ట్యాంక్ బండ్ పక్కన నీరా రెస్టరంట్…మంచింగ్ తెలంగాణ రుచులు

రెండునెలల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మొట్టమొదటి తాటి నీరా (నీరా తాజాగా తీసిన ద్రవం, అది పులిస్తే కల్లు అవుతుంది ) దుకాణం రానుంది.
నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఈ నీరా స్టాల్‌ రాబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.
తెలంగాణ లో తాటి చెట్టు (Borassus Flabellifer) నుంచి నీరా తీస్తారు. కేరళ లో కొబ్బరి నీరా కు 2014లో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ గా గుర్తింపు నిచ్చారు.
ఇలాగే కర్నాటకలో కూడా నీరాను ఇదే మాదిరి విక్రయిస్తున్నారు. మొదట ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలకే దీనిని పరిమిత చేసి ఉన్నారు. 2017 డిసెంబర్ లో రాష్ట్రంలో ఎవరైనా నీరా గీయవచ్చని ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు.

2018 డిసెంబర్ లో తమిళనాడులో కూడా నీరా అందుబాటులోకి వచ్చింది. ఇదే బాటలో వెల్తూ తెలంగాణ కూడా క్రమంగా నీరా దుకాణాలను ప్రారంభించాలనుకుంటున్నది.
తాటి నుంచి కల్లు తీయడం చాలా పురాతనమయింది. నీరా కల్లు తాగడం ఈ లెక్క చాలా పురానతమయిన అలవాట్లు. తాటి చెట్టునుంచి బెల్లం తీసిన ప్రస్తావన గ్రీకు చరిత్రకారుడు మెగస్తీనీస్ రచనల్లో కూడా ఉంది. మెగస్తనీస్ క్రీ.పూ చంద్రగుప్తుని అస్తానంలో గ్రీకురాయబారి గా ఉండేవాడు. గాంధీ కూడా తాటి చెట్టును దారిద్ర్య నిర్మూలన మార్గం అన్నాడు.

https://trendingtelugunews.com/10-curious-facts-about-mahatma-gandhi-bapuji/

ఈ విషయాన్ని ఇపుడు రాష్ట్రాలు గుర్తించి తాటి నీరాను విక్రయించేందుకు అనుమతినిచ్చి చెట్టున్న వాళ్లకు అదనపు ఆదాయం వనరుగా మార్చాలనుకుంటున్నది.
కేరళలో ఈ పథకం బాగా విజయవంతమయింది. కొబ్బరిరైతులకు చెట్టుకు నెలకు రు. 1500 దాకా గిట్టుబాటవుతూ ఉంది. కొబ్బరిచెట్లున్న వారు ఇప్పటి దాకా కేవలం కొబ్బరి కాయలు అమ్మడం, కొబ్బరి నూనే తీయడం మీదనే ఆధారపడుతున్నారు.
నీరా ఇపుడు వారికి అదనం రాబడి వనరుగా మారింది. కేరళ ప్రభుత్వం కోకనట్ డెవెలప్ మెంట్ బోర్డుకు, కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీకి, స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కు , ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కు నీరా గిసే హక్కులిచ్చింది.
2014 లో మొదట పైలట్ ప్రాతిపదికన కొన్ని ఎంపిక చేసిన జిల్లాలో కేవలం 15 వందల చెట్లనుంచి నీరా గీసేందుకు అనుమతినిచ్చారు. నిజానికి కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ కాసర్ గోడ్, త్రిసూర్, తిరువనంతపురాలలో కేరళామృతమ్ పేరుతో పైలట్ ప్రాజక్టులను ప్రారంభించింది.
నీరాలో అనేక రకాలైన ఔషధ గుణాలున్నాయని చెబుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో తొలి నీరా  స్టాల్ ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి గౌడ్ చెప్పారు. భవిష్యత్‌లో అన్ని జిల్లాలకు షాపులను విస్తరించి పెద్ద పరిశ్రమగా చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
నీరా లైసైన్స్ ను కేవలం గౌడ కులస్థులకు మాత్రమే ఇస్తామని, నీరాను గీయడం, అమ్మడం వారు మాత్రమే చేయాలని సీఎం చాలా స్పష్టంగా చెప్పారని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం తరఫున నీరా స్టాల్ ఏర్పాటు చేయడమే కాకుండా రుచికరమైన తెలంగాణ వంటకాలతో ఒక రెస్టారెంట్‌ను కూడా పెట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
నీరాలో చాలా  ఔషధ గుణాలున్నాయని చెబుతూ షుగర్, మధుమేహం, క్యాన్సర్, లివర్, గుండె సంబంధిత వ్యాధుల రాకుండా నీరా సహకరిస్తుందని వీటిని చాలా పరిశోధనా సంస్థలు రుజువు చేశాయని  మంత్రి చెప్పారు.
తెలంగాణలో వందల ఏండ్లనుంచి నీరాను సేవిస్తున్నవిషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.