలుగా తయారవడం మంచి మైలేజీ కూడా వుండటంతో చేతక్ చాలా తొందరగా సూపర్ హిట్ అయింది.

దేశమంతా చేతక్  మీద పడటంతో చివరకు కొనేందుకు సంవత్సరాల తరబడి వెహికిల్ డెలివరీ కోసం వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.