హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. సిటీ అంతా ట్రాఫిక్ జామ్.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా కురిసి ఈ రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది.
గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి దిల్ సుఖ్ నగర్ ,ఎల్ బినగర్  సహా చాలా చోట్ల భారీ వాన కురిసింది. ఈ వార్త రాస్తున్నప్పటికి ఇంకా బోరును కురుస్తూనే ఉంది.అనేక కీలకమయిన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
సుమారు రెండు గంటలకు పైగా వర్షం కురియడంతో  హైదరాబాద్ తడిసి ముద్దయింది.
రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల బైక్‌లు కొట్టుకుపోయాయి. మ్యాన్‌హోల్స్‌ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైఓవర్లపైనా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటివరకు తిరుమలగిరిలో 6.5 సెంటీమీటర్లు, బాలానగర్ 5.5, మల్కాజ్‌గిరి 5.1, షేక్‌పేట 4.8, అసిఫ్‌నగర్ 4.5, వెస్ట్‌మారెడ్ పల్లి 3.9, అల్వాల్ 3.5, శేరిలింగంపల్లి 3.1, ఖైరతాబాద్‌లో 3 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు

హరేరామ హరేకృష్ణ ఆశ్రమాన్ని కూల్చేసిన అధికారులు

యాదగిరిగుట్టలో యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా “హరే రామ హరే కృష్ణ”ఆశ్రమాన్ని నేలమట్టం చేశారు అధికారులు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమాన్ని జేసీబీల సహాయంతో కూల్చివేశారు.
యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను కలుపుతూ యాదాద్రి కొండ చుట్టూ ఆరు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు.
అందులో భాగంగా రోడ్డు నిర్మాణంలో భూమి, ఇళ్లు కోల్పోతున్ననిర్వాసితులకు 2013-భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిస్తోంది ప్రభుత్వం. రీజినల్ రోడ్డు నిర్మాణానికి హరే రామ హరే కృష్ణ ఆశ్రమం అడ్డు వస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఆశ్రమానికి రూ. కోటిన్నర నష్టపరిహారం చట్టప్రకారం డిపాజిట్ చేసింది.
అయినా ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు ఆశ్రమాన్ని తొలగించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చామని ఆర్డీఓ తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా ఆశ్రమ నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాలతో చట్టప్రకారం ఆశ్రమాన్ని నేలమట్టం చేశామని తెలిపారు.
కూల్చివేత సమయంలో ఆశ్రమంలో లభించిన కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామాగ్రిని యాదాద్రి దేవస్థానానికి తరలించారు. కూల్చివేతపై అల్లర్లు చెలరేగేఅవకాశమున్నందున యాదగిరిగుట్టను తమ ఆధీనంలోకి తీసుకుని భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.