ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరించాలని వైఎస్ ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు,రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఎయిర్ ఇండియా సీఎండీ స్పందించారు.
ఈ మేరకు ఆయన ఎంపికి ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు.
ఈ మధ్య ఎయిర్ఇండియాతో ప్రయివేటు విమానసర్వీసుల వారు కూడా ఆంధ్రలో బుకింగ్స్ నిలిపివేశారు.
ఎయిర్ ఇండియా జూలై లో బుకింగ్ నిలిపివేసింది. ‘‘ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ అలయెన్స్ ఇటీవల విశాఖపట్నం-విజయవాడ-తిరుపతి విమానాన్ని రద్దు చేసింది. విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు ఎయిర్ఇండియా చైర్మన్‌ను కలిసి విన్నవించినా ఆ సర్వీసును పునరుద్ధరించలేదు.
విశాఖ నుంచి కొచ్చిన్ వెళ్లే సర్వీసును కూడా ఇటీవల రద్దు చేశారు. తాజాగా స్పైస్‌జెట్ కోల్‌కతా విమానాన్ని వెనక్కి తీసుకుంది. బెంగళూరుకు నడిపే రెండు విమానాలను ఇండిగో రద్దు చేసింది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభంతో ఢిల్లీకి, ఆర్థిక రాజధాని ముంబై సర్వీసులు ఆగిపోయాయి. హైదరాబాద్, చెన్నైలకు ఆగస్టులో సర్వీసులు నడపడం లేదని ఇండిగో ప్రకటించింది. కొలంబో విమానం లాభదాయకంగా లేదని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది,’ అని ఆంధ్రజ్యోతి రాసింది.
ఎయిర్ ఇండియా నిర్ణయం విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూండటంతో విజయసాయి రెడ్డి ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో సమావేశమయ్యారు.
రద్దు చేసిన విమాన సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంతోపాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య డైలీ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా విజయసాయి రెడ్డి కోరారు.
ఆ లేఖకు లొహానీ స్పందిస్తూ జవాబు రాశారు.
‘‘ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపుతారు,’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించడం పట్ల విజయసాయి రెడ్డి హర్షం ప్రకటిస్తూ ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ధన్యవాదాలు తెలిపారు.