రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇసుక కొరతను కావాలనే సృష్టించిందని నిరసన తెలుపుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతల హౌస్ అరెస్టులకు రంగం సిద్ధం చేశారు.
ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధియక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులుహౌస్ అరెస్ట్ చేశారు.
కొల్లు రవీంద్ర ఇంటికి భారీగా పోలీసు బలగాలు తరలించారు.
కోనేరుసెంటరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరసన దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి వెళ్ళనీయకుండా ముందుగానే అర్జునుడును హౌస్ అరెస్ట్ చేశారు.
ముఖ్య టీడీపీ నేతలను ఒకొక్కరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష నేపథ్యంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు.
ఇది ఇలా ఉంటే తన 36గంటల నిరవధిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికులను కోరుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కరపత్రాలు పంపిణీ చేశారు.
ఉద్రిక్తత ఉత్కంఠ
మరో వైపు ఇసుక కొరతను నిరసిస్తూ కోనేరుసెంటరు వేదికగా ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష
ఇందుకు కౌంటర్ గా కొల్లు దీక్షా శిబిరం ఎదుటే ప్రతిపక్ష టీడీపీ తీరును నిరసిస్తూ తాము నిరసన తెలుపుతామని ప్రకటించిన అధికార వైసీపీ నేతలు
ఇదీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నెలకొన్న తాజా పరిస్థితులు
శుక్రవారం జరగబోయే డీఆర్సీ సమావేశానికి అధికారగణమంతా వస్తున్న నేపథ్యంలో 36 గంటల నిరవధిక దీక్షకు మాజీ మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు.
ఇందుకు ప్రతిగా అధికార పక్షం కొల్లు రవీంద్ర నిరవధిక దీక్షకు వ్యతిరేకంగా తామూ నిరసన తెలుపుతామని వైసీపీ నేతలు ప్రకటించటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కటంతో పాటు పోలీసులకు శాంతి భద్రతల సమస్య పుట్టుకొచ్చింది.
మచిలీపట్నంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు గాను ఇరుపక్షాల నిరసనలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. పోలీస్ యాక్ట్ 30ని అమలులోకి తెచ్చారు. ఈ నెల 14వ తేదీ వరకు పోలీస్ యాక్ట్-30 అమలులో ఉంటుందని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక నిరసన దీక్ష చేస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ రవీంద్ర పోలీసులను కాదని నిరసన దీక్షకు బయలుదేరితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇరుపక్షాల నిరసనలకు పిలుపునివ్వడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠత నగరవాసుల్లో నెలకొంది.( ఫోటో. తన దీక్షకు సహకరించాలని నిర్మాణ కార్మికులకు కరపత్రాలు పంచుతున్న కొల్లు రవీంద్ర)