సాలూరు రాజేశ్వరరావు పేరు విన్నారుగా… ఆయన గొప్ప సంగీత దర్శకుడు.
ఆయన సంగీతం ఎంత గొప్పగా రసభరితంగా ఉంటుందో చెప్పేందుకు ఆయన ఇంటిపేరును ‘రసాలూరు’ గా మార్చి రాసాలూరు రాజేశ్వరరావును చేశారు అభిమానులు.
ఆయన సినిమా జీవితం సంగీతంతో కాకుండా నటనతో మొదలయింది.
అయనకు శాస్త్రీయ సంగీతం బాగా తెలుసు, మంచి గాత్రమూ ఉంది. సోదరుడు హనమంతరావుతో కలసి వూరూర ప్రదర్శనలిస్తున్నారు. సాలూరు బ్రదర్స్ గా అలా మంచిపేరు తెచ్చుకున్నారు.
1935లో వేల్ పిక్చర్స్ వారు ‘శ్రీకృష్ణ లీలలు’ తీస్తున్నారు. వారికి అపుడు బాలకృష్ణుడు అవసరమయ్యాడు. రాజేశ్వరరావు వాళ్ల కంట పడ్డాడు. బాలకృష్ణుడి వేషం వేసి పద్యాలను తనకిష్టమొచ్చినట్లు పాడి అందరిని మెప్పించాడు. పద్యాలను నా ఇష్టమొచ్చినట్లు పాడతాననే షరతు మీద వేషం వేసేందుకు అంగీకరించాడని చెబుతారు. కుర్రవాడి ముచ్చటను దర్శకుడు గాలి పెంచెల నరసింహారావు ఒప్పకున్నారట.
తర్వాత ఆయనకు మాయాబజార్ (1935)లో అభిమన్యుడి వేషం, కీచక వధ (1937)లో ఉత్తరుడి వేషంవేసే అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాని కలకత్తాలో తీస్తున్నపుడు సాలూరుకు అక్కడి మ హాగాయకులు కుందన్ లాల్ సైగల్, పంకజ్ మల్లిక్ లను కలుసుకున్నారు. అంతేకాదు, హిందూస్తానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. తర్వాత సంగీత దర్శకుడయిన తర్వాత హిందూస్తానీ, కర్నాటక సంప్రదాయాలను కలిపి ఆయన ప్రయోగాలు చేసి చివరకు రాసాలూరు రాజేశ్వరరావు అయ్యారు.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే… ఇలాంటి రాజేశ్వర్ కు ఒక కోరిక ఉండింది. అదేమిటంటే, తనకొడుకుని ఐపిఎస్ ఆఫీసర్ని చేయాలని. అది నెరవేరలేదు. అయితే, ఆయన కుమారుడు తండ్రి కోరికను ఇపుడు మరొక విధంగా తీరుస్తున్నారు.
సాలూరు రాజేశ్వరావు కుమారుడెవరో తెలుసుగా. సంగీత దర్శకుడు కోటి. తండి నటుడిగా ప్రారంభించి సినీ సంగీతం వైపు వస్తే, కోటీ సంగీతదర్శకుడి జీవితం మొదలుపెట్టి నటుడిగా మారుతున్నారు. ఆయన ఒక చిత్రంలో ఐపిఎస్ ఆఫీషర్ వేషం వేస్తున్నారు. చిత్రం పేరు ‘దేవినేని’.
ఈచిత్రంలో ఆయన ఒకపుడు విజయవాడను గడగడలాడించిన ఐపిఎస్ అధికారి కెఎస్ వ్యాస్ వేషం వేస్తున్నారు. ఈ వేషం కోసం ఆయన పోలీసు అధికారి దుస్తులు ధరించారు. తన డ్రెస్ మీదతనకే ముచ్చటేసింది. పోలీసు యూనిఫాం వేసుకుని , టోపీ పెట్టుకుని… పోలీసుఅధికారి అవతారమెత్తడంతో ఇంటిల్లి పాది అవాక్కయ్యారు. సూపర్బ్ అన్నారు. అంతప్రశంసించారు.
అపుడు యాక్టర్ బెనర్జీ మొబైల్ తీపుకుని నాలుగు ఫోటో టపటప లాగించేశారు.
ఈ పాత్ర గురించి ఆయన ‘ద హిందూ’ కు చెబుతూ తండ్రి కల గురించి గుర్తు చేశారు. ‘ ఈ పాత్రను నేను ఎందుకు ఒప్పకున్నానంటే, మా నాన్నగారి కోరిక నాకు వెంటనే గుర్తుకొచ్చింది.నన్ను పోలీసాఫీసర్ గా చూడాలని ఆయనకు కోరిక. దీనికి సివిల్ సర్సీసెస్ కు ప్రిపేర్ కావాలి. అబ్బే మనకు చదవులు మీద ఆసక్తి లేదు. సివిల్ సర్వీసెస్ కాదు కదా, ఏదో సాకు చెప్పి ఉన్న పుస్తకాలు చదవగాన్ని ఎగ్గొట్టేందుకు చూసేవాడిని, స్నేహతులతో గడిపే వాడిని. మనకేదయిన ఇంటరెస్టు ఉందంటే అది మ్యూజికే. అందువల్ల ఇలా ఈ పోలీసధికారి వేషం వల్లనైనా మానాన్న కోరిక తీర్చవచ్చని అనుకున్నా’ అని ఆయన చెప్పారు.
ఇది కోటి మొదటి చిత్రం కాదు. గతంలో ఆయన ‘రాముడు అనుకోలేదు, జానకి కలగనలేదు’ అనే చిత్రంలో తండ్రి పాత్ర పోషించారు.
ఇక కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది… ఆయన దక్షిణాది భాషలలో దాదాపు 500 చిత్రాలకు సంగీతం కూర్చారు.