గుత్తి కోట పరిరక్షణ మరియు సంరక్షణ సమితిలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమము గుత్తి కోట వైపు ప్రతి గుత్తి పౌరుడు అడుగులు వేసే విధం ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు నిన్న ముగిశాయి.
అనంతపురం జిల్లా గుత్తి కోట ను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని యెన్నో సంవత్సరాలుగా గుత్తి పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు , విద్యాసంస్థలు , ఉపాధ్యాయసంఘాలు , జనవిజ్ఞాన వేదిక, భాస్కర్ రూరల్ డేవలెప్మెంట్ సొసైటీ లు పాటో ఇంకా ఎందరో ఉద్యమాలు చేశాయి.అయినా సరే ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి.
జాతీయ రాహదారి మీద ఉన్నఈ కోటను చేరుకోవడం అన్ని రాష్ట్రాల ప్రజలు చాలా సులభం. గుత్తి రైల్వే జంక్షన్ కూడా. ఇంత ప్రయాణ వసతి ఉన్న గుత్తిని భారతీయ టూరిజం లో భాగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్రం గాని శ్రద్ధ చూపలేదు.
గుత్తి కోట ప్రాముఖ్యాన్ని, దానిని ఒక టూరిజం స్పాట్ గా డెవెలప్ చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి మరొక సారి తీసుకువచ్చేందుకు నిన్న ఇక్కడ ప్రపంచ పర్యాటక దినం వేడుకల్ని 2 సమితిలు కలసి ఒక ఉత్సవ సమితి గా ఏర్పాటు చేసుకొని జరిపించాయి.
ఈ వేడుకల్లో కొన్ని వాస్తావాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛంద సంస్థలు ఎన్ని పోరాటాలు చేసిన , సోషల్ మీడియాలో ప్రచారం చేసిన , ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా గుత్తి కోటలో 27 న జరుగుతున్న ముగింపు ఉత్సవాలను ఘనంగా చేద్దామంటూ గొంతు చించుకొని అరిచినా గుత్తి లో ఉన్న కుల సంఘాలు , వ్యాపారులు , గుత్తి లోని అన్ని వర్గాల ప్రజలు హాజరు కాలేదు.
గుత్తి పట్టణంలోని కొన్ని విద్యాసంస్థల విద్యార్థులు మాత్రమే హాజరుకావడం జరిగింది. పట్టణ వాసుల నిర్లిప్తత బాాగా కొట్టొచ్చినట్లు కనిపించింది.
పోయిన ప్రభుత్వాలు అనంతపురం జిల్లాలోని పెనుగొండ , లేపాక్షి , తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఉత్సవాలను అధికారికంగా జరిపించడం జరిగింది. కాని, పురాతన గుత్తి కోట కు ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు.
కోట అభివృద్ధి అనేది ప్రభుత్వ ఆలోచనల్లో ఉందా లేదా, గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందా లేదా అన్న విషయాలు తెలుసుకోవాలని గుత్తి ప్రజలు ఆశిస్తున్నారు.
పురాతత్వ శాఖ , టూరిజం శాఖ ఒక అధికారిక కరపత్రాన్ని గుత్తి కోట ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రచురించాలి.
అంతేకాదు, కోట అభివృద్ధి కి వివిధ శాఖల నుండి ఎంత మొత్తం వచ్చింది . వాటిని వేటికీ వెచ్చించారు , ఇంకా ఇప్పుడు వేటి కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు, అసలు చేసారా లేదా అన్న నిజాన్ని గుత్తి ప్రజలకు అంతుపట్టని విషయంగా ఉంది.
గుత్తి కోటకు యెన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. 10 సంవత్సరాల క్రితం ఉన్న గుత్తి కోటకు ఇప్పుడు చూస్తున్న గుత్తి కోట కు చాలా తేడా ఉంది. ఈ మధ్య కాలంలో గుప్త నిధుల వేటగాళ్ళు తాకిడి ఎక్కువైంది. దీనితో కోట దెబ్బ తింటూ ఉంది.
ఇలాంటి దాడులతో తన వైభవాన్ని కోల్పోయిన కోట సంరక్షణ కొరకు ఇంకా ఎక్కువ సిబ్బంది కావాలి. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి.
ప్రతి దినము కోట పై భాగము వరకు వెళ్లి పురాతన కట్టడాలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని సంరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలి.
గుత్తి కోట టూరిజం పెరిగితే, గుత్తి అభివృద్ధి అవుతుంది.గుత్తి ఎకానమీ బాగుపడుతుంది. ఇక్కడి వ్యాపారాలు కూడా పెరుగుతాయి. అందువల్ల గుత్తి కోట అభివృద్ధి అంటే స్థానిక ప్రజల అభివృద్ధే. ఈ విషయాన్ని గుర్తుంచుకుని గుత్తి ప్రజలు , స్వచ్ఛంద సంస్థలు , అన్ని శాఖల అధికారులు గుత్తి కోటను కాపాడుకునేందుకు ఎవరికి వారు గట్టిగా ప్రయత్నాలు చేయాలి.
