*ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక *నంద్యాల లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో భారీ ర్యాలీ*
జాతీయ జెండాను ఎగురవేసి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి అక్టోబరు1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుపుకున్న నాయకులు
నంద్యాలలో మంగళవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో ఘనంగా అక్టోబరు1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది.
శ్రీనివాస నగర్ లోని వివేకానంద ఆడిటోరియం నుంచి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో రైతులు, న్యాయవాదులు, విద్యార్థులు, యువకులు,వివిధ ప్రజాసంఘాల నాయకులు ర్యాలీ గా బయలుదేరి సంజీవనగర్ జంక్షన్ కు చేరుకున్నారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విహ్రహానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ …
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1,1953 సాధించుకున్న విషయం విదితమే అన్నారు. భారతదేశంలో ప్రప్రధమంగా భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది నాంది పలికిందని అన్నారు.
తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాలు కొనసాగిందననీ, అనంతరం నవంబర్ 1, 1956 న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలవడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ఆన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2014 లో విడిపోవడంతో 1953 లో సాధించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నదని వివరించారు.
ఈ నేపద్యంలోనే నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న జరుపుకుంటున్నామని వివరించారు. శ్రీబాగ్ ఒడంబడిక నేపద్యంలో మరియు శ్రీ పొట్టి శ్రీరాముల ఆత్మ త్యాగ ఫలితం తో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరి కర్యవ్యమని వివరించారు.
గత ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష ల పేరుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమును అధికారికంగా నిర్వహించకుండా చేసిందని అన్నారు.
ప్రస్తుత Y.S.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను అక్టోబరు1 న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
శ్రీభాగ్ ఒడంబడికలో కృష్ణా, తుంగభద్ర నదుల నీరు పూర్తిగా రాయలసీమ అవసరాలకే కేటాయించి , తదనంతరం దిగువకు విడుదల చేయాలని , హైకోర్టు లేదా రాజధాని రాయలసీమ లో ఏర్పాటు చేయాలని, కోస్తాంధ్ర ప్రాంతంతో సమాన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో ఏర్పాటు చేయ్యాలని స్పష్టంగా వుందన్నారు.
అందులో భాగంగానే మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని కేటాయించి, గుంటూరు లో హైకోర్టు ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. ఐతే … తెలివిగా కోస్తాంధ్ర నాయకులు శ్రీభాగ్ ఒప్పందం అమలు పరచలేదనీ, దీంతో రాయలసీమ అన్ని రంగాలలో వెనుకబడినదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ కు కేవలం ముఖ్యమంత్రి పదవి అప్పగించి నిధులు, నీళ్ళు, నియామకాలలో ఆనాటి నుండి నేటి వరకు అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.
రాయలసీమ మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు సమైక్యంగా ఉద్యమ బాట పట్టి శ్రీభాగ్ ఒప్పంద అమలును జరిగేలా పోరాడదామని పిలుపునిచ్చారు.
జీవో నెంబరు 69 ని 1996 లో చేసి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను బార్లా తెరిచి రిజర్వాయర్ డెడ్ స్టోరేజి నీటిని కూడా కోస్తాకు తరిలించారన్నారు. ఈ జీవో వచ్చిన నాటి నుండి నేటి వరకు 23 సంవత్సరాలలో రాయలసీమ 5 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన నష్ట పోయిందని వివరించారు.
ఈ వ్యవసాయ ఉత్పాదన జరగనందువలన దీనిపై ఆధారపడే పరిశ్రమలు రాయలసీమ లో ఏర్పాటు జరగలేదు అన్నారు. ఈ పరిశ్రమలు రాకపోవడం వలన రాయలసీమ 10 లక్షల కోట్ల వ్యాపారం నష్టపోయిందని, ఈ పరిశ్రమలు, వ్యాపారులు లేకపోవడం వలన సుమారు 8 లక్షల మంది యువతకు రాయలసీమకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు .
ఈ విధంగా ప్రభుత్వాలు రాయలసీమ యువతకు, విద్యార్థులు, రైతులకు తీరని ద్రోహం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం రాయలసీమ నాలుగు జిల్లాలను బలి పశువుగా చేసిన పాలకుల వైఖరిని ఆయన తప్పుపట్టారు.
రాయలసీమ లో కరువు నెలకొని త్రాగునీటి కి కటకటా ఏర్పడ్డా శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువన నాగార్జున సాగర్ కు అక్కడి నుండి ప్రకాశం బ్యారేజి కి నీటిని తరలించి మూడు పంటలు సాగుచేసుకుని చేపల చెరువుల అభివృద్ధి చేసుకొని మిగిలిన నీటిని బంగాళాఖాతం లోకి వదిలారేగానీ రాయలసీమ కరువు పట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు 1300 టిఎంసీలు, తుంగభద్ర డాంకు 300 టిఎంసీల నీరు చేరిన రాయలసీమలోని 60 శాతం రిజర్వాయర్లు కాలిగనే ఉన్నారని బాధను వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సముద్రం లోకి సుమారు 600 TMC ల పైగా నీరు సముద్రం పాలైందని అన్నారు.
రాయలసీమ లోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగక ప్రాజెక్టులు పూర్తి గాక వరదలు వచ్చినా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర విభజనలో వెనుకబడ్డ రాయలసీమ కు కేటాయిస్తామన్న నిధులు ,నియామకాలు, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధి తో పనిచేయడం లేదని ఆయన నిలదీశారు.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని రాయలసీమ ప్రజలు ముఖ్యంగా మేధావులు, విద్యార్థులు, యువకులు , రైతులు గుర్తించారనీ ఉద్యమబాటలో పయనిస్తున్నారనీ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరా నాగరాజ రావు, రామసుబ్బయ్య, లక్మీదేవి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు Y.N.రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, రామచంద్రారెడ్డి, ఆల్ మదాడ్ ఫౌండేషన్ అధ్యక్షులు రహీం,రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు ప్రదీప్ రెడ్డి, రషీద్ , నందిరైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, BJP మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ముక్తార్ భాష, చాణుక్యరాజ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు గాలి రవిరాజ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.