ఇడి అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ , దీని గొప్పతనం ఇదే….

ఇ.డి (ED :Enforcement Dirctorate) అనే రెండక్షరాల మాట వింటే దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్ కు, విదేశాలలో బిజినెస్ లున్న రాజకీయ నాయకులకు హడల్.
ఎవరైనా ఇడి కంటపడితే వాళ్లకి నిద్ర కరువవుతుంది. పీడ కలలొస్తాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది.క్రుంగి కృశించిపోతారు.
ఇడి పగ బడితే తప్పించుకోవడం కష్టం. అందుకే ఇడి కేసులనో, ఇడి దాడి అనో, ఇడి ఎటాచ్ మెంట్ అనో ఇడి అరెస్టు అనో వార్తలొచ్చినపుడు అవన్నీ సెన్సేషనల్ వార్తలే.
న్యూస్ పేపర్లలో అయితే ఫ్రంటు పేజీలో వస్తాయి.టివిల్లో నయితే బ్రేకింగ్ బ్రేకింగ్ అంటూ ఢంకా బజాయిస్తూ, యాంకర్ సత్తా నంతా కూడదీసుకుని ఇడి దాడి వార్త చదువుతుంది.
పాతఫోటోలు, కొత్త ఫోటోలు అన్ని కలిపి టివిచానెళ్ల వాళ్లు భూకంపం సృష్టిస్తారు.
ఇడివిచారణ మొదలయిందంటే ఇక  మనీ లాండరింగ్ అంతు తేల్చేస్తుందని అంతా అను కుంటారు. అక్రమంగా డబ్బు ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించే వాళ్లకి జైలు శిక్షే ఇక  అని అనుకుంటారు.అవునా?
తుస్సు…
ఇడికంత చరిత్రేమీ లేదు.ఇడి అనబడే ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్  విదేశీ మారక ద్రవ్య నియాలను ఉల్లంఘించిన వారందరిని జైలుకు పంపేటంత సీన్ లేదు.
వీళ్ల విచారణలకంటే మన వీధిచివర్లో ఉండే పోలీస్టేషన్ల కాన్ స్టేబుళ్ల విచారణలు మేలు అనిపిస్తుంది.
ఇడి కేసులో కోర్టులో ఇరుక్కుపోవడమయితేనేం,రాజకీయ వత్తిళ్లయితేనేం, తగినంత మంది సిబ్బంది లేకపోవడమయితేనేం, ఇడి విచారణలు ముగిసి జైలు పోతున్న వారి సంఖ్య చాలా చాలా చాాలా తక్కువ. కాకపోతే, విచారణ సమయంలో మాత్రం నిందితుడు జైలుకెళ్లేలా ఇడి జాగ్రత్త తీసుకుంటుంది.
ఇడి కేసులు, దాడులు, రిమాండులు,విచారణలు నిజమని ప్రూవ్ అయి శిక్షపడిన వాళ్లు ‘అరుదాతి అరుదు’ అనుకోవాలి.
ఇడి విచారణ కొచ్చే కేసులన్నీ మామూలివికాదు,దేశాన్ని కుదిపేసిన కుంభకోణాలు. మాజీ ఆర్థిక  మంత్రి పి చిదంబరం మీద ఉన్న INX మీడియా కేసు, నీరవ్ మోదీల చేతిలో కుదేలయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులు,రాఫేల్ డీల్ వంటి కేసులు ఇడి పరిధలో ఉన్నాయి.
అయితే 2005 నుంచి ఇప్పటి దాకా ఇడి జరిపిన విచారణలో శిక్ష పడిన కేసులు కేవలం 13 మాత్రమే. అక్షరాల పదమూడు మాత్రమేనని రీడిఫ్.కామ్  రిపోర్టు చేసింది..
ఇడి పరిధిలోకి రెండు చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన కేసులొస్తాయి. అవి ఫారిన్ ఎక్చేంజ్ మేనేమ్ మెంట్ యాక్ట్ 1999 (FEMA), ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002(PMLA).
2005లో ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పటినుంచి, ఇప్పటిదాకా 2000 లకు పైబడి మనీ లాండరింగ్ కేసులు, 12,000 లకు పైబడి విదేశీ మారక ద్రవ్య నియమాలను ఉల్లంఘించిన కేసులు విచారణ కొచ్చాయి.
ఇడి పరిధిలోకి వచ్చి హైప్రొఫైల్ కేసులేవో మచ్చునకు కొన్ని  చూడండి: స్టెర్లింగ్ బయోటెక్ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసు (సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ ఆయన కొడుకు , అల్లుడుల మీద విచారణ), అగస్టా వెస్ట్ లాండ్ , రాఫేల్ ఒప్పందాలు, కర్నాటక రాజకీయ నాయకుడు డికె శివకుమార్ మీద వచ్చిన అక్రమార్జన కేసులు, వీడియో కాన్ కంపెనీకి ICICI బ్యాంకు ఇచ్చిన రుణాల కేసుల, పంజాబ్ నేషనల్ బ్యాంకున ముంచిన కేసులు, ఫారూక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా బుక్ అయిన జమ్ము కాశ్మీర్ క్రికెట్ అసోషియేషన్ కేసు, ఇపుడు చిదంబరానికి వ్యతిరేకంగా బుక్ అయిన INX మీడియా కేసులు.
ఈ హై ప్రొఫెల్ విచారణలకు తగ్గట్టు కేసులు రుజువయి శిక్షలు పడటంలేదన్నది చాలా ఆశ్చర్యకరమయిన విషయం.
చాలా సార్లు నిందితులు కేసులకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించడం,విచారణ సంవత్సరాల తరబడి సాగడం వల్ల శిక్షలు పడటం లేదని ఇన్ సైడర్స్ చెబుతారు.
ఇడి కేసులలో PMLA లోని 19 సెక్షన్ కింద నిందితుడికి కేసు రుజువయితే పదేళ్ల దాకా శిక్ష పడాలి.
అంతేకాదు, దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా వంటి నిందితులు భరతం పట్టేందుకు ఫ్యుజిటివ్ ఎకనమిక్ ఆఫెండర్స్ యాక్ట్ (Fugitive Economic Offender Act) కూడా ఇడి చేతిలో ఉన్న ఒక మాంచి ఆయుధం. వీటన్నింటిని ప్రయోగించి నిందితుల ఆస్తులను ఇడి ఎటాచ్ చేస్తుంది.
పెమా కింద బుక్ అయిన 12వేల కేసులలో సగం ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. దేశ ప్రతిష్టకు సంబంధించిన కొన్ని వేల కేసులును బుక్ చేసినా , ఇడి దగ్గిర ఉండే స్టాప్ మాత్రం 2 వేల మందే. దేశంలో ఇడి కి 49 ఆఫీసులున్నాయి. సిబిఐ తో పోలిస్తే ఇవి సగానికి సగమే.