-విజయభాస్కర చౌదరి, అధ్యక్షుడు, గుత్తి కోట సంరక్షణ సమితి
గుత్తి కొట పూర్వ చరిత్ర
“గుత్తికోటకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. కాలం పుటలను వెనుక్కు తిప్పితే మెరిసిపోయే గాథలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండువేల ఐదు నుంచి తొమ్మిది వందల వరకు గుత్తి దుర్గంలో జన నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
“రాతి యుగం అవశేషాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డాయి. అలనాటి మనుషులు నివాసం ఉన్న గృహాలను బ్రిన్ పూల్ అనే బ్రిటిష్ వ్యక్తి బహిరంగ పరిచాడు. అనాటి పనిముట్లు శిథిలాలు ఉరవకొండ మండలంలోని లత్తవరం, విడపనకల్లు మండలంలోని కరకముక్కల ప్రాంతాల్లో కూడా బయటపడ్డాయి. క్రీ.పూ.260 నుంచి మాత్రం దీని విశేషాలు క్రమ పద్దతిలో వెలుగులోకి వచ్చాయి.
“ఈ ప్రాంతాన్ని క్రీ.పూ.220 నుంచి 200 వరకు శాతవాహనులు పాలించినట్లు తెలుస్తోంది. అనంతరం బాదామి చాళుక్కులు, రాష్ట్ర కూటములు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు. కాగా కోట గోడను 11,12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది. కోటలో కనిపించే సంస్కృత శ్లోకాన్ని బట్టి హరిహర బుక్కరాయలు గుత్తిని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తోంది.
“బుక్కరాయల కాలంలోనే కోట శంకాకృతిని సంతరించుకుందని తెలుస్తోంది. విజయనగర రాజుల హయాంలో కోటతో గొప్ప వెలుగు పొందింది. నరసింహరాయులు హయాం నుంచి వారి స్వాధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగర పాలకుల చిహ్నమైన గజలక్ష్మి చిత్రం అన్ని ద్వారాలపై ప్రముఖంగా కనిపిస్తుంది.
“రాయల మరణాంతరం వారసత్వ తగాదాల వివాదంలో గుత్తి కోటకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పాజిగా ప్రసిద్ధుడైన తిమ్మరుసులు తమ బాల్యాన్ని గుత్తిలో గడిపినట్లు ఆధారాలు ఉన్నాయి. విజయనగరరాజుల వివాదంలో సామ్రాజ్యానికి వారసులైన సదాశివరాయలను మంత్రి శలకం తిమ్మయ్య కుట్ర చేసి ఈ కోటలోనే బంధించాడు. తరువాత రామ రాయలులు గుత్తిపై దండెత్తి వచ్చి సదాశివరాయులను విడిపించాడు.
“విజయనగర సామ్రాజ్య పతనానంతరం బిజాపూర్ నవాబులు పాలించారు. క్రీ.పూ.1650 ప్రాంతంలో నల్గొండ నవాబులు కుతుబ్ షాహి అధికారులైన మీర్ జుంబ్లా అనేక నెలలు ముట్టడి తరువాత కోటను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఔరంగజేబు దాడుల్లో గుత్తి మొగలాయిల వశమైంది. క్రీ.పూ.1750 ప్రాంతంలో మరాఠీరాజు గుత్తిని స్వాధీనం చేసుకొన్నాడు.
“క్రీ.శ 1762లో హైదర్ ఆలీ గుత్తిపై దండెత్తి ఆరు నెలలు ముట్టడి సాగించినా గెలుపు పొందలేక వెనుదిరిగి మరో దండయాత్రలో స్వాధీనం చేసుకొన్నాడు. గుత్తి దుర్గానికి పేరు రావడం వెనుక అనేక కథలు ఉన్నాయి. సమీపంలో గౌరి గుట్టమీద గౌతమ మహర్షి తపస్సు చేసినందున గౌతమీపురంగా ఏర్పడి కాలక్రమేణా గుత్తిగా మారిందని ప్రజల నమ్మకం.
“కాగా 9,10 శతాబ్దాలలో నొలంబావడి అని పేరు ఉన్నట్లు హేమావతి, మడకశిర శాసనాలు తెలుపుతున్నాయి. కాగా గుత్తి దుర్గం పాలకులుగా ఉన్న మురాఠీరావు మనవడు వారి వారసుడైన ఘోర్పడే 1984లో గుత్తి దుర్గాన్ని సందర్శించాడు.” (Vedhikaa నుంచి